రాయితీ కరువు

ABN , First Publish Date - 2022-09-30T04:05:11+05:30 IST

రాయితీ కరువు

రాయితీ కరువు
పురుగు మందులు స్ర్పే చేస్తున్న రైతు

- గతంలో 50 శాతం సబ్సిడీపై స్ర్పేయర్లు పంపిణీ

- ప్రస్తుతం రైతు గ్రూపులకే పరికరాలు పరిమితం

- అద్దె చెల్లించి వాడుకోవాలంటున్న అధికారులు

(ఇచ్ఛాపురం రూరల్‌)

వ్యవసాయ పరికరాల రాయితీపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. చిన్న, సన్నకారు రైతులకు ఉపయోగపడే పథకాలను నిర్వీర్యం చేస్తోంది. వ్యవయసాయంలో రైతులకు ఎంతో అవసరమైన పిచికారీ యంత్రాలు (స్ర్పేయర్లు)తో పాటు పవర్‌ వీలర్లు, పవర్‌టీలర్లు, బ్రష్‌ కట్టర్లు తదితర పరికరాలను గత ప్రభుత్వం 50 శాతం రాయితీతో అందించేది. ప్రస్తుత ప్రభుత్వం వ్యక్తిగత రాయితీకి ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వలేదు. కేవలం రైతు గ్రూపులకు మాత్రమే కస్టం హైరింగ్‌ సెంటర్ల(సీహెచ్‌సీ) ద్వారా పరికరాలు అందజేస్తోంది. వీటిని అద్దెప్రాతిపదికన రైతులకు ఇస్తున్నారు. కాగా, యంత్రాలు సక్రమంగా అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో సుమారు 6 వేల ఎకరాల్లో వరి, ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. జిల్లాలో 696 రైతుభరోసా కేంద్రాలు(ఆర్బీకే) ఏర్పాటు చేశారు. అన్ని ఆర్బీకేల్లో వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా సీహెచ్‌సీ ఏర్పాటు చేసి యంత్ర పరికరాలు గ్రూపులకు అందజేస్తున్నారు. ఇప్పటివరకు 355 రైతుభరోసా కేంద్రాలకు మాత్రమే స్ర్పేయర్లు అందజేశారు. వచ్చే నెలాఖరు నాటికి 331 ఆర్బీకేలకు స్ర్పేయర్లు అందించనున్నారు. అనంతరం వ్యక్తిగతంగా స్ర్పేయర్లు అందించే అవకాశం ఉందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. కొత్త విధానంలో రైతులు ముందుగా పరికరాల కోసం సొమ్ము చెల్లించాలి. ఏటా స్ర్పేయర్ల ధరలు బాగా పెరుగుతున్నా.. రాయితీ సొమ్ము మాత్రం పెరగడం లేదని, యంత్రాలు సక్రమంగా అందడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. 

 

వ్యక్తిగత రాయితీపై ఇవ్వాలి

అద్దెకు స్రేయర్లను తెచ్చి వాడుకోవడం అన్ని సందర్భాల్లో కుదరడం లేదు. గత ప్రభుత్వంలో మాదిరిగా వ్యక్తిగత రాయితీపై పరికరాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలి. స్రేయర్లతో పాటు అవసరమైన పరికరాలు వ్యక్తిగత రాయితీపై ఇవ్వాలి. ప్రస్తుతం మార్కెట్లో అధిక ధరలకు స్ర్పేయర్లు, ఇతర సామాగ్రి కొనడం భారమవుతోంది.

- డి.దానయ్య, రైతు, శివ క్రిష్ణాపురం.


పరికరాలు సిద్ధం : 

ఆర్బీకేల్లో అద్దె ప్రాతిపధికన యంత్రాలు, స్ర్పేయర్లు, ఇతర పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఆర్బీకేలకు రాయితీపై పరికరాలు అందిస్తున్నాం. జిల్లాలో 355 ఆర్బీకేలకు పరికరాలు అందించాం. అక్టోబరులో  మరో 331 ఆర్బీకేలకు పరికరాలు ఇవ్వాల్సి ఉంది. అనంతరం వ్యక్తిగత పరికరాలు అందజేస్తాం. దీనిపై ఇంకా ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రావల్సి ఉంది. 

- శ్రీధర్‌, జేడీ వ్యవసాయశాఖ, శ్రీకాకుళం.

Read more