కాలువ కనిపిస్తే కబ్జానే!

ABN , First Publish Date - 2022-10-01T04:57:40+05:30 IST

కాలువ కనిపిస్తే కబ్జానే!

కాలువ కనిపిస్తే కబ్జానే!

- నరసన్నపేటలో ఆక్రమణల జోరు

- భారీ భవంతులు వెలుస్తున్న వైనం

- అయినా పట్టించుకోని అధికారులు 


సాగునీరు అందించే కాలువలవి. రోజురోజుకూ ఆక్రమణకు గురై కుచించుకు పోతున్నాయి. కబ్జా చేయడం.. భవంతులు నిర్మించడం కొందరు రియల్టర్లకు పరిపాటిగా మారింది. అయినా అధికారులు అస్సలు పట్టించుకోరు. పైగా అక్కడ కాలువ ఉన్నట్లు రికార్డులే లేవని సమాధానం. రియల్టర్ల భూ దాహం, అధికారుల నిర్లక్ష్యం వెరసి రైతులకు శాపంగా మారింది. పొలాలకు నీరందక తీవ్రంగా నష్టపోతున్నారు. 


(నరసన్నపేట) 

నరసన్నపేట పట్టణ శివారు ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలు రావడంతో ఆక్రమణదారులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ స్థలాలతో పాటు సాగునీటి కాలువలను యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారు. ఫలితంగా కాలువలు రోజురోజుకూ కుచించుకుపోయి పొలాలకు సాగునీరు అందని పరిస్థితి నెలకొంది. అధికారుల నిర్లక్ష్యం, క్షేత్రస్థాయి సిబ్బంది తెరవెనుక ఒప్పందాలతో యథేచ్ఛగా కాలువలు ఆక్రమణకు గురవుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

- గొట్టిపల్లి వెళ్లే మార్గంలో జాతీయ రహదారి ఫ్లైఓవర్‌ సమీపంలో సుమారు 500 మీటర్ల వరకు సాగునీటి కాలువ ఆక్రమణకు గురైంది. ఇక్కడ భారీ భవనాలు వెలిశాయి. గొట్టిపల్లి రెవెన్యూ రికార్డుల్లో కాలువ ఉన్నట్లు నమోదు కాలేదని, అందుకు తామేమీ చేయలేమని ఇంజనీరింగ్‌, రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. దీంతో వర్షాలకు జాతీయ రహదారిపై నీరంతా గొట్టిపల్లి అండర్‌ పాసైజ్‌లోకి వచ్చి చేరుతుంది. 

- కంబకాయికు వెళ్లే మార్గంలో కరగాం గ్రామం వద్ద తురకవాని చెరువు నుంచి వచ్చే వరదనీరు కాలువను రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఆక్రమించారు. దీనిపై కంబకాయి, కరగాం గ్రామస్థులు ఫిర్యాదు చేసినా ఇంజనీరింగ్‌ అధికారులు పట్టించుకోవడంలేదు. 

- సాగునీటి కాలువల గట్లను చదును చేసి సత్యనారాయణ కాలనీ సమీపంలోని రియల్‌ ఎస్టేట్‌ స్థలాలకు వెళ్లేందుకు రోడ్లుగా వినియోగించుకుంటున్నారు. 

- మారుతీనగర్‌లో, శ్రీనివాసనగర్‌లో కాలువలు పూర్తిగా కనుమరుగయ్యాయి. 

- పట్టణంలో రాజులు చెరువుకు వెళ్లే మంచినీరు కాలువ కాలేజీ రోడ్డు వద్ద ఆక్రమణకు గురైంది. 

- సత్యనారాయణ నగర్‌, బొరిగివలస వెళ్లేమార్గంలో కాలువ గట్లను ఆక్రమించి భవన నిర్మాణాలు చేపట్టగా.. కామేశ్వరినగర్‌లో కాలువ గట్లనే ఒక రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి రోడ్లుగా మార్చేశాడు.


సాగునీటికి తప్పని ఇబ్బందులు

- 11 ఆర్‌ కిళ్లాం కాలువ నరసన్నపేట నుంచి బొరిగివలస, రావులవలస, శ్రీరామపురం, దేవాది, మాకివలస గ్రామాల్లో సుమారు 4 వేల ఎకరాల వరకు సాగునీరు అందిస్తుంది. ఈ కాలువ నరసన్నపేటలోని హడ్కోకాలనీ, దేశవానిపేట, శివనగర్‌ కాలనీ, కళాసీ కాలనీ, వీరన్నాయుడు కాలనీ వద్ద ఆక్రమణకు గురైంది. కొంతమంది కాలువ స్థలాన్ని కబ్జా చేసి.. అక్రమంగా భవనాలు నిర్మించారు. దీంతో సాగునీటి కోసం ఆయా గ్రామాల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. 

- కరగాంలో తురకవాని చెరువు నుంచి వచ్చే వరద కాలువ ఆక్రమణకు గురైంది. దీంతో నారాయణవలస, కరగాం, జమ్ము గ్రామాల రైతులకు సాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. 

- ఎన్బీసీ కాలువ ఆక్రమణ కారణంగా శివారు ప్రాంతాలకు సాగునీరందడం లేదు. పోలాకి మండలంలో మొన్నటివరకు సాగునీరు అందక ఉబాలు కాలేదు. 

- 8ఆర్‌ దేవాది కాలువను దేవాది వద్ద ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. దీంతో దేవాది, మాకివలస గ్రామాలకు సాగునీరు సక్రమంగా అందడం లేదు. 

- మడపాం టోల్‌ప్లాజా వద్ద కాలువ గట్టును ఆక్రమించడంతో వరదనీరు నిలిచిపోతోంది. చిన్నపాటి వర్షం కురిసినా.. దేవాది, మడపాం, వీఎన్‌పురం పొలాల్లో నీరు నిల్వ ఉండి పంట నష్టం వాటల్లుతోంది. 


దృష్టి సారించాం  

కాలువల ఆక్రమణల నివారణపై దృష్టి సారించాం. కాలువల ఆధునికీకరణ పనుల్లో భాగంగా ఆక్రమణలు తొలగిస్తాం. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల నుంచి స్థలాలు కొనుగోలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. కాలువ పక్కన ఎవరైనా ప్లాట్లు కొనుగోలు చేస్తే దానికి సంబంధించిన రికార్డులను సరి చూసుకోవాలి.

- డోల తిరుమలరావు, వంశధార ఎస్‌ఈ  

Updated Date - 2022-10-01T04:57:40+05:30 IST