పరీక్షలు సరే.. ఫలితాలు ఏవీ?

ABN , First Publish Date - 2022-09-29T04:26:10+05:30 IST

జిల్లా స్త్రీ, శిశు సంక్షేమశాఖలో(ఐసీడీఎస్‌) అంగన్‌వాడీ గ్రేడ్‌-2 సూపర్‌వైజర్‌ (పర్యవేక్షకులు) పోస్టుల ఎంపిక ప్రక్రియపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 18న విశాఖపట్నంలో రాత పరీక్ష నిర్వహించారు. జిల్లా నుంచి 1400 మంది పరీక్ష రాశారు. పరీక్ష పూర్తయిన తర్వాత ‘కీ’ కానీ, ఫలితాలను కానీ అధికారులు విడుదల చేయలేదు.

పరీక్షలు సరే.. ఫలితాలు ఏవీ?

అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ పోస్టుల ఎంపికపై అనుమానాలు
రిజల్డ్‌ వెల్లడించకుండానే ఎంపిక ప్రకటన
(ఇచ్ఛాపురం రూరల్‌)

జిల్లా స్త్రీ, శిశు సంక్షేమశాఖలో(ఐసీడీఎస్‌) అంగన్‌వాడీ గ్రేడ్‌-2 సూపర్‌వైజర్‌ (పర్యవేక్షకులు) పోస్టుల ఎంపిక ప్రక్రియపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విశాఖ జోన్‌ పరిధిలో 76 పోస్టులకుగాను 5,390 మంది దరఖాస్తు చేశారు. 5,117 మందికి హాల్‌టికెట్లు జారీ చేయగా.. 3400 మంది పరీక్షకు హాజరయ్యారు. ఈ నెల 18న విశాఖపట్నంలో రాత పరీక్ష నిర్వహించారు. జిల్లా నుంచి 1400 మంది పరీక్ష రాశారు. పరీక్ష పూర్తయిన తర్వాత ‘కీ’ కానీ, ఫలితాలను కానీ అధికారులు విడుదల చేయలేదు. మూడు రోజుల కిందట జోన్‌ ఫరిధిలో 76 పోస్టులకు గాను 1:2 నిష్పత్తి ప్రకారం 152 మంది, జిల్లా నుంచి 45 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు అధికారులు ప్రకటించారు. వృత్తికి సంబంధించి అంశాలపై ఆంగ్లంలో మాట్లాడి మూడు నిమిషాల నిడివి కలిగిన వీడియో రికార్డును సంబంధిత పీడీకి పంపాలని ఎంపికైన అభ్యర్థులకు సంక్షిప్త సమాచారం పంపారు. 45 మార్కులకు పరీక్ష నిర్వహించగా.. స్పోకెన్‌ ఇంగ్లీష్‌ ఆడియోకు 5 మార్కులు కలుపనున్నారు. ఈ రెండింటిలో అర్హత సాధించినవారికి సూపర్‌వైజర్‌ పోస్టులు కేటాయిస్తారు. కాగా.. ఈ వ్యవహారంపై పరీక్ష రాసిన అభ్యర్థుల్లో అనేక అనుమానాలు నెలకొన్నాయి. జిల్లాలో ఔట్‌సోర్సింగ్‌ మొదలుకుని.. ఏ ఉద్యోగ నియామకాలు చేపట్టినా కొందరు నేతలు పైరవీలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. సూపర్‌వైజర్‌ పోస్టులకు వేతనం రూ.35 వేల వరకు ఉండడంతో.. అభ్యర్థుల ఎంపికలో రాజకీయ జోక్యం చేసుకుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కీ, రాత పరీక్షల ఫలితాలు విడుదల చేయకుండానే.. కొందరి పేర్లు మాత్రమే ఎంపిక చేస్తున్నట్టు ప్రకటించడం అన్యాయమని అంగన్‌వాడీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించి అర్హులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. లేదంటే ఆందోళన చేస్తామని అంగన్‌వాడీ ఉద్యోగుల అసోసియేషన్‌ నాయకులు తెలిపారు.

అక్రమాలు జరిగాయి
అంగన్‌వాడీ గ్రేడ్‌-2 సూపర్‌వైజర్‌ పరీక్షల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఆగమేఘాల మీద నోటిఫికేషన్‌ ఇచ్చి.. హడావుడిగా పరీక్ష నిర్వహించారు. కనీసం కీ విడుదల చేయకుండా.. రాత పరీక్ష ఫలితాలు ప్రకటించకుండా నాయకులు, అధికారులు కుమ్మకై అర్హులకు అన్యాయం చేశారు. పరీక్షను రద్దు చేసి మళ్లీ పరీక్షలు నిర్వహించాలి.
- ఎం.జయలక్ష్మీ, అంగన్‌వాడీ జిల్లా గౌరవ అధ్యక్షురాలు, శ్రీకాకుళం.

ఎంపిక మా చేతుల్లో లేదు :
సూపర్‌వైజర్ల ఎంపిక అనేది మా చేతుల్లో లేదు. జిల్లాకు సంబంధించి 1ః2 నిష్పత్తి మెరిట్‌ ఆధారంగా 45 మంది జాబితాను పంపించారు. వారితో స్పోకెన్‌ ఇంగ్లీషు మూడు నుంచి 5 నిమిషాల వీడియోను ఉన్నతాధికారులకు పంపించాం. మిగతా విషయాలు మాకు తెలియదు.
- కె.అనంతలక్ష్మీ, పీడీ, ఐసీడీఎస్‌ శ్రీకాకుళం.

 
 

Updated Date - 2022-09-29T04:26:10+05:30 IST