ఖరీఫ్‌ నాటికి సాగునీరు

ABN , First Publish Date - 2022-05-19T04:50:59+05:30 IST

రానున్న ఖరీఫ్‌ నాటికి పూర్తిస్థాయిలో సాగునీరందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం తన కార్యాలయ సమావేశ మందిరంలో నీటి పారుదల సలహా మండలి 28వ సమావేశం, వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించారు.

ఖరీఫ్‌ నాటికి సాగునీరు
మాట్లాడుతున్న కలెక్టర్‌ లఠ్కర్‌

ప్రాజెక్టుల పనులు వేగవంతం చేయండి
 కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌
కలెక్టరేట్‌, మే 18 :
రానున్న ఖరీఫ్‌ నాటికి పూర్తిస్థాయిలో సాగునీరందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం తన కార్యాలయ సమావేశ మందిరంలో నీటి పారుదల సలహా మండలి 28వ సమావేశం, వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గత సమావేశంలో ప్రస్తావించిన అంశాలపై చర్చించారు. ఈ ఏడాది రుతు పవనాలు ముందుగా వచ్చే అవకాశం ఉన్నందున, జూన్‌ 15 నాటికి సాగునీరు విడుదల చేసేందుకు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ‘ప్రాజెక్టుల పనులు వేగవంతం చేయండి. నీటి తీరువా వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలి. బిల్లులు పెండింగ్‌లు లేవని పనులు పురోగతి సాధించేలా చూడాలి. పనుల్లో రోజువారి ప్రగతి కనిపించాలి. మిగిలిన పనులకు సంబంధించి రెండు, మూడు రోజులకు ఒకసారి బిల్లులు అప్‌లోడ్‌ చేయాలి. నిర్వాసితులకు కోసం నిధులు మంజూరు చేశామ’ని కలెక్టర్‌ తెలిపారు. మాజీ డిప్యూటీ సీఎం, నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ మాట్లాడుతూ... ఉపాధిహామీ పథకం ద్వారా ఛానల్‌ పనులు చేపట్టాలని సూచించారు. సమావేశంలో జేసీ ఎం.విజయసునీత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌, పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి, డీసీసీబీ చైర్మన్‌ కరిమి రాజేశ్వరరావు, ఆర్డీవో బి.శాంతి, డ్వామా పీడీ ఎం.రోజారాణి పాల్గొన్నారు.

Updated Date - 2022-05-19T04:50:59+05:30 IST