మొక్కుబడిగా స్వచ్ఛతే సేవ

ABN , First Publish Date - 2022-09-25T05:12:21+05:30 IST

గ్రామాల్లో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోతోంది. కాలువల్లో మురుగునీరు పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది. పల్లెలను పరిశ్రుభం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15 నుంచి ‘స్వచ్ఛతే సేవ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అక్టోబరు 2 వరకు పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వ హించాలని ఆదేశించింది. కానీ, పంచాయతీల్లో నిధుల కొరత కారణంగా ఈ కార్య క్రమం మొక్కుబడిగా సాగుతోంది.

మొక్కుబడిగా స్వచ్ఛతే సేవ
కొలిగాం గ్రామం మధ్యలో చెత్త

- పంచాయతీల్లో నిధుల కొరత
- ర్యాలీలతో సరిపెడుతున్న సిబ్బంది
- గ్రామాల్లో ఎక్కడి చెత్త అక్కడే
(ఇచ్ఛాపురం రూరల్‌/ సోంపేట)

- ఇచ్ఛాపురం మండలం కీర్తిపురం సచివాలయం ఎదురుగా మురికి కాలువ ఉంది. ఇక్కడ నిత్యం మురుగు నిల్వ ఉండటంతో సచివాలయ ఉద్యోగులతో పాటు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

- ఇచ్ఛాపురం మండలం కొలిగాం గ్రామం మధ్యలో చెత్త దర్శనమిస్తోంది. ఇటీవల వర్షాలకు బురద చేరడంతో ఇటువైపుగా రాకపోకలు సాగించేందుకు ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు.

- తులసిగాం పంచాయతీ ఈనేసుపేటలో వీధి మధ్యలో మురుగు నీరు నిల్వ ఉండడంతో దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటే ప్రజలు హడలిపోతున్నారు. రాత్రివేళల్లో దోమలతో నరకయాతన అనుభవిస్తున్నారు.  

-  మండపల్లి పంచాయతీ బెన్నుగానిపేటలో కూడా వీధి మధ్యలో మురుగు నీరు నిల్వ ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

..ఇలా గ్రామాల్లో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోతోంది. కాలువల్లో మురుగునీరు పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది. పల్లెలను పరిశ్రుభం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15 నుంచి ‘స్వచ్ఛతే సేవ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అక్టోబరు 2 వరకు పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వ హించాలని ఆదేశించింది. కానీ, పంచాయతీల్లో నిధుల కొరత కారణంగా ఈ కార్య క్రమం మొక్కుబడిగా సాగుతోంది. జిల్లాలో 912 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 16 రోజుల పాటు రోజుకో పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించాలి. గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, ప్రజలతోపాటు స్వయం సహాయక సంఘాల మహిళలు ఇలా అందరినీ కార్యక్రమంలో భాగస్వాములు చేయాలి. చెత్త నిర్వహణ కేంద్రాలన్నింటినీ వినియోగంలోకి తేవడం, రహదారులను శుభ్రం చేయడం, పారిశుధ్య పనులకు యంత్రాలను వినియోగించడంతో పాటు  క్లాప్‌మిత్రలు తమ తమ గ్రామాల్లో చెత్తను కేంద్రాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలి. కానీ ఎక్కడా మార్గదర్శకాల ప్రకారం పూర్తిస్థాయిలో పనులు చేయడం లేదు. ఇప్పటికే పది రోజులు గడిచిపోయాయి. తొలిరోజు పంచాయతీ స్థాయిలో సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు, గ్రామ పెద్దలు, స్వయం సహాయక సంఘాల మహిళలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి కార్యక్రమాల ప్రణాళిక సిద్ధం చేయాలి. చాలాచోట్ల సమావేశాలు నిర్వహించిన దాఖలాలు లేవు. ఇంటింటికీ వెళ్లి పరిశుభ్రత ఆవశ్యకత, ప్లాస్టిక్‌ నియంత్రణపై ప్రజలను చైతన్యం చేయాల్సి ఉండగా.. అదీ జరగలేదు. నీటి వనరుల ప్రాంతాలను శుభ్రం చేయడంతోపాటు మొక్కలను నాటాలి. తర్వాత రోజు ర్యాలీలు నిర్వహించాలి. మూడో రోజు ప్రజాప్రతినిధులతో పాటు వివిధ శాఖల ఉద్యోగులు తమ తమ గ్రామాల్లో పర్యటించి నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలి. తాగునీటి కుళాయిలు, ట్యాపులు బాగు చేయించాలి. కానీ ఇవేవీ లేకుండా కొన్నిచోట్ల కేవలం ర్యాలీలు నిర్వహించి వదిలేస్తున్నారు. అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో లక్ష్యం నీరుగారిపోతుంది.

నిధులు లేకుండా ఎలా..? :
పంచాయతీల్లో నిధులు నిండుకున్నాయి. కేంద్రం నుంచి వచ్చిన ఆర్థిక సంఘం నిఽధులు రాష్ట్ర ప్రభుత్వం మళ్లించడంతో ఖాతాలు ఖాళీ అయ్యాయి. రోడ్లపై ఏర్పడిన గుంతలు పూడ్చాలన్నా సర్పంచ్‌లకు తిప్పలు తప్పడం లేదు. స్వచ్ఛ సంకల్పం పేరుతో గ్రామాల్లో రోడ్లు శుభ్ర పర్చడం, డ్రైనేజీలు మరమ్మతులు, వీధుల వెంట చెత్త చెదారం తొలగించటంతోపాటు పారిశుధ్య పనులు ముమ్మరం చేయాలని పెద్దఎత్తున అజెండా పెట్టి ఆదేశిస్తున్నారు. కానీ నిధులు లేకపోవడంతో ఏమి చేయాలో తెలియక సర్పంచులు సతమతమవుతున్నారు.  

చర్యలు తీసుకుంటున్నాం :
స్వచ్ఛతే సేవలో భాగంగా కార్యక్రమాలు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఆయా గ్రామాల కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశాం. ఆకస్మిక తనిఖీలు కూడా చేస్తున్నాం. సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధుల సహకారంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.
- బి.రాజేశ్వరరావు, ఈవోపీఆర్డీ, ఇచ్ఛాపురం.
 

Read more