ప్రాణాలు జాగ్రత్త!

ABN , First Publish Date - 2022-03-19T04:44:31+05:30 IST

వేసవి ఆరంభమైంది. ఇప్పటికే భానుడి ప్రతాపం మొదలైంది. రోజూ జిల్లాలో గరిష్ఠంగా 38 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగత్ర నమోదవుతోంది. ఈ నేపథ్యంలో చాలామంది ఉపశమనం కోసం.. నదులు, చెరువులు, సముద్రాల్లో స్నానాలు చేస్తున్నారు. మరికొందరు సెలవుల్లో కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి విహారయాత్రకు వెళ్లి.. ఈత సరదా కోసం వీటిలో దిగుతున్నారు. కాగా, కొ

ప్రాణాలు జాగ్రత్త!
మెళియాపుట్టిలో చెరువులో స్నానానికి వెళ్లి మృతిచెందిన చిన్నారి(ఫైల్‌)

ప్రాణాలు జాగ్రత్త!

- వేసవి వేళ.. నదులు, చెరువులు, సముద్రాల్లో స్నానాలు

- ఈత సరదా మాటున ప్రమాదాలు

- అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు

(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి)

వేసవి ఆరంభమైంది. ఇప్పటికే భానుడి ప్రతాపం మొదలైంది. రోజూ జిల్లాలో గరిష్ఠంగా 38 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగత్ర నమోదవుతోంది. ఈ నేపథ్యంలో చాలామంది ఉపశమనం కోసం.. నదులు, చెరువులు, సముద్రాల్లో స్నానాలు చేస్తున్నారు. మరికొందరు సెలవుల్లో కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి విహారయాత్రకు వెళ్లి.. ఈత సరదా కోసం వీటిలో దిగుతున్నారు. కాగా, కొన్ని సందర్భాల్లో ఈత సరదా మాటున ప్రమాదాలకు గురవుతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. జిల్లాలో గతంలో ఇటువంటి సంఘటనలు ఎన్నో చోటుచేసుకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చాయి. ఈత వచ్చినవారు సైతం సముద్రంలో అలల ఉధృతికి బలైపోయిన సంఘటనలు ఉన్నాయి. కొన్నిచోట్ల సెల్ఫీల మోజులో సముద్రం ఒడ్డున ఫొటోలు తీసుకుంటూ కెరటాలకు చిక్కిన ఘటనలూ ఉన్నాయి. గార మండలం పోర్టు కళింగపట్నం బీచ్‌, శ్రీకాకుళం మండలం కళ్లేపల్లి, గనగళ్లవానిపేట బీచ్‌ల వద్ద ఇటువంటి ఘటనలు గతంలో చోటుచేసుకున్నాయి.  చెరువుల్లో నీటి నిల్వలు పెంచేందుకు ఉపాధిహామీ పథకం ద్వారా పనులు చేపడుతున్నారు. కాగా కొంతమంది స్నానాలు చేసేందుకు చెరువుల్లో దిగి.. గోతులకు బలైపోతున్నారు. రణస్థలం, లావేరు మండలాల్లో గత ఏడాది ఇదే తరహా ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. అలాగే నదుల్లో భారీగా ఇసుక తవ్వకాలు చేపడుతుండడంతో పెద్దపెద్ద గుంతలు ఏర్పడుతున్నాయి. ఈ గుంతల్లో ప్రమాదవశాత్తు పడి కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో నదులు, సముద్రం, చెరువుల్లో స్నానాలకు దిగేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

ఫ ఇలా చేస్తే మేలు...

సముద్ర తీర ప్రాంతాల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. సూర్యాస్తమయం కంటే కొంచెం ముందే సముద్రం, నదులు, చెరువుల్లో ఎవరూ దిగకుండా చర్యలు చేపట్టాలి. గజ ఈతగాళ్లయినా సరే.. సముద్రపు కెరటాలకు ఎదురువెళ్లకూడదు. లైఫ్‌ జాకెట్లను ధరించాలి. ప్రమాదానికి గురైతే మెరైన్‌ పోలీసులకు సమాచారం అందజేయాలి. ఉధృతంగా ప్రవహిస్తున్నప్పుడు నదులను దాటరాదు. చెరువుల వద్ద కూడా అప్రమత్తంగా ఉండాల్సిందే. వేసవి సెలవుల్లో పిల్లల కదలికలపై తల్లిదండ్రులు నిఘా వేయాలి. ఉపాధ్యాయులు కూడా ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించాలి. ఈతకు వెళ్లేటప్పుడు తోడుగా ఎవరినైనా తీసుకెళ్లాలి. 

జిల్లాలో గత ఏడాది ఘటనలిలా..

- జనవరి 2న రణస్థలం మండలం తెప్పలవలసలో చెరువులో మునిగి ఇద్దరు మృతి చెందారు. 

- మార్చి 29న పోర్టు కళింగపట్నం బీచ్‌లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. 

- ఏప్రిల్‌ 4న మెళియాపుట్టి మండలం గొప్పిలిలో చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. 

- జూన్‌ 27న కవిటి మండలం పుక్కళ్లపాలెం తీరంలో సముద్రస్నానానికి వెళ్లి బొర్రపేటకు చెందిన ముగ్గురు యువకులు మృతి చెందారు. 

- జూలై 30న భామిని మండలం తివ్వకొండలో నీటి గుంతలో దిగి ఇద్దరు విద్యార్థినులు మృతిచెందారు. 

- సెప్టెంబర్‌ 1న లావేరు మండలం యాతపేటకు చెందిన ఇద్దరు చిన్నారులు చెరువులో పడి మృతి చెందారు. Read more