‘విత్తన’త్తనడక!

ABN , First Publish Date - 2022-06-12T05:53:36+05:30 IST

ఖరీఫ్‌ సీజన్‌ రానే వచ్చింది. వర్షాలు ఆరంభమవడంతో రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారు. తెగుళ్లు సోకని, అధిక దిగుబడి ఇచ్చే విత్తన రకాల కోసం అన్వేషిస్తున్నారు. రైతుభరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయశాఖ విత్తనాలు పంపిణీ చేస్తోంది. కానీ, వీటికన్నా ప్రైవేటు డీలర్లు విక్రయించే విత్తనాలపై రైతులు ఆసక్తి చూపుతున్నారు.

‘విత్తన’త్తనడక!

ఆర్బీకేల్లో అరకొరగా రిజిస్ర్టేషన్లు

సబ్సిడీ విత్తనాలపై ఆసక్తి చూపని రైతులు

ప్రైవేటు వ్యాపారుల వద్ద కొనుగోలుకు మొగ్గు

(టెక్కలి)

ఖరీఫ్‌ సీజన్‌ రానే వచ్చింది. వర్షాలు ఆరంభమవడంతో రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారు. తెగుళ్లు  సోకని, అధిక దిగుబడి ఇచ్చే విత్తన రకాల కోసం అన్వేషిస్తున్నారు. రైతుభరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయశాఖ విత్తనాలు పంపిణీ చేస్తోంది. కానీ, వీటికన్నా ప్రైవేటు డీలర్లు విక్రయించే విత్తనాలపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. రైతుభరోసా కేంద్రాల వద్ద విత్తనాల రిజిస్ర్టేషన్ల కోసం రైతులు బారులుదీరేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి ఎక్కడా కానరావడం లేదు. విత్తన రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. జిల్లాలో సుమారు లక్షా 60వేల హెక్టార్లలో వరి పండిస్తారు. ఏపీ సీడ్స్‌ ద్వారా 42వేల క్వింటాళ్ల వరి విత్తనాలు రైతుభరోసా కేంద్రాల్లో రైతులకు పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు వారం రోజుల కిందట రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ ప్రారంభించారు. జిల్లాలో శుక్రవారం నాటికి 29,975మంది రైతులు 8,993 క్వింటాళ్ల విత్తనాలకు మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేయించారు. ఇందులో 5,038మంది రైతులు 1,511 క్వింటాళ్ల విత్తనాలకు మాత్రమే డబ్బులు చెల్లించారు. ఉదాహరణకు కోటబొమ్మాళి మండలంలో రైతులకు ఏటా ఖరీఫ్‌ సీజన్‌లో సుమారు 1,400 క్వింటాళ్ల వరి విత్తనాలను వ్యవసాయశాఖ అందజేసేది. ఈసారి కనీసం వంద క్వింటాళ్ల వరి విత్తనాలు కూడా రైతుభరోసా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్‌ చేయించని పరిస్థితి నెలకొంది. దీనిని బట్టి వ్యవసాయశాఖ సరఫరా చేసే విత్తనాలపై రైతులు ఆసక్తి చూపడం లేదని స్పష్టమవుతోంది. 


విత్తన రకాలు ఇవీ.. :

ఈ ఏడాది వ్యవసాయశాఖ రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎంటీయూ7029(స్వర్ణ), శ్రీకాకుళం సన్నాలు, ఎంటీయూ1061, 1064, 1121, 1224, సాంబ రకాల విత్తనాలను సరఫరా చేస్తోంది. 30 కిలోల బస్తాపై రూ.300 సబ్సిడీ అందజేస్తున్నా.. వీటిని కొనుగోలు చేసేందుకు రైతులు ముందుకు రావడం లేదు. ప్రైవేటు వ్యాపారులు విక్రయిస్తున్న  సంపద్‌ స్వర్ణ, కనక్‌ప్లస్‌, ఇండిగో333 వంటి రకాల వరి విత్తనాలపై  ఆసక్తి చూపుతున్నారు. ఈ తరహా విత్తనాలు తెగుళ్లను తట్టుకుని సాధారణం కన్నా.. 25 శాతం అదనపు దిగుబడి ఇస్తాయని పేర్కొంటున్నారు. వచ్చే ఏడాదైనా తెగుళ్లు సోకని, అధిక దిగుడులు ఇచ్చే విత్తనాలు సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయమై వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు బీవీ తిరుమలరావు వద్ద ప్రస్తావించగా ప్రస్తుతం రైతుభరోసా కేంద్రాల్లో విత్తన రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. కొంతమంది రైతులు అధిక దిగుబడి, తెగుళ్ల నివారణపై దృష్టి సారిస్తూ.. ప్రైవేటు డీలర్ల వద్ద విత్తనాలు కొనుగోలు చేస్తున్నారని వెల్లడించారు.  

Read more