ఉద్యోగుల విభజన కొలిక్కి...

ABN , First Publish Date - 2022-04-05T06:00:31+05:30 IST

ఉద్యోగుల విభజన కొలిక్కి...

ఉద్యోగుల విభజన కొలిక్కి...

- విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు పోలీసుల కేటాయింపు

- ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి, ఏప్రిల్‌ 4 : కొత్త జిల్లాల పాలనకు ప్రభుత్వం శ్రీకార చుట్టిన నేపథ్యంలో ఎట్టకేలకు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల విభజన కొలిక్కి వచ్చింది. జిల్లా నుంచి అటు పార్వతీపురం మన్యం జిల్లాకు, ఇటు విజయనగరం జిల్లాకు పలువురు పోలీసులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీ వీరకుమార్‌ను విజయనగరం జిల్లాకు బదిలీ చేసింది. జిల్లా నుంచి పార్వతీపురం మన్యం జిల్లాకు ఒక సీఐ, నలుగురు ఎస్‌ఐలు, ఒక ఏఎస్‌ఐ, నలుగురు హెడ్‌కానిస్టేబుళ్లు, ముగ్గురు కానిస్టేబుళ్లు, ఆరుగురు మినిస్టీరియల్‌ సిబ్బందిని కేటాయించారు. ఇక   విజయనగరం జిల్లాకు నలుగురు ఎస్‌ఐలు, నలుగురు హెడ్‌కానిస్టేబుళ్లు, ఒక మహిళా కానిస్టేబుల్‌, ఇద్దరు కానిస్టేబుళ్లు, మినిస్టీరియల్‌ సిబ్బంది ముగ్గురిని కేటాయించారు. ఈమేరకు డీజీపీ ఉత్తర్వులను జారీ చేశారు. 


రెవెన్యూ పరిధిలో..  

జిల్లాలో రెవెన్యూ ఉద్యోగుల కేటాయింపు కూడా పూర్తయింది. జిల్లా నుంచి పార్వతీపురం మన్యం జిల్లాకు  తహసీల్దార్లు - ముగ్గురు, డిప్యూటీ తహసీల్దార్‌ ఒకరు, సీనియర్‌ అసిస్టెంట్‌లు -2,  జూనియర్‌ అసిస్టెంట్‌లు -2, టైపిస్టు -1, ఆఫీసు సబార్డినేట్‌లు -3 పోస్టులు కేటాయించారు.  విజయనగరం జిల్లాకు సీనియర్‌ అసిస్టెంట్‌లు -2, జూనియర్‌ అసిస్టెంట్‌లు -3, టైపిస్టు ఒకరిని కేటాయించారు. ఈ మేరకు సీసీఎల్‌ఏ ముఖ్యకార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు. 


హౌసింగ్‌ పీడీ హోదా మార్పు..

గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ల హోదాను.. ‘డిస్ర్టిక్ట్‌ హెడ్‌ హౌసింగ్‌’గా ప్రభుత్వం మార్పు చేసింది.  ఈ మేరకు సోమవారం ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి. గృహ నిర్మాణశాఖ పీడీ ఎన్‌.గణపతి.. ఇకపై ‘డిస్ర్టిక్ట్‌ హెడ్‌-హౌసింగ్‌’గా కొనసాగనున్నారు. 


పలాసలో రెవె‘న్యూ’ సేవలు

- ఆర్డీవో కార్యాలయం ప్రారంభం

పలాస/రూరల్‌, ఏప్రిల్‌ 4 : పలాసలో రెవెన్యూ సబ్‌డివిజన్‌ కార్యాలయాన్ని మంత్రి సీదిరి అప్పల రాజు సోమవారం ప్రారంభించారు. మంత్రి సమక్షంలో ఆర్డీవో సీతారామ్మూర్తి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఉద్దానం ప్రజలకు బహుమతిగా పలాస రెవెన్యూ సబ్‌డివిజన్‌ ఇచ్చారు.  గత పాలకులు పలాసను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. సామాజిక మాధ్యమాల్లో నిత్యం ఉండే ప్రతిపక్ష నాయకులు వారి మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలి. వారికి అభివృద్ధితోనే సమాధానం చెబుతామ’ని తెలిపారు. కళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌ పేరాడ తిలక్‌ మాట్లాడుతూ నందిగాం ప్రజలకు పలాస దూరమవుతున్నా ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధికి సహకరిస్తామని చెప్పారు. వైసీపీ సీనియర్‌ నాయకుడు పిరియా సాయిరాజ్‌ మాట్లాడుతూ గ్రామస్థాయిలో ప్రభుత్వ పథకాలు అందించే ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ శివరామిరెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ బళ్ల గిరిబాబు, వైసీపీ నాయకుడు నర్తు రామారావు, ఎనిమిది మండలాల  తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు. 


కొలువుదీరారు

- అధికారుల బాధ్యతల స్వీకరణ

కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 4 : పునర్వవ్యవస్థీకరణలో భాగంగా కొత్త జిల్లాల పాలన ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో జిల్లాకు కొత్తగా నియమితులైన వివిధ శాఖల అధికారులు సోమవారం కొలువుదీరారు. కార్యాలయాల్లో బాధ్యతలు స్వీకరించారు. 

- కలెక్టరేట్‌లో కీలక విభాగమైన రెవెన్యూకు సంబంధించి జిల్లా రెవెన్యూ అధికారిగా కె.రాజేశ్వరి బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు ఉన్న డీఆర్వో దయానిధి అల్లూరి సీతారామరాజు జిల్లాకు బదిలీపై వెళ్లారు.

- జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ పీడీగా కె.అనంత లక్ష్మి బాధ్యతలు స్వీకరించారు. తొలుత పీడీగా పనిచేసిన జి.జయదేవి అల్లూరి సీతారామరాజు జిల్లాకు బదిలీపై వెళ్లారు.

- జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిగా ఇ.అనూరాధ బాధ్యతలు స్వీకరించారు. 

- జిల్లా ఉద్యాన శాఖ అధికారిగా రత్నాలు వరప్రసాద్‌ బాధ్యతలు చేపట్టారు. ఆయన గతంలో టెక్కలి, సీతంపేట, పార్వతీపురం ప్రాంతాల్లో ఉద్యాన శాఖ సహాయ సంచాలకులుగా పనిచేశారు. ఇదిలా ఉండగా బాధ్యతల స్వీకరణ అనంతరం  డీఆర్వో రాజేశ్వరి, బీసీ సంక్షేమశాఖ అధికారి అనూరాధ తదితరులు కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. 

 

డీఈవోగా పగడాలమ్మ

గుజరాతీపేట : జిల్లాల పునర్విభజన నేపథ్యంలో జరిగిన అధికారుల కేటాయింపులో  డీఈవో (ఎఫ్‌ఏసీ)గా జి.పగడాలమ్మ సోమవారం బాధ్యతలు చేపట్టారు. డీఈవోను రాష్ట్ర భాషోపాధ్యాయ సంఘం(ఎస్‌ఎల్‌టీఏ) జిల్లా అధ్యక్షుడు పిసిని వసంతరావు, ప్రధాన కార్యదర్శి కూన రంగనాయకులు, కోశాధికారి నెయ్యల చంద్రరావు, సహాధ్యక్షుడు కుప్పన్న గారి శ్రీనివాసరావు తదితరులు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. 

 

టెక్కలి ఆర్డీవోగా జయరాం  

టెక్కలి : టెక్కలి ఆర్డీవోగా హనుమంతు జయరాం బాధ్యతలు స్వీకరించారు. కొవ్వాడ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయన ఇక్కడికి బదిలీపై వచ్చారు. సబ్‌ కలెక్టర్‌ వికాస్‌ మర్మట్‌ సచివాలయాల జాయింట్‌ డైరెక్టర్‌గా బదిలీ అయిన విషయం విదితమే. ఈ సందర్భంగా పలువురు అధికారులు మర్యాదపూర్వకంగా ఆయనను కలిసి అభినందించారు. 


Updated Date - 2022-04-05T06:00:31+05:30 IST