బకాయిలొస్తేనే.. ప్రారంభం

ABN , First Publish Date - 2022-12-12T00:01:06+05:30 IST

జిల్లాలో సుమారు 115 సచివాలయ భవనాల పనులు పూర్తయినా ప్రారంభానికి నోచుకోవడం లేదు. మరో 350 భవనాల నిర్మాణాలు చివరి దశలో ఉన్నాయి. రైతుభరోసా కేంద్రాలు, విలేజ్‌ హెల్త్‌క్లీనిక్‌లు కూడా ఇదే పరిస్థితి.

బకాయిలొస్తేనే.. ప్రారంభం
కేదారిపురం సచివాలయ భవనం

- సచివాలయాల నిర్మాణానికి అందని బిల్లులు

- ఆర్బీకేలు, విలేజ్‌ హెల్త్‌క్లినిక్‌లదీ అదే పరిస్థితి

- ఇరుకు గదుల్లోనే సిబ్బంది విధులు

(ఇచ్ఛాపురం రూరల్‌)

- ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టి గ్రామంలో రూ.46లక్షలతో సచివాలయ భవన నిర్మాణ పనులు ప్రారంభించారు. పనులు పూర్తయిపోయాయి కానీ ప్రభుత్వం మాత్రం బిల్లులు చెల్లించలేదు. దీంతో బిల్లులు చెల్లిస్తేనే ఈ భవనాన్ని ప్రారంభించాలని కాంట్రాక్టర్‌ తెగేసి చెప్పాడు.

- ఇచ్ఛాపురం మండలం కేదారిపురం సచివాలయ భవనం పనులు కూడా దాదాపు పూర్తయ్యాయి. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ఈ భవనం కూడా ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో చిన్నగదిలోనే ఆరుగురు సచివాలయ ఉద్యోగులు ఇబ్బందులు పడుతూ విధులు నిర్వహిస్తున్నారు.

...ఇలా జిల్లాలో సుమారు 115 సచివాలయ భవనాల పనులు పూర్తయినా ప్రారంభానికి నోచుకోవడం లేదు. మరో 350 భవనాల నిర్మాణాలు చివరి దశలో ఉన్నాయి. రైతుభరోసా కేంద్రాలు, విలేజ్‌ హెల్త్‌క్లీనిక్‌లు కూడా ఇదే పరిస్థితి. బిల్లులు చెల్లించకపోవడంతో వీటిని ప్రారంభించేందుకు కాంట్రాక్టర్లు ససేమిరా అంటున్నారు. దీంతో ఉద్యోగులు, సిబ్బంది ఇరుకు గదులు, అద్దె భవనాల్లోనే విధులు నిర్వహిస్తూ ఇబ్బందులు పడుతున్నారు.

రూ.38.78 కోట్ల బిల్లుల పెండింగ్‌

జిల్లాలో సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్‌ హెల్త్‌క్లీనిక్‌ భవనాలకు సంబంధించి రూ.38.78 కోట్లు వరకు బిల్లుల బకాయిలు ఉన్నాయి. ఏడు నెలలుగా బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రెండోదశ నిర్మాణాలు నెమ్మదిగా సాగుతున్నాయి. శ్లాబు వరకు చెల్లింపులు జరిగినా అనంతరం బకాయిలు రాకపోవడంతో నిర్మాణాలు చేపట్టలేమని కాంట్రాక్టర్లు నిలిపివేస్తున్నారు. సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్‌ క్లినిక్‌ నిర్మాణాలపై పంచాయతీరాజ్‌శాఖ పర్యవేక్షిస్తోంది. వీటి నిర్మాణం వేగవంతం చేయాలని సీఎం స్థాయి నుంచి సమీక్షలు జరుగుతున్నా క్షేత్రస్థాయిలో పురోగతి కనిపించడం లేదు. ఇప్పటికే గడువును పలుమార్లు పొడిగించినా ఫలితం కనిపించడం లేదు. గతంలో ఆగస్టు 31వ తేదీ నాటికి సచివాలయాల నిర్మాణం పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. తరువాత అక్టోబరు 31 నాటికి గడువును పొడిగించారు. కానీ సకాలంలో బిల్లులు రాకపోవడంతో ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోతున్నాయి.

ఉన్నతాధికారులకు తెలియజేశాం:

బకాయిలపై ఇప్పటికే ఉన్నతాధికారులకు తెలియజేశాం. కేంద్రం నుంచి ఉపాధి నిధులు రావడం ఆలస్యం కావడంతో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపులో జాప్యమవుతోంది. త్వరలో బిల్లులు వచ్చే అవకాశం ఉంది. బిల్లులు వచ్చిన వెంటనే పూర్తయిన సచివాలయాలు ప్రారంభిస్తాం. అసంపూర్తిగా నిలిచిన భవనాల నిర్మాణానికి చర్యలు చేపడతాం.

- వి.సత్యనారాయణమూర్తి, ఎస్‌ఈ, పంచాయతీరాజ్‌

Updated Date - 2022-12-12T00:01:08+05:30 IST