చింతపల్లి ఎంపీపీపై అనర్హత వేటు?

ABN , First Publish Date - 2022-09-11T06:22:55+05:30 IST

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండల పరిషత్‌ అధ్యక్షుడు వంతల బాబూరావుపై అనర్హత వేటు వేసేందుకు దాదాపు రంగం సిద్ధమైంది.

చింతపల్లి ఎంపీపీపై అనర్హత వేటు?
ముగ్గురు పిల్లలతో అనంతగిరి ఎంపీపీ శెట్టి నీలవేణి కుటుంబం

తనపై జీకే వీధి పోలీస్‌ స్టేషన్‌లో ఉన్న కేసును

ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొనకపోవడమే కారణం

ఎంపీటీసీ-3 వంతల బాబూరావును అనర్హుడిగా ప్రకటించే అవకాశాన్ని పరిశీలించాలంటూ ఎన్నికల కమిషన్‌కు సిఫారసు

తనపై పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి కుట్ర చేస్తున్నారని

ఎంపీపీ బాబూరావు ఆరోపణ

న్యాయ పోరాటం చేస్తానని ప్రకటన


విశాఖపట్నం, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండల పరిషత్‌ అధ్యక్షుడు వంతల బాబూరావుపై అనర్హత వేటు వేసేందుకు దాదాపు రంగం సిద్ధమైంది. మండల పరిషత్‌ ఎన్నికల్లో చింతపల్లి ఎంపీటీసీ స్థానం-3లో పోటీ చేసిన బాబూరావు...జీకే వీధి పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఓ క్రిమినల్‌ కేసు వివరాలను నామినేషన్‌ పత్రాల్లో నమోదు చేయలేదంటూ తాజంగి ఎంపీటీసీ సభ్యురాలు కోరాబు అనుషాదేవి పాడేరు సబ్‌కలెక్టర్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఈ ఏడాది మే 21న సబ్‌ కలెకర్‌  వి.అభిషేక్‌ ఇరువర్గాలను విచారించారు. 2019లో జీకే వీధి పోలీస్‌ స్టేషన్‌లో (ఎఫ్‌ఐఆర్‌ 43/2019) నమోదైన కేసును వంతల బాబూరావు తన నామినేషన్‌లో పేర్కొనలేదని అనుషాదేవి ఆరోపించారు. తనకు రెండు వారాలు సమయం ఇస్తే, తన వాదన వినిపిస్తానని బాబూరావు కోరారు. ఈ ఏడాది జూన్‌ 25న, జూలై 17న నిర్వహించిన కోర్టులో వంతల బాబూరావు తనపై కేసు వ్యవహారం నామినేషన్‌లో దాఖలు చేయలేదని అంగీకరించారు. దీంతో ఈ ఏడాది ఆగస్టు పదో తేదీన నిర్వహించిన కోర్టులో వంతల బాబూరావు పంచాయతీరాజ్‌ చట్టాలకు వ్యతిరేకంగా వ్యవహరించారంటూ ఎంపీటీసీ సభ్యుడిగా వంతల బాబూరావును అనర్హుడిగా ప్రకటించే అవకాశం వుందని ఏజెన్సీ కోర్టు మెజిస్ట్రేట్‌ హోదాలో సబ్‌కలెక్టర్‌ వి.అభిషేక్‌ నిర్ధారించారు.

రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు సిఫారసు

పంచాయతీరాజ్‌ చట్టాలకు వ్యతిరేకంగా వ్యవహరించిన చింతపల్లి ఎంపీటీసీ-3 వంతల బాబూరావును అనర్హుడిగా ప్రకటించే అవకాశాన్ని పరిశీలించాలని ఉమ్మడి విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జునకు స్థానిక సబ్‌కలెక్టర్‌ వి.అభిషేక్‌ సిఫారసు చేశారు. దానిని ఉమ్మడి విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు పంపించారు. దీనిపై ఎన్నికల కమిషన్‌ తుది నిర్ణయం తీసుకున్న తర్వాత ఎంపీపీ వంతాల బాబూరావు అనర్హత వ్యవహారంపై అధికారికంగా ప్రకటన చేయాలని అధికారులు ఎదురుచూస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో బాబూరావుపై అనర్హత దాదాపు ఖరారైనట్టేనని రాజీకయ పరిశీలకులు భావిస్తున్నారు.

నాకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి కుట్ర చేస్తున్నారు...

న్యాయం పోరాటం చేస్తాను: ఎంపీపీ వంతల బాబూరావు

ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాట కాదని, నేను ఎంపీపీగా ఎన్నిక కావడంతో ఆమె నాపై కుట్రలు చేస్తున్నారు. ఎంపీపీ అభ్యర్థిగా అనుషాదేవిని ప్రతిపాదించిన ఎమ్మెల్యే, తన మాట నెగ్గలేదనే కారణంతో పథకం ప్రకారం నాపై అనర్హత వేటు పడేలా కుట్ర చేస్తున్నారు. అయితే ఇంకా ఎన్నికల కమిషన్‌ నుంచి నాకు  వంటి ఉత్తర్వులు రాలేదు. నాకు అన్యాయం జరిగితే హైకోర్టును ఆశ్రయించి న్యాయ పోరాటం చేస్తాను. నా వ్యవహారంలో ఎమ్మెల్యే వ్యతిరేకంగా వ్యవహరించడం చాలా బాధాకరం.

చింతపల్లిలో ఇలా...అనంతగిరిలో అలా...

చింతపల్లిలో పరిస్థితి ఇలా ఉండగా...అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో అనంతగిగి ఎంపీపీ శెట్టి నీలవేణి వ్యవహారంలో ఇందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. శెట్టి నీలవేణి తనకు ముగ్గురు సంతానం (కంబిడి ప్రణిత, చరిష్మా, జస్వంత్‌) వున్నట్టు నామినేషన్‌ అఫిడవిట్‌లో పేర్కొనలేదు. దీనిపై ఎంపీటీసీ సభ్యురాలిగా నీలవేణి చేతిలో ఓడిపోయిన పాంగి రాధిక స్థానిక సబ్‌కలెక్టర్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే అధికార పార్టీ నేతలు రంగంలోకి దిగడంతో శెట్టి నీలవేణికి ముగ్గురు సంతానం ఉన్నట్టు ఫిర్యాది పాంగి రాధిక సకాలంలో కోర్టుకు ఆధారాలు సమర్పించలేదని పేర్కొంటూ పిటిషన్‌ను సబ్‌ కలెక్టర్‌ కొట్టేశారు.  


Updated Date - 2022-09-11T06:22:55+05:30 IST