ఏజెన్సీలో.. గుప్పుమంటున్న సారా

ABN , First Publish Date - 2022-09-27T05:04:05+05:30 IST

దసరా పండగ నేపథ్యంలో ఏజెన్సీలో సారా గుప్పుమంటోంది. మందస, సోంపేట, పలాస తదితర మండలాల్లో సారా ఏరులై పారుతోంది. రాజకీయ నాయకుల అండ, అధికారుల నిర్లక్ష్యంతో యథేచ్ఛగా విక్రయాలు సాగుతున్నాయి. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు గ్రామాలే సారా తయారీ కేంద్రాలుగా వెలుస్తున్నాయి.

ఏజెన్సీలో.. గుప్పుమంటున్న సారా
ఎస్‌ఈబీ పోలీసులు స్వాధీనం చేసుకున్న బెల్లం ఊటలు(ఫైల్‌)

- దసరా లక్ష్యంగా.. యథేచ్ఛగా తయారీ
- పట్టపగలే విక్రయాలు.. వాహనాల్లో రవాణా
- చోద్యం చూస్తున్న అధికారులు
(హరిపురం)

దసరా పండగ నేపథ్యంలో ఏజెన్సీలో సారా గుప్పుమంటోంది. మందస, సోంపేట, పలాస తదితర మండలాల్లో సారా ఏరులై పారుతోంది. రాజకీయ నాయకుల అండ, అధికారుల నిర్లక్ష్యంతో యథేచ్ఛగా విక్రయాలు సాగుతున్నాయి. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు గ్రామాలే సారా తయారీ కేంద్రాలుగా వెలుస్తున్నాయి. మందస మండలం కొండలోగాం, సవరమధ్య, చీపి, కురడాలు, బుడార్సింగి, బుడంబో, సాభకోట, సింగుపురం, చినకోష్టతో పాటు బాతుపురం, కృష్ణాపురం తీరప్రాంతమైన ఏడూళ్లపాలెం, పెంటిపద్ర, లొత్తూరు, రెంటికోట, గొప్పిలితో పాటు పలుగ్రామాల సరిహద్దుల్లో సారాయి వంటకాలు చేపట్టి ఇతర ప్రాంతాలకు పట్టపగలే రవాణా చేస్తున్నారు. మత్య్సకార, ఉద్దాన గ్రామాలకు ఒడిశా నుంచి సముద్ర మార్గంగుండా తెప్పల ద్వారా సారా రవాణా చేపడుతున్నారు. గుడ్డిమీద బహాడపల్లి, సవరమధ్య, సవర బాణాపురం, సరియాపల్లిలతోపాటు పలు ఉద్దానం గ్రామాల్లో రాత్రి, పగలు తేడా లేకుండా విక్రయిస్తున్నారు. ఈవిషయమై స్థానిక అధికారులకు తెలిసినా చర్యలు లేవు.

ఉదాహరణలివీ..
- మార్చి 21న.. మందస మండలం కొండలోగాం పంచాయితీ పరిధిలో చాపరాయి, ఇంద్రాడివీధి, పట్టులోగాం, బోయినాథ్‌వీధి, కరియాపల్లి గ్రామాల పరిధిలో ఆరు డంప్‌లు ఎస్‌ఈబీ పోలీసులు కనుగొన్నారు. సుమారు 18వేల లీటర్లు బెల్లం ఊటలను ధ్వంసం చేశారు.
- మార్చి 26న.. మందస మండలం పిడిమందస పంచాయితీ సవరమధ్య గ్రామంలో ఎస్‌ఈబీ పోలీసులు దాడులు చేసి సుమారు 3400 లీటర్ల బెల్లం ఊటలు ధ్వంసం చేశారు. ఇంత చిన్న గ్రామంలో భారీస్థాయిలో బెల్లం ఊటలు లభ్యమవడంతో పోలీసులు అవాక్కయ్యారు.
- జూన్‌ 12న మందస మండలం బహాడపల్లి పంచాయితీ నల్లబొడ్లూరులో సారా విక్రయిస్తున్న ఇద్దరు పోలీసులకు పట్టుబడ్డారు. వారి నుంచి 60 లీటర్ల సారాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

రవాణాలోనూ నూతన పద్దతులు..
ఎస్‌ఈబీ, పోలీసు అధికారుల కళ్లుగప్పి పట్టపగలే ఆటోలు, స్కూటర్లు, మారుతి వ్యాన్లులో సారా తరలిస్తున్నారు. రాత్రి సమయంలో గిరిజనులే వారధులుగా కావిడి మోస్తూ మైదాన ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. కావిడి సురక్షితంగా తరలించిన వారికి రూ 500 నుంచి వెయ్యివరకు ఇస్తున్నారు. 20 లీటర్ల సారాను రూ.4వేలకు కొనుగోలు చేసి మరో 20 లీటర్లు నీటిని కలిపి సుమారు రూ.12 వేలకు విక్రయిస్తూ వ్యాపారులు రూ.లక్షల్లో లాభం పొందుతున్నారు. గ్రామాభివృద్ధి పేరుతో ఉద్దానంలో గ్రామపెద్దలే సారా విక్రయించేందుకు అనధికారికంగా వేలం పాటలు నిర్వహిస్తుండడం కొసమెరుపు.

తీవ్ర ప్రభావం..
సారాలో కొంతమంది రంగులు కలిపి గ్రామాల్లో విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. రెండేళ్ల కిందట కొండలోగాం పంచాయతీ రామరాయి సమీపంలో జిల్లాలోనే అతి పెద్ద సారా తయారీ కేంద్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. సారా తయారీలో అధిక మత్తు కోసం బ్యాటరీ పొడి, చెప్పులు, యూరియా, చెట్ల బెరడులు, బెల్లం, కొన్నిరకాల మందులతోపాటు కొన్ని రకాల స్టెరాయిడ్స్‌, స్పిరిట్‌ను కలుపుతున్నారు. దీన్ని సేవించిన వారికి సారాలో ఉండే మిఽథైన్‌ ఆల్కాహాల్‌ వల్ల అధికంగా మత్తు కలిగి గుండె, మూత్రపిండాలు, జీర్ణకోశ, కళ్లు, మెదడు సంబంధ వ్యాధులకు గురవుతున్నారని పలువురు వైద్యులు సైతం హెచ్చరిస్తున్నారు.

కఠిన చర్యలు తప్పవు
సారా తయారీ, విక్రయాలు చేపట్టడం తీవ్ర నేరం. ఇప్పటికే తయారీని పూర్తిగా నిర్మూలించాం. పండగ సందర్భంగా ప్రత్యేక దాడులు నిర్వహిస్తున్నాం. తయారీ చేపట్టినా, అమ్మకాలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటాం. నాటుసారా తాగితే వచ్చే అనర్ధాలను ఇప్పటికే తెలియజేశాం. గ్రామాల్లో వలంటీర్లు సేవలను వినియోగించి నిర్మూలనుకు పూర్తి చర్యలు తీసుకుంటాం.
- వై.వెంకటప్పలనాయుడు, సీఐ, ఎస్‌ఈబీ, సోంపేట.Read more