ఉచిత బియ్యం లేనట్టే!

ABN , First Publish Date - 2022-10-01T04:51:27+05:30 IST

ఉచిత బియ్యం లేనట్టే!

ఉచిత బియ్యం లేనట్టే!

- మరో మూడు నెలలు పెంచిన కేంద్రం

- స్పందించని రాష్ట్ర ప్రభుత్వం

(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి)

బియ్యం కార్డుదారులకు ఈ నెల ఉచిత బియ్యం అందే సూచనలు కనిపించడం లేదు. కరోనా తొలిదశ నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్నయోజన(పీఎంజీకేఏవై) కింద కార్డుల్లో ఒక్కో సభ్యుడికి 5కేజీలు చొప్పున ఉచిత రేషన్‌ బియ్యం పంపిణీ చేస్తోంది. కాగా.. రాష్ట్ర ప్రభుత్వం నాలుగు నెలలుపాటు వీటిని కార్డుదారులకు పంపిణీ చేయలేదు. బియ్యాన్ని పంపిణీ చేయాల్సిందేనని కేంద్రం ఆదేశించడంతో రెండు నెలల కూపన్లు అందజేసి.. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో పంపిణీ చేసింది. జిల్లాలో నెలకు 9,300 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని అందజేశారు. తాజాగా కేంద్రం మరో మూడు నెలలు పాటు ఉచిత బియ్యం పంపిణీ చేయనున్నట్టు వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు కూడా పౌరసరఫరాలశాఖకు చేరాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాత్రం ఉత్తర్వులు విడుదల కాకపోవడంతో బియ్యం పంపిణీపై జిల్లా అధికారులు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు.  ఇదిలా ఉండగా.. దసరా సందర్భంగా ఈ నెల బియ్యం కార్డుదారులకు పంచదార పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. చోడవరం చక్కెర గోదాము నుంచి జిల్లాకు సరిపడా పంచదార నిల్వలు తీసుకురానున్నారు. కందిపప్పు మాత్రం అరకొరగానే లబ్ధిదారులకు అందనుంది.  

Updated Date - 2022-10-01T04:51:27+05:30 IST