కాంట్రాక్టర్ల గగ్గోలు

ABN , First Publish Date - 2022-09-17T06:20:16+05:30 IST

పాడేరు డివిజన్‌లోని పలు మండలాల్లో మూడేళ్ల క్రితం గిరిజన హాస్టళ్లకు భవనాలు నిర్మించారు.

కాంట్రాక్టర్ల గగ్గోలు
అరకులోయ మండలం బొండాం పంచాయతీ బొడ్డకొత్తవలస- జయంతివలస గ్రామాల మధ్య గెడ్డపై నిలిచిపోయిన వంతెన నిర్మాణం

‘గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్‌’లో పేరుకుపోయిన బిల్లులు

రూ.15 కోట్ల వరకూ పెండింగ్‌

మూడేళ్ల క్రితం చేసిన పనులకూ ఇప్పటికీ విడుదల కాని నిధులు

కొంతమంది న్యాయస్థానానికి... 

కొత్తపనుల చేపట్టేందుకు ముందుకురాని వైనం

అధికారులు పలుమార్లు టెండర్లు పిలిచినా స్పందన నిల్‌


విశాఖపట్నం/అరకులోయ, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి):

పాడేరు డివిజన్‌లోని పలు మండలాల్లో మూడేళ్ల క్రితం గిరిజన హాస్టళ్లకు భవనాలు నిర్మించారు. ఇందుకోసం రూ.50 లక్షలు చొప్పున వెచ్చించారు. పనులు పూర్తిచేసి ఎం.బుక్‌లో రికార్డు చేసి బిల్లులను సీఎంఎఫ్‌ఎస్‌కు అప్‌లోడ్‌ చేశారు. అయితే ఇప్పటివరకు బిల్లులు రాకపోవడంతో కొందరు  కాంట్రాక్టర్లు విసుగుచెంది కోర్టును ఆశ్రయించారు. 

అరకులోయలో కో-ఎడ్యుకేషన్‌ డిగ్రీ కళాశాల భవనం నిర్మాణానికి రూ.కోటితో గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్‌ శాఖ ఈ ఏడాది మార్చిలో టెండర్లు ఆహ్వానించింది. తొలిసారి  ఎవరూ ముందుకురాకపోవడంతో రెండోసారి పిలిచారు. అయినా ఎవరూ ముందుకురాలేదు. చేసిన పనులకు బిల్లులు లేకపోవడంతో కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకురావడం లేదు. ఇదే మండలంలో జయంతివలస-బోండాం కొత్తవలస మధ్య వంతెన పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌...బిల్లులు ఆలస్యం అవుతున్నాయని అసంపూర్తిగా వదిలేశారు.

గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్‌ శాఖకు సంబంధించిన పనులు చేసిన కాంట్రాక్టర్లు బిల్లుల కోసం మూడేళ్ల నుంచి అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 50 నుంచి 60 పనులకు సంబంధించి రూ.15 కోట్ల వరకు బిల్లులు పేరుకుపోయాయి. తెలుగుదేశం హయాంలో రోడ్లు, భవనాలు, వరద కట్టలు, వంతెనలు, హాస్టళ్ల భవనాల నిర్మాణాలకు పెద్దఎత్తున నిధులు విడుదల చేశారు. దీంతో పాడేరు, అరకులోయ డివిజన్‌లలో పనులు చేపట్టడానికి కాంట్రాక్టర్లు ముందుకువచ్చారు. కొన్ని పనులకు పార్టు పేమెంట్‌ కింద బిల్లులు మంజూరుకావడంతో మిగిలిన పనులు పూర్తికి కాంట్రాక్టర్లు ఉత్సాహం చూపారు. ఈలోగా 2019లో ప్రభుత్వం మారడంతో అన్ని శాఖల మాదిరిగానే గిరిజన సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్లకు కష్టాలు మొదలయ్యాయి. అప్పటివరకు పూర్తిచేసిన పనులకు బిల్లులు లేవు సరికదా ఆ తరువాత చేపట్టిన పనులను ఎం.బుక్‌లో నమోదుచేసి బిల్లులు సీఎంఎఫ్‌ఎస్‌కు అప్‌లోడ్‌ చేసినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. అప్పులు చేసి పనులు పూర్తిచేసి మూడేళ్లు అయినా బిల్లులు రాకపోవడంతో పాత అప్పులు తీర్చేందుకు మరొకరి దగ్గర అప్పులు చేయాల్సి వస్తోందని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. మూడేళ్ల నుంచి బిల్లుల కోసం ఎదురుచూసిన కాంట్రాక్టర్లు సుమారు పది నుంచి 15 మంది కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కోర్టు నుంచి నోటీసులు రావడంతో ఇంజనీరింగ్‌ అఽఽధికారులు పరుగులు పెడుతున్నారు. ఇద్దరు, ముగ్గురు కాంట్రాక్టర్లకు బిల్లులు బట్వాడా చేయాలని కోర్టు ఆదేశించిందని అధికారులు చెబుతున్నారు. అయితే విశాఖ సర్కిల్‌లో పెండింగ్‌ బిల్లుల వివరాలు బయటకు చెప్పడానికి అధికారులు సుముఖత వ్యక్తం చేయడం లేదు. 


ఇదిలావుండగా గత ప్రభుత్వం చివరి ఏడాదిలో చేపట్టిన పనులకు బిల్లులు రాకపోవడంతో ప్రస్తుతం కొత్త పనులకు కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదు. గడచిన రెండేళ్లలో సుమారు 50 పనులకు పలు దఫాలు టెండర్లు పిలిచారు. పనులు చేపడితే బిల్లులు వస్తాయని గ్యారంటీ లేదని భాస్కరరావు అనే కాంట్రాక్టర్‌ వ్యాఖ్యానించారు. అయినా అధకారులు మాత్రం విసుగుచెందకుండా టెండర్లు పిలుస్తూనే ఉన్నారు. చివరకు కేంద్ర ప్రభుత్వ సాయంతో చేపట్టే పనులు చేసేందుకు కూడా కాంట్రాక్టర్లు ముందుకురావడంలేదు. కొందరు కాంట్రాక్టర్లు టెండర్లు దక్కించుకున్న తరువాత వెనక్కి తగ్గారు. టెండరు సమయంలో చెల్లించిన డిపాజిట్‌ వెనక్కి ఇవ్వాలని కోరుతున్నారు. అరకులోయలో కో-ఎడ్యుకేషన్‌ కళాశాలలో వసతి సమస్య తీవ్రంగా ఉంది. సుమారు రూ.కోటితో భవనాల నిర్మాణానికి ఇప్పటికే రెండు పర్యాయాలు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్ల నుంచి స్పందన లేదు. కాగా ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనుల్లో గ్రామ సచివాలయాలు/రైతుభరోసా కేంద్రాలు, ఇతర భవనాలకు తప్ప మిగిలిన వాటికి బిల్లులు మంజూరు కావడం లేదు. ఇంకా అత్యవసరంగా భావించే రహదారుల మరమ్మతులకు టెండర్లు పిలిచినా స్పందన లేదు. ఈ విషయం సంబంధిత అధికారుల వద్ద ప్రస్తావించగా బిల్లులు మంజూరులో కొంత జాప్యం వుందని చెబుతున్నారు. 


Updated Date - 2022-09-17T06:20:16+05:30 IST