ముచ్చటగా మూడేళ్లు

ABN , First Publish Date - 2022-11-25T00:13:54+05:30 IST

పలాసలో కిడ్నీ పరిశోధన కేంద్రం, 200 పడకల ఆస్పత్రి నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. అసలు టీడీపీ హయాంలోనే ఈ రెండింటికి బీజం పడింది. పలాస రైల్వేకాలనీలో 2018 అక్టోబరు 17న ఆస్పత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పద్మనాభపురం వద్ద రూ.50కోట్ల వ్యయంతో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో ఆసుపత్రి నెలకొల్పి ఉచితంగా డయాలసిస్‌ కేంద్రాలతో పాటు రోగులకు కార్పొరేట్‌ తరహాలో వైద్యం అందించాలని అప్పటి సీఎం చంద్రబాబు నిర్ణయించారు. అంతలోనే ఎన్నికలు వచ్చాయి. అయితే వైసీపీ వచ్చాక ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయి.

ముచ్చటగా మూడేళ్లు
నిర్మాణదశలో కిడ్ని పరిశోధన కేంద్రం-ఆసుపత్రి..

- పూర్తికాని కిడ్నీ పరిశోధన కేంద్రం, ఆసుపత్రి నిర్మాణాలు

- రోగులకు తప్పని ఇబ్బందులు

- టీడీపీ హయాంలోనే నిర్మాణానికి శ్రీకారం

- వైసీపీ వచ్చాక నత్తనడకన పనులు

- ఘనత తమదేనని చెప్పుకున్న ముఖ్యమంత్రి జగన్‌

పలాస, నవంబరు 24: పలాసలో కిడ్నీ పరిశోధన కేంద్రం, 200 పడకల ఆస్పత్రి నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. అసలు టీడీపీ హయాంలోనే ఈ రెండింటికి బీజం పడింది. పలాస రైల్వేకాలనీలో 2018 అక్టోబరు 17న ఆస్పత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పద్మనాభపురం వద్ద రూ.50కోట్ల వ్యయంతో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో ఆసుపత్రి నెలకొల్పి ఉచితంగా డయాలసిస్‌ కేంద్రాలతో పాటు రోగులకు కార్పొరేట్‌ తరహాలో వైద్యం అందించాలని అప్పటి సీఎం చంద్రబాబు నిర్ణయించారు. అంతలోనే ఎన్నికలు వచ్చాయి. అయితే వైసీపీ వచ్చాక ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయి. మూడేళ్లయినా ఇప్పటికీ పూర్తికాలేదు. పైగా ఇది తమ ఘనతేనంటూ నరసన్నపేట సభలో సీఎం వైఎస్‌ జగన్‌ తన ఖాతాలో వేసుకున్నారు. సీఎం వ్యాఖ్యలపై జిల్లా ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

ఉద్దానం ప్రాంతంలో వేల సంఖ్యలో కిడ్నీ రోగులు ఉన్నారు. వీరందరికి సరైన వైద్యం, వ్యాధి కారకాలు పరిశోధన చేయాలంటే ఆసుపత్రి ఉండాల్సిందే. ఈ మేరకు ఆసుపత్రి నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినా.. నిధుల సమస్యతో పనులు ముందుకు సాగడం లేదు. తితలీ తుఫాన్‌ సమయంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పలాస వచ్చారు. కిడ్నీ బాధితుల సమస్యలను నేరుగా చూసి.. పలాస రైల్వేకాలనీలో 2018 అక్టోబరు 17న ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇంతలో సార్వత్రిక ఎన్నికలు రావడంతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీన్ని నేరుగా ప్రభుత్వ పర్యవేక్షణలో నిర్మించేందుకు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి 2019 సెప్టెంబరు 6న మరోసారి శంకుస్థాపన చేశారు. కాగా, మూడేళ్లుగా పనులు ప్రాథమిక దశలోనే ఉండడంతో.. నిర్మాణాలు ఎప్పటికి పూర్తవుతాయో తెలియని దుస్థితి నెలకొంది. ప్రస్తుతం 200 పడకల ఆసుపత్రికి సంబంధించి పనులు జరుగుతున్నాయి. ఇంకా పరిశోధన కేంద్రం, వైద్యుల నివాసాలు, గ్రీనరీ, రహదారులు, మంచినీటి వసతుల పనులు చేపట్టాల్సి ఉంది. ఆసుపత్రికి సంబంధించి నిర్మాణాలు పూర్తయినా.. ఇంకా ప్లాస్టరింగ్‌, ఫ్లోరింగ్‌, మెట్లు, పార్కింగ్‌, వివిధ విభాగాలకు చెందిన భవనాలు, పేషెంట్ల కోసం గదులు, డయాలసిస్‌ కేంద్రాలు నిర్మించాల్సి ఉంది. ఇవన్నీ పూర్తవ్వాలంటే కనీసం మరో రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. ఇంతవరకు ఆసుపత్రికి వెళ్లేందుకు రహదారి ఏదనేది అధికారులు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు.

టీడీపీ హయాంలోనే..

కిడ్నీవ్యాధి నిర్మూలనకు గత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లాలో 110 గ్రామాల్లో సమగ్ర సర్వే నిర్వహించింది. మొత్తం 13వేల మంది కిడ్నీ రోగులు ఉన్నట్లు గుర్తించింది. వీరందరికీ సేవలు అందించేలా శ్రీకాకుళం, పాలకొండ, టెక్కలి, పలాస, హరిపురం, సోంపేట, ఇచ్ఛాపురం, కవిటి మండలాల్లోని సీహెచ్‌సీల్లో డయాలసిస్‌ కేంద్రాలు ఏర్పాటు చేసింది. అప్పటి రాష్ట్ర ఆరోగ్యశాఖమంత్రి కామినేని శ్రీనివాస్‌ 2017 ఏప్రిల్‌ 15న వీటిని లాంఛనంగా ప్రారంభించారు. కిడ్నీ బాధితులందరినీ ఆదుకుంటామని అప్పటి సీఎం చంద్రబాబునాయుడు భరోసా ఇచ్చారు. తాజాగా సీఎం జగన్‌.. కిడ్నీ రోగులను టీడీపీ పట్టించుకోలేదని విమర్శించడం చర్చనీయాంశంగా మారింది. టీడీపీ హయాంలోనే కిడ్నీ బాధితుల గుర్తింపు, డయాలసిస్‌ కేంద్రాల ఏర్పాటుతో పాటు ఆస్పత్రి నిర్మాణానికి చర్యలు చేపట్టారని పలువురు చర్చించుకుంటున్నారు. ప్రకటనలు కాకుండా.. ఆస్పత్రి పనులు పూర్తిచేసేలా చర్యలు చేపట్టి.. తమను ఆదుకోవాలని కిడ్నీ బాధితులు కోరుతున్నారు.

Updated Date - 2022-11-25T00:13:54+05:30 IST

Read more