పంచాయతీలకు డిజిటల్‌ టోకెన్లు

ABN , First Publish Date - 2022-02-20T05:06:11+05:30 IST

పంచాయతీల్లో పారదర్శకంగా నిధుల వినియోగానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇటీవల విడుదలైన 15వ ఆర్థిక సంఘ నిధులను రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ బిల్లులకు మళ్లించింది. దీంతో పంచాయతీల ఖాతాలు ఖాళీ అయ్యాయి. కేంద్రం విడుదల చేసిన నిధులను గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు వినియోగించుకోలేకపోతున్నామని సర్పంచులు ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘ నిధులను నేరుగా పంచాయతీలకు కేటాయించే దిశగా ఏర్పాట్లు చేసింది.

పంచాయతీలకు డిజిటల్‌ టోకెన్లు
బూర్జపాడు పంచాయతీ

- ఇక పారదర్శకంగా నిధుల వినియోగం

(ఇచ్ఛాపురం రూరల్‌)

పంచాయతీల్లో పారదర్శకంగా నిధుల వినియోగానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇటీవల విడుదలైన 15వ ఆర్థిక సంఘ నిధులను రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ బిల్లులకు మళ్లించింది. దీంతో పంచాయతీల ఖాతాలు ఖాళీ అయ్యాయి. కేంద్రం విడుదల చేసిన నిధులను గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు వినియోగించుకోలేకపోతున్నామని సర్పంచులు ఆవేదన చెందుతున్నారు. నిధుల లేమితో అభివృద్ధి పనులు చేయలేకపోతున్నామని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘ నిధులను నేరుగా పంచాయతీలకు కేటాయించే దిశగా ఏర్పాట్లు చేసింది. వీటి వినియోగానికి సంబంధించి ప్రత్యేకంగా డిజిటల్‌ టోకెన్‌లు జారీ చేయాలని ఆదేశించింది. జిల్లా అధికారులు ఆ దిశగా కార్యాచరణకు సిద్ధమవుతున్నారు.


ప్రతి పంచాయతీకి రెండు 

పంచాయతీలకు కేటాయించే నిధుల వినియోగం సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా కొనసాగుతుంది. ఖాతాలో ఉన్న వాటికి సంబంధించి సర్పంచ్‌, కార్యదర్శి బయోమెట్రిక్‌ వేస్తే ఖజానా శాఖ నుంచి నిధులు జమయ్యేవి. ప్రస్తుతం ఈ విధానంలో మార్పులు చేశారు. కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకున్నారు. కేవలం ఆర్థిక సంఘ నిధుల వినియోగానికి సంబంధించి పంచాయతీలకు ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలు తెరిచారు. సర్పంచ్‌కు ఒకటి, కార్యదర్శికి ఒకటి చొప్పున రెండు టోకెన్లు జారీ చేయనున్నారు. పబ్లిక్‌ ఫైనాన్స్‌మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (పీఎఫ్‌ఎంఎస్‌) ద్వారా నిధులు వినియోగించుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ గ్రామ స్వరాజ్య వెబ్‌సైట్‌కు పీఎఫ్‌ఎంఎస్‌ను అనుసంధానించారు. పంచాయతీ నిధులకు సంబంధించిన జమ, ఖర్చులన్నీ వీటి ద్వారానే నిర్వహించాలి. ఈ విషయంలో పంచాయతీ కార్యదర్శి బిల్లు పెడితే సర్పంచ్‌ తన టోకెన్‌ ద్వారా లాగిన్‌ అయి అప్రూవల్‌ చేస్తారు. ఇలా సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నిధుల వినియోగం పారదర్శకంగా జరిగేలా ఏర్పాట్లు చేశారు. 


పంపిణీ వేగవంతమయ్యేనా?

జిల్లా ఇప్పటికే టోకెన్‌ జారీ ప్రక్రియ ప్రారంభించినా.. ఇంకా చాలా మందికి అందలేదు. జిల్లావ్యాప్తంగా 1,181 పంచాయతీలకు గానూ 2,362 డిజిటల్‌ టోకెన్లు పంపిణీ చేయాలి. ఇప్పటి వరకు నాలుగు మండలాలకు మాత్రమే వీటిని అందజేసినట్లు అధికారులు చెబుతున్నారు. సర్వర్‌ మొరాయించడంతో వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులు ఎక్కువ సమయం నిరీక్షించాల్సి వస్తోంది. వివిధ పంచాయతీల్లో చేసిన పనులకు  బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నిధులు పంచాయతీ ఖాతాలకు విడుదల కావాలంటే డిజిటల్‌ టోకెన్‌ అవసరం. క్షేత్రస్థాయిలో సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించి టోకెన్‌లు అందజేయాలని సర్పంచ్‌లు కోరుతున్నారు. 


ఆందోళన వద్దు

జిల్లాలోని అన్ని పంచాయతీలకు టోకెన్లు అందజేస్తున్నాం. ఇందుకు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. చిన్న చిన్న సమస్యలు ఎదురైనా వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నాం. త్వరలోనే డిజిటల్‌ టోకెన్ల పంపిణీ ప్రక్రియ పూర్తిచేస్తాం. దీనికి సంబంధించి డీఎల్‌పీవోలకు కూడా ఆదేశాలు జారీ చేశాం. సర్పంచులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 

- రవికుమార్‌, డీపీవో, శ్రీకాకుళం.

Read more