సచివాలయాల్లో సాధ్యమేనా?

ABN , First Publish Date - 2022-10-01T04:50:03+05:30 IST

సచివాలయాల్లో సాధ్యమేనా?

సచివాలయాల్లో సాధ్యమేనా?
రిజిస్ట్రేషన్‌ ప్రారంభించనున్న లొద్దపుట్టిలోని గ్రామ సచివాలయం

- అక్టోబరు 2 నుంచి రిజిస్ర్టేషన్లకు సన్నాహాలు

(ఇచ్ఛాపురం రూరల్‌)

గ్రామ/వార్డు సచివాలయాల్లో రిజిస్ర్టేషన్లకు రంగం సిద్ధమవుతోంది. అక్టోబరు 2 నుంచి జిల్లాలో 248 సచివాలయాల్లో ఈ ప్రక్రియ ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కాగా గతంలో ప్రయోగాత్మకంగా రెండు సచివాలయాల్లో ఈ ప్రక్రియ చేపట్టగా.. అర్థాంతరంగా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో రెండో విడతలోనైనా రిజిస్ర్టేషన్ల ప్రక్రియ సాధ్యమేనా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తొలిదశలో జిల్లాలోని నరసన్నపేట, కోటబొమ్మాళి సచివాలయాల్లో ప్రయోగాత్మకంగా రిజిస్ర్టేషన్ల ప్రక్రియ ప్రారంభించారు. రిజిస్ట్రేషన్‌ సజావుగా సాగేందుకు సచివాలయాల్లో పంచాయతీ కార్యదర్శి, డిజిటల్‌ అసిస్టెంట్‌, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. సచివాలయ కార్యదర్శులనే సబ్‌రిజిస్ట్రార్లుగా నియమించింది. గత జనవరి 18 నుంచి ఈ రెండు సచివాలయాల్లో రిజిస్ర్టేషన్లు ప్రారంభించగా.. కేవలం తొమ్మిది మాత్రమే అయ్యాయి. తర్వాత యూజర్‌ ఐడీ సమస్యతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. సచివాలయాల్లో ఆన్‌లైన్‌ వ్యవస్థ అందుబాటులో లేకపోవడంతో స్థానికంగా ఉన్న ఆస్తుల రిజిస్ట్రేషన్లను మాత్రమే చేయాల్సి ఉంటుంది. తాజాగా ప్రభుత్వ ఆదేశాల మేరకు అక్టోబరు 2 నుంచి 248 గ్రామ/వార్డు సచివాలయాల్లో రిజిస్ర్టేషన్లు చేపట్టేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. కాగా ఇంతవరకు రిజిస్ర్టేషన్లకు అవసరమైన సామగ్రి, రికార్డులు సచివాయాలకు రాలేదు. దీంతో ఈ ప్రక్రియ ఎంత వరకు విజయవంతంగా సాగుతుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రోవర్లతో అత్యాధునిక సాంకేతికతతో దేశంలోనే తొలిసారిగా సమగ్ర భూసర్వేను చేపట్టినట్లు ప్రభుత్వం ప్రకటించింది. 2023 జూన్‌ నాటికి ఈ ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశించింది. కానీ, నత్తనడకన ఈ ప్రక్రియ సాగుతోంది. భూకమతం ఒక సర్వే నెంబరు కింద ఉండి, కాలక్రమేణా విభజన జరిగి చేతులు మారినా సర్వే రికార్డులు అప్‌డేట్‌ కాలేదు. దీంతో భూవివాదాలు, రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తుత్తున్నందున భూసర్వే చేపట్టినట్లు పేర్కొంది. భూ సర్వేను ప్రక్షాళన చేసి ప్రతి భూకమతానికి (సబ్‌ డివిజన్‌) విశిష్ట గుర్తింపు సంఖ్యను ఇస్తామన్నా ఆ మేరకు ఎక్కడా ప్రక్రియ నడవలేదు. సాంకేతికపరమైన లోపాలతో ఉన్న భూములు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సజావుగా ఎలా సాగుతుందని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 


ఉత్తర్వులు రావాలి : 

రెండో దశలో సచివాలయాల్లో కొన్నింటిని ఎంపిక చేసి రిజిస్ట్రేషన్ల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నాం. అధికారికంగా ఉత్తర్వులు రావాల్సి ఉంది. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల వారీగా కొన్ని సచివాలయాలను ఎంపిక చేశాం. ఉత్తర్వులు రాగానే చర్యలు చేపడతాం.

- కె.మన్మధరావు, జిల్లా రిజిస్ట్రార్‌, శ్రీకాకుళం 

Updated Date - 2022-10-01T04:50:03+05:30 IST