గుప్పెడుపేటలో అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2022-11-12T00:23:03+05:30 IST

పోలాకి మండలం గుప్పెడుపేటలో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. నందుపల్లి దాలమ్మ, బుడగట్ల పైడమ్మ, చెక్క ఎర్రమ్మకు చెందిన ఇళ్లతో పాటు వరుసగా ఉన్న 25 పూరిళ్లు దగ్ధమయ్యాయి. సుమారు రూ.75 లక్షల మేర ఆస్తినష్టం వాటిల్లింది.

గుప్పెడుపేటలో అగ్నిప్రమాదం
మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది

- 25 పూరిళ్లు దగ్ధం

- రూ.75లక్షల ఆస్తి నష్టం

- నిరాశ్రయులైన బాధితులు

గుప్పెడుపేట(పోలాకి), నవంబరు 11: పోలాకి మండలం గుప్పెడుపేటలో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. నందుపల్లి దాలమ్మ, బుడగట్ల పైడమ్మ, చెక్క ఎర్రమ్మకు చెందిన ఇళ్లతో పాటు వరుసగా ఉన్న 25 పూరిళ్లు దగ్ధమయ్యాయి. సుమారు రూ.75 లక్షల మేర ఆస్తినష్టం వాటిల్లింది. శుక్రవారం ఉదయం మత్స్యకారులు వేటకు వెళ్లిపోగా.. తమ పిల్లలను పాఠశాలలకు పంపించేశారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో మంటలు ఎగిసి పడ్డాయి. గ్రామస్థులు వెంటనే కోటబొమ్మాళి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఈలోగా స్థానిక యువకులు కూడా మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనతో బాధితులంతా నిరాశ్రయులయ్యారు. ఇంట్లో సామగ్రి అంతా కాలిబూడిదైపోవడంతో కట్టుబట్టలతో మిగిలారు. దాచుకున్న నగదు కూడా లేక రోడ్డునపడ్డామని బాధితులు లబోదిబోమన్నారు. ఎమ్మెల్యే కృష్ణదాస్‌, ఎంపీపీ ప్రతినిధి ముద్దాడ బైరాగినాయుడు తదితరులు బాధితులను పరామర్శించారు. ప్రభుత్వ పరంగా బాధితులను ఆదుకోవాలని సర్పంచ్‌, ఎంపీటీసీ, మత్స్యకార సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు ఒక్కో బాధిత కుటుంబానికి తక్షణ సాయంగా 10కేజీల బియ్యం, రూ.5వేల నగదును కృష్ణదాస్‌ అందజేశారు. ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

ఎలా జరిగిందో..

అగ్నిప్రమాదం ఎలా సంభవించిందో తెలియదు కానీ.. వరుసగా ఉన్న 25 ఇళ్లు 20 నిమిషాల్లోనే కాలిబూడిదయ్యాయి. విద్యుత్‌ వైర్లు కాలిపోయి.. మంటలు చెలరేగాయి. మరోవైపు గ్యాస్‌ సిలిండర్లు పేలాయి. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పిందని గ్రామస్థులు తెలిపారు. ఇన్‌చార్జి తహసీల్దార్‌ బి.హేమసుందరరావు, ఆర్‌ఐలు కోటేశ్వరరావు, సతీష్‌, ఎంపీడీవో ఎం.ఈశ్వరరావు, వీఆర్వో ప్రమీల సంఘటన స్థలాన్ని పరిశీలించారు. 18 పూరిళ్లు పూర్తిగా.. ఏడు ఇళ్లు పాక్షికంగా కాలిపోయాయని ఇన్‌చార్జి తహసీల్దార్‌ హేమసుందరరావు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నామని, పూర్తిస్థాయిలో నష్టం అంచనా వేస్తామన్నారు.

Updated Date - 2022-11-12T00:23:03+05:30 IST

Read more