అమ్మో డెంగ్యూ!

ABN , First Publish Date - 2022-08-01T05:59:40+05:30 IST

డెంగ్యూ.. ఈ మాట వింటేనే జిల్లా ప్రజలు హడలెత్తిపోతున్నారు. తొలుత చిన్నపాటి జ్వరంగా ప్రారంభమై విశ్వరూపం చూపుతోంది. రక్తకణాలు తగ్గుముఖం పట్టినా ప్రమా

అమ్మో డెంగ్యూ!
రణస్థలంలో పారిశుధ్యం దుస్థితి

 సీజన్‌ ప్రారంభంలోనే వణుకు పుట్టిస్తున్న మహమ్మారి

 ఫలితమివ్వని డెంగ్యూ  నివారణ మాసోత్సవాలు

గ్రామాల్లో అవగాహన కరువు

 జిల్లాలో వందలాది కేసులు నమోదు

 పదుల సంఖ్యలో చూపిస్తున్న అధికారులు 

(రణస్థలం)

డెంగ్యూ.. ఈ మాట వింటేనే జిల్లా ప్రజలు హడలెత్తిపోతున్నారు. తొలుత చిన్నపాటి జ్వరంగా ప్రారంభమై విశ్వరూపం చూపుతోంది. రక్తకణాలు తగ్గుముఖం పట్టినా ప్రమాదభరితంగా మారుతోంది. అందుకే చిన్నపాటి జ్వరం వచ్చినా ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. సీజన్‌ ప్రారంభం నుంచే డెంగ్యూ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. అధికారులు మాత్రం పదుల సంఖ్యలో నమోదయ్యాయని చెబుతున్నారు. కానీ ఆ సంఖ్య ఎక్కువేనని ప్రైవేటు వైద్యులు చెబుతున్నారు. జూలై 1 నుంచి 31 వరకూ డెంగ్యూ నియంత్రణ మాసోత్సవాలను నిర్వహించినా ఆశించిన స్థాయిలో ఫలితమివ్వలేదు.

సాధారణంగా జూలై నుంచి అక్టోబరు వరకూ నాలుగు నెలల పాటు వ్యాధుల సీజన్‌. వర్షాలు పడడం, వాతావరణంలో మార్పులతో జ్వరాలు అధికంగా ప్రబలుతుంటాయి. అయితే ముందస్తు చర్యలు చేపట్టడంలో వైద్య ఆరోగ్యశాఖ ఆశించినంతగా పనిచేయలేకపోతోంది. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి ఉంది. మలేరియా, టైఫాయిడ్‌తో పాటు డెంగ్యూ జ్వరాలు ప్రబలుతున్నాయి. ఇప్పటివరకూ 15 డెంగ్యూ, 4 మాత్రమే మలేరియా జ్వరాలు నమోదైనట్టు అధికారులు చెబుతున్నారు. అయితే వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేటు ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతూ కనిపిస్తున్నాయి. మూడేళ్ల కిందట జిల్లాలో డెంగ్యూ జ్వరాలు కలవరపాటుకు గురిచేశాయి. ఈ నేపథ్యంలో అటువంటి పరిస్థితి రాకుండా వైద్య ఆరోగ్య శాఖ జూలై 1 నుంచి 31 వరకూ డెంగ్యూ నియంత్రణ మాసోత్సవాలను నిర్వహించింది. కానీ కార్యక్రమం తూతూమంత్రంగా సాగినట్టు విమర్శలున్నాయి. 


 జిల్లాలో ఇదీ పరిస్థితి..

జిల్లా వ్యాప్తంగా 68 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, 10 సామాజిక ఆరోగ్యకేంద్రాలు , 300 వరకు ఉపకేంద్రాలు, ఒక ఏరియా ఆసుపత్రి, ఒక జిల్లా ఆసుపత్రి, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఉన్నాయి. అయితే  ఈ వైద్యశాలల్లో సరైన వైద్యం అందక పేదలు ప్రైవేటు  ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. శ్రీకాకుళం  నగరంలో డెంగ్యూ  కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్టు తెలుస్తోంది.  పలాస-కాశీబుగ్గ, ఇచ్ఛాపురం, ఆమదాలవలస మునిసిపాల్టీలతో పాటు టెక్కలి, పాతపట్నం, నరసన్నపేట, తదితర మండలాల్లో  డంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. సాధరణ జ్వరంగా బావించి  చికిత్స  పొందుతున్న వ్యాధిగ్రస్తులు నిర్థారణ పరీక్షలలో డెంగ్యూగా  తేలడంతో ప్రైవేట్‌ ఆసుపత్రులకు క్యూకడుతున్నారు. శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రితో పాటు ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఇక్కడ నయం కాకుంటే మెరుగైన వైద్యం కోసం విశాఖ వెళుతున్నారు.

ఫ మార్గదర్శకాలేవీ?

  డెంగ్యూ నిర్థారణలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని మార్గదర్శకాలను సూచించింది. ర్యాపిడ్‌ పరీక్షద్వారా ద్వారా  డెంగ్యూ నిర్థారణ అయితే  వైద్య  చికిత్సలు  అందించాలి. అయితే వైద్య ఆరోగ్యశాఖ మాత్రం ర్యాపిడ్‌  పరీక్షలో  గుర్తించిన డెంగ్యూను  పరిగణలోకి తీసుకోమంటూ తేల్చి చెబుతోంది. ఎలీషా పరీక్ష తప్పనసరి అంటోంది. అందులోనూ ప్రైవేటు ఆసుపత్రులలో చేసే పరీక్షలను  పరిగణలోకి తీసుకోమంటున్నారు. కేవలం  ప్రభుత్వ సర్వజన ఆసుపత్రితో పాటు గుర్తించిన ఆస్పత్రుల్లో నిర్థారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఎలీషా పరీక్షలు  చేసేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఎలాంటి ఏర్పాట్లు లేవు.Read more