పాత విధానంలోనే..

ABN , First Publish Date - 2022-11-30T23:56:43+05:30 IST

పాఠశాల విద్యాశాఖ ప్రయోగాల వేదికగా మారింది. పరీక్ష విధానంలో తెస్తున్న మార్పులు విద్యార్థులకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. ఎఫ్‌ఏ-1 పరీక్షలు ఓఎంఆర్‌ విధానంలో నిర్వహించిన ప్రభుత్వం.. ఎఫ్‌ఏ-2 పరీక్షలను మాత్రం పాత పద్ధతిలో నిర్వహించాలని ఆదేశాలిచ్చింది. శుక్రవారం నుంచి ఎఫ్‌ఏ-2 పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

పాత విధానంలోనే..
పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు

పాత విధానంలోనే..

రేపటి నుంచి ఎఫ్‌ఏ-2 పరీక్షలు

ఓఎంఆర్‌తో ఇబ్బందులతో మార్పు

వాట్సాప్‌ ద్వారా ప్రశ్నపత్రాలు

(నరసన్నపేట)

పాఠశాల విద్యాశాఖ ప్రయోగాల వేదికగా మారింది. పరీక్ష విధానంలో తెస్తున్న మార్పులు విద్యార్థులకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. ఎఫ్‌ఏ-1 పరీక్షలు ఓఎంఆర్‌ విధానంలో నిర్వహించిన ప్రభుత్వం.. ఎఫ్‌ఏ-2 పరీక్షలను మాత్రం పాత పద్ధతిలో నిర్వహించాలని ఆదేశాలిచ్చింది. శుక్రవారం నుంచి ఎఫ్‌ఏ-2 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఎఫ్‌ఏ-1 పరీక్షల్లో 1 నుండి 8 వ తరగతి విద్యార్ధులకు ఓఎంఆర్‌ షీట్‌లో నిర్వహించారు. 9,10 తరగతుల విద్యార్ధులకు మాత్రం పాత విధానంలోనే పరీక్షలు రాయించారు. అయితే ఓఎంఆర్‌ షీట్‌ విధానంలో అనేక తప్పులు దొర్లాయి. దీంతో విద్యార్ధులు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నుంచి వచ్చిన ఒత్తిడులతో ఎఫ్‌ఏ-2 పరీక్షలను పాతవిధానంలో నిర్వహించాలని నిర్ణయించారు. అంటే అన్ని ప్రశ్నలకు సమాధానం పత్రంలోనే జవాబులు రాయాల్సి ఉంటుంది. అకడమిక్‌ క్యాలెండరులో పేర్కొన్న విధంగా ఆయా సబ్జెక్టులకు సంబంధించి ఇచ్చిన సిలబస్‌తోనే ప్రశ్నలు ఉంటాయి.

గంట ముందు ప్రశ్నాపత్రాలు..

గతంలో ఎస్‌ఈఆర్‌టీ అందించే ప్రశ్నపత్రాలను జిల్లా ఉమ్మడి పరీక్షలు బోర్డు ముద్రించి మండల వనరులు కేంద్రానికి పంపించేవారు. సీఆర్‌పీల ద్వారా పాఠశాలలకు అందించేవారు. ప్రశ్నపత్రాలను స్కూల్‌ కాంప్లెక్స్‌లో భద్రపరిచేవారు. అయితే ఈసారి వాట్సాప్‌ ద్వారా ప్రశ్నపత్రాలను హెచ్‌ఎంల మొబైల్‌ ఫోన్లకు పంపుతారు. ముద్రించిన ప్రశ్నపత్రాలు పరీక్షకు ముందే లీక్‌ అవుతున్నట్లు విమర్శలు వస్తున్న నేపధ్యంలో ఏ సబ్జెక్టు రోజు ఆ ప్రశ్నపత్రాన్ని పరీక్ష నిర్వహాణకు గంట ముందు వాట్సాప్‌ చేస్తారు. వాట్సాప్‌లోని ప్రశ్నపత్రాన్ని సంబంధిత ఉపాధ్యాయుడు బోర్డుమీద రాస్తే విద్యార్థులు రాసుకొని... సమాధానాలు రాయాల్సిఉంటుంది.

షెడ్యూల్‌ ఇది..

ఎఫ్‌ఏ-2 పరీక్షలు శుక్రవారం నుంచి నిర్వహిస్తారు. 1 నుంచి 5 తరగతి వరకూ ఉదయం పూట.. 6 నుంచి 8 తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం పరీక్షలు నిర్వహిస్తారు. 9,10 తరగతి విద్యార్థులకు మాత్రం ఉదయం పూట రెండు పరీక్షలు ఉంటాయి. ఈనెల 6 నుండి 10 లోగా మూల్యాంకనం పూర్తి చేయాలి. మాల్యాంకనం చేసిన జవాబు పత్రాలను ప్రభుత్వ పాఠశాలలు అయితే సంబంధిత ఎంఈవోలు, హెచ్‌ఎం ర్యాండమ్‌గా పరిశీలించాలి. ప్రైవేటు పాఠశాలలు అయితే ప్రత్యేక బృందాలు పరిశీలిస్తాయి. ఈనెల 12 నుంచి 18 వరకూ మార్కులను వెబ్‌సైట్‌లో ఆప్‌లోడ్‌ చేయాలి.

Updated Date - 2022-11-30T23:56:46+05:30 IST