చేప పిల్లల్లేవ్‌!

ABN , First Publish Date - 2022-09-30T04:03:55+05:30 IST

చేప పిల్లల పంపిణీపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. టెక్కలి సమీపంలో వంద హెక్టార్లకుపైగా విస్తరించిన మదనగోపాలసాగరం రిజర్వాయర్‌కు గతేడాది ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన కింద 32వేల చేపపిల్లలను మత్స్యశాఖ అందించింది. ఈ ఏడాది ఇప్పటివరకు చేపపిల్లలు పంపిణీ చేపట్టలేదు.

చేప పిల్లల్లేవ్‌!
టెక్కలి సమీపంలో మదనగోపాలసాగరం జలాశయం

- చేప పిల్లల పంపిణీపై నీలినీడలు

- నిరీక్షిస్తున్న మత్స్యకార సంఘాలు

(టెక్కలి)

చేప పిల్లల పంపిణీపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. టెక్కలి సమీపంలో వంద హెక్టార్లకుపైగా విస్తరించిన మదనగోపాలసాగరం రిజర్వాయర్‌కు గతేడాది ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన కింద 32వేల చేపపిల్లలను మత్స్యశాఖ అందించింది. ఈ ఏడాది ఇప్పటివరకు చేపపిల్లలు పంపిణీ చేపట్టలేదు. మత్స్యసంపదపై ఔత్సాహికులకు, మత్స్యకార సంఘాలకు గత ప్రభుత్వ హయాంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో సబ్సిడీపై చేప పిల్లలు పంపిణీ చేసేవారు. చిన్న.. పెద్ద చెరువులు తేడా లేకుండా జిల్లాలో సుమారు వెయ్యికిపైగా చెరువులకు చేప పిల్లలను ఇచ్చేవారు. ప్రస్తుతం మొక్కుబడిగా చేపపిల్లలు పంపిణీ చేస్తున్నారు. వంద హెక్టార్లు దాటిన చెరువులకు మాత్రమే సబ్సిడీపై అందజేస్తున్నారు. శ్రీకాకుళంలో చేపపిల్లల ప్రొడక్షన్‌ యూనిట్‌, ఇచ్ఛాపురంలో రేరింగ్‌ హేచరీ ఉండగా, ఎల్‌ఎన్‌పేట సమీపంలో ఫ్రై రేరింగ్‌ హేచరీ నిర్మాణ దశలో ఉన్నాయి. మత్స్యశాఖ కట్ల, మృగాల(బంగారుపాప), రోహు(గండిచేప), గ్రాస్‌కార్ప్‌(గడ్డిచేప) రకాలు స్పాన్‌, ఫ్రై, ఫింగర్‌ లింగ్స్‌ సైజుల్లో సబ్సిడీ రేట్లుతో మత్స్యకార సొసైటీలకు, సంఘాలకు పంపిణీ చేసేవారు. మత్స్యశాఖ పంపిణీ చేసిన చిరు చేపపిల్లలు చాలకపోతే కొందరు వ్యాపారులు పశ్చిమబెంగాళ్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలో గోదావరి జిల్లాలు, భీమవరం, ఏలూరు, కైకలూరు ప్రాంతాల నుంచి రకరకాల చేపపిల్లలను తెచ్చి విక్రయించేవారు. జిల్లా కేంద్రంలో పదిలక్షల వరకు చేపపిల్లలు పంపిణీకి సిద్ధంగా ఉన్నా.. ఆశించిన స్థాయిలో అందజేయడం లేదు. ఈ ఏడాది వర్షాల కారణంగా చెరువులు, రిజర్వాయర్లు కళకళలాడుతున్నాయి. కానీ ఇంతవరకు చేప పిల్లలు పంపిణీ చేయలేదని మత్స్యకార సొసైటీల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మత్స్యశాఖ మంత్రి, అధికారులు చొరవ చూపాలని కోరుతున్నారు. ఈ విషయమై జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీనివాసరావు ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా.. తమ పరిధిలో ఉన్న చేప పిల్లలను త్వరలో మత్స్యశాఖ మంత్రి చేతుల మీదుగా పంపిణీకి చర్యలు తీసుకుంటామన్నారు. 

Read more