దిగజారిన రాష్ట్ర ప్రతిష్ఠ

ABN , First Publish Date - 2022-12-05T00:07:51+05:30 IST

‘రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యాయి. అన్ని వర్గాల ప్రజలూ ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ మూడున్నరేళ్ల పాలనలో రాష్ట్ర ప్రతిష్ఠ దిగజారిపోయింద’ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు.

దిగజారిన రాష్ట్ర ప్రతిష్ఠ
టెక్కలి: భగవాన్‌పురంలో పర్యటిస్తున్న అచ్చెన్నాయుడు

- ‘ఇదేం ఖర్మ మన బీసీ’లకు పేరుతో నిరసనలు చేపట్టండి

- టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు

టెక్కలి, డిసెంబరు 4: ‘రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యాయి. అన్ని వర్గాల ప్రజలూ ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ మూడున్నరేళ్ల పాలనలో రాష్ట్ర ప్రతిష్ఠ దిగజారిపోయింద’ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఆదివారం టెక్కలి, భగవాన్‌పురం ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. జగన్‌రెడ్డి పాలన ఈ రాష్ట్రానికి పట్టిన శని.. మన ఖర్మ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో 52శాతం వెనుకబడిన తరగతులు ఉన్నా, బీసీలు అణిచివేతకు గురవుతున్నారని, వెనుకబడిన తరగతుల మధ్య వైసీపీ ప్రభుత్వం విభేదాలు సృష్టిస్తోందన్నారు. ‘ఇదేం ఖర్మ మన బీసీ’లకు పేరుతో సోమవారం టీడీపీ శ్రేణులంతా నిరసన చేపట్టి తహసీల్దార్‌కు వినతిపత్రాలు అందజేయాలని తెలిపారు. బీసీ మంత్రులంతా ముఖ్యమంత్రి దగ్గర చేతులు కట్టుకొని నిల్చోవడం తప్ప.. బీసీల గురించి మాట్లాడలేరన్నారు. రాష్ట్రంలో చేతివృత్తులు, కులవృత్తులను ఆదుకోవడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. 55 కార్పొరేషన్లు పెట్టి.. ఏ ఒక్క కార్పొరేషన్‌కూ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదన్నారు, కార్పొరేషన్లు అలంకార ప్రాయంగా మిగిలాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుతో బీసీలు ఆర్థిక, సామాజిక, రాజకీయంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలపై సవతితల్లి ప్రేమ చూపిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం అసలు లేదని, ఒకే కులస్తులంతా చక్రం తిప్పుతున్నారని ఆరోపించారు. జగన్‌రెడ్డి బ్లాక్‌మెయింగ్‌ వలనే పరిశ్రమలు వెనక్కి మళ్లుతున్నాయని, మూడున్నరేళ్లుగా రాష్ట్రానికి శని దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో ప్రవేశపెట్టిన ఆదరణ వంటి పథకాలు పునరుద్ధరించాలని, కార్పొరేషన్లకు నిధులు కేటాయించాలని, షరతులు లేకుండా విదేశీ విద్యా పథకాన్ని కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పినకాన అజయ్‌కుమార్‌, బగాది శేషగిరి, బోయిన రమేష్‌, జీరు భీమారావు, అట్టాడ రవిబాబ్జీ, హనుమంతు రామకృష్ణ, మెండ దమయంతి, మళ్ల బాలకృష్ణ, రెయ్యి ప్రీతీష్‌, ప్రసాద్‌రెడ్డి ఉన్నారు.

Updated Date - 2022-12-05T00:07:55+05:30 IST