రాకపోతే.. పథకాలు నిలిపేస్తాం

ABN , First Publish Date - 2022-09-27T04:59:20+05:30 IST

‘వైఎస్సార్‌ చేయూత మూడో విడత సమావేశానికి తప్పనిసరిగా హాజరుకావాలి. లేదంటే మీకు ప్రభుత్వ పథకాలు నిలిచిపోతాయి’ అని స్థానిక వైసీపీ నాయకులు మహిళలను భయపెట్టారు. సమావేశానికి రాకపోతే చేయూత పథకం కింద రూ.18,750 అందవని చెప్పి.. బలవంతంగా సమావేశానికి బయలుదేరించారు.

రాకపోతే.. పథకాలు నిలిపేస్తాం
సమావేశం అవుతుండగానే వెనుదిరిగి వెళ్లిపోతున్న మహిళలు

- వైసీపీ నాయకుల బెదిరింపులు
- ‘చేయూత’ కార్యక్రమం కోసం బలవంతంగా జనసమీకరణ
- రెండున్నర గంటలు ఆలస్యంగా హాజరైన ఎమ్మెల్యే
- నిరీక్షించలేక వెనుదిరిగిన మహిళలు
జి.సిగడాం, సెప్టెంబరు 26:
‘వైఎస్సార్‌ చేయూత మూడో విడత సమావేశానికి తప్పనిసరిగా హాజరుకావాలి. లేదంటే మీకు ప్రభుత్వ పథకాలు నిలిచిపోతాయి’ అని స్థానిక వైసీపీ నాయకులు మహిళలను భయపెట్టారు. సమావేశానికి రాకపోతే చేయూత పథకం కింద రూ.18,750 అందవని చెప్పి.. బలవంతంగా సమావేశానికి బయలుదేరించారు. జి.సిగడాంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో సోమవారం ఉదయం 10 గంటలకు సమావేశమని ప్రకటించారు. వైసీపీ నాయకుల ఒత్తిడితో పనులు మానుకుని.. మహిళలు బలవంతంగా సమావేశానికి హాజరయ్యారు. కాగా.. ఎమ్మెల్యే కిరణ్‌కుమార్‌ రెండున్నర గంటలపాటు ఆలస్యంగా సమావేశానికి చేరుకున్నారు. అంతవరకు నిరీక్షించిన కొందరు మహిళలు విసిగిపోయారు. సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతుండగానే వెనుదిరిగి వెళ్లిపోయారు. స్థానిక నాయకులు అడ్డుకున్నా.. ససేమిరా అన్నారు. ‘పనులు మానుకొని వచ్చాం. ఆకలితో చచ్చాం. మీకు.. మీ సమావేశానికి ఓ దండం’ అంటూ ఇంటిబాట పట్టారు. కొంతమంది నాయకులు తమ గ్రామాల నుంచి సమావేశం కోసం తీసుకొచ్చిన మహిళలకు డబ్బులు పంపిణీ చేశారు.
 
 

Read more