కనిమెట్టలో కలకలం

ABN , First Publish Date - 2022-11-18T23:56:33+05:30 IST

పొందూరు మండలం కనిమెట్టలో శుక్రవారం కలకలం రేగింది. ఆక్రమణల తొలగింపు పేరిట ఒక ఇంటి ప్రహరీని, షెడ్డును అధికారులు తొలగించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా తమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.

కనిమెట్టలో కలకలం
జేసీబీలతో నిర్మాణాలను తొలగిస్తున్న దృశ్యం

పొందూరు, నవంబరు 18 : పొందూరు మండలం కనిమెట్టలో శుక్రవారం కలకలం రేగింది. ఆక్రమణల తొలగింపు పేరిట ఒక ఇంటి ప్రహరీని, షెడ్డును అధికారులు తొలగించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా తమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో అధికారులతో వాగ్వాదం చేయగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయినా అధికారుల వెనక్కి తగ్గకుండా పోలీసుల సమక్షంలో తొలగింపు ప్రక్రియ పూర్తిచేశారు. వివరాల్లోకి వెళితే..

కనిమెట్టలోని సర్వేనెంబర్‌ 165లో నానుపాత్రుని సుశీల ఇల్లు ఉంది. పక్కనే సర్వేనెంబర్‌ 166లో చెరువు ఉంది. చెరువు స్థలాన్ని ఆక్రమించి ప్రహరీ, షెడ్డు నిర్మించారంటూ సుశీలకు ఇటీవల గ్రామ కార్యదర్శి రాజీవ్‌ నోటీసులు జారీచేశారు. శుక్రవారం రెవెన్యూ, పోలీసుల సహకారంతో అక్రమ నిర్మాణాలను తొలగించారు. సర్పంచ్‌ వర్గం రాజకీయ కక్షతోనే తమ నిర్మాణాలను తొలగిస్తున్నారని సుశీల ఆరోపించారు. ఈ మేరకు ఆమె కుటుంబ సభ్యులతో కలిసి అధికారులతో వాగ్వాదానికి దిగారు. కోర్టు ఇంజక్షన్‌ ఆర్డర్‌ ఉన్నా.. పట్టించుకోకుండా తొలగించడం సరికాదని అడ్డుకున్నారు. సర్పంచ్‌ ప్రతినిధి బొడ్డేపల్లి గంగాధర్‌ వర్గంతో కూడా వాదోపవాదాలు చేశారు. తాము వైసీపీ సానుభూతిపరులమైనప్పటికీ కక్షసాధింపు చర్యలు తగవని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా అధికారులు వెనక్కి తగ్గకుండా ప్రత్యేక పోలీసు బలగాల సమక్షంలో తొలగింపు చేపట్టారు.

కక్షసాధింపే..

‘మేము సర్వేనెంబర్‌ 165లోనే నిర్మాణం చేపట్టినట్టు.. జిల్లా సర్వే అధికారులు గతంలో ఇచ్చిన నివేదిక ఉంది. గతంలో మాపై ఫిర్యాదు చేసిన గత సర్పంచ్‌ జగన్నాథం ఆధ్వర్యంలోనే సర్వే చేశారు. నిర్మాణాలు సక్రమమేనని నిర్ధారించారు. తొలగింపుపై అధికారులు ఇచ్చిన నోటీసులపై పొందూరు కోర్టు నుంచి ఇంజక్షన్‌ ఆర్డర్‌ హైకోర్టు పరిధిలో ఉంది. వాటిని పట్టించుకోకుండా దౌర్జన్యంగా కూల్చివేశారు. మూడు రోజుల్లో కూల్చివేస్తామని నోటీసులు ఇచ్చి.. 24 గంటలు కాకుండానే తొలగించారు’ అని సుశీల ఆవేదన వ్యక్తం చేసింది. హైకోర్టు ఉత్తర్వులు పాటించడం లేదంటూ ప్లకార్డులతో భాదితులు నిరసన తెలిపారు. తమకు ఆత్మహత్య తప్ప వేరే దారి లేదని, ఇందుకు అధికారులే బాధ్యత వహించాలని సుశీల పేర్కొన్నారు.

నిబంధనల మేరకే..

చెరువు సర్వే నెంబర్‌లో స్మశానవాటికకు దారిలేకుండా ఉన్న అక్రమ నిర్మాణాలను నిబంధనల మేరకు తొలగించాం. కోర్టు ఉత్తర్వుల మేరకు 165 సర్వే నెంబర్‌లో ఎటువంటి నిర్మాణాలు కూల్చలేదు. మూడు నెలల కిందట నోటీసులు ఇచ్చారు. మళ్లీ ఇటీవల రెండోసారి నోటీసులు ఇచ్చి తొలగించాం.

- రాజీవ్‌, పంచాయతీ కార్యదర్శి

Updated Date - 2022-11-18T23:56:33+05:30 IST

Read more