దసరా సరదా ఏదీ?

ABN , First Publish Date - 2022-10-04T04:50:07+05:30 IST

దసరా అంటే ఓ సరదా. మన సంస్కృతికి చిహ్నం. ఆంధ్రాలో సంక్రాంతి తరువాత అంత ఘనంగా చేసుకునే పండుగ. తెలంగాణలో బతుకమ్మ పండగను ఎంత వైభవంగా చేసుకుంటారో.. ఆంధ్రాలో దసరా ఉత్సవాలు అంతే ఘనంగా చేస్తారు. పదిరోజుల పాటు గ్రామదేవతలను పూజిస్తారు. విద్యార్థులంతా గ్రామాల్లో ఆటపాటలతో ఆ పదిరోజులూ సంబరాలు చేసుకునేవారు. ఇదంతా గతం. ప్రస్తుతం పల్లెల్లో దసరా సందడి బాగా తగ్గిపోయింది.

దసరా సరదా ఏదీ?
సందడి కనిపించని టెక్కలి మండలం పోలవరం గ్రామం

గ్రామాల్లో తగ్గిన పండుగ సందడి
ఇళ్లకే పరిమితమవుతున్న విద్యార్థులు
(టెక్కలి)

దసరా అంటే ఓ సరదా. మన సంస్కృతికి చిహ్నం. ఆంధ్రాలో సంక్రాంతి తరువాత అంత ఘనంగా చేసుకునే పండుగ. తెలంగాణలో బతుకమ్మ పండగను ఎంత వైభవంగా చేసుకుంటారో.. ఆంధ్రాలో దసరా ఉత్సవాలు అంతే ఘనంగా చేస్తారు. పదిరోజుల పాటు గ్రామదేవతలను పూజిస్తారు. విద్యార్థులంతా గ్రామాల్లో ఆటపాటలతో ఆ పదిరోజులూ సంబరాలు చేసుకునేవారు. ఇదంతా గతం. ప్రస్తుతం పల్లెల్లో దసరా సందడి బాగా తగ్గిపోయింది. అసలు పాఠశాలలకు దసరా సెలవులు ఎందుకు ఇస్తున్నారో.. విద్యార్థులకు తెలియని పరిస్థితి. సెలవుల్లో విద్యార్థులంతా ఇళ్లకే పరిమితం అవుతున్నారు. సంబరాల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈక్రమంలో సంస్కృతీ సంప్రదాయాలు కనుమరుగవుతున్నాయి. గతంలో ఏ గ్రామంలో అయినా ఒక మాస్టారు ఉంటే.. ఆయన ఊరందరికీ తెలిసేవారు. దసరా సరదాయే ఇందుకు కారణం. ఆశ్వయుజ శుద్ధ పాఢ్యమి మొదలు విజయదశమి ముందు పదిరోజుల పాటు విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లేవారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సందడి చేసేవారు. గురువులను విద్యార్థుల తల్లిదండ్రులు సత్కరించేవారు. ఊరు గ్రామదేవత వద్దకు వెళ్లి ముందు విద్యార్థులతో  దసరా పాటలు పాడించి అమ్మవారి ఆశీస్సులు పొంది ఆ తరువాత గ్రామపెద్దలను కలిసేవారు. ‘ఏదయా మీదయా మామీద లేదా... ఇంతసేపు ఉంచుట ఇది మీకు తగునా... దసరాకు వస్తమని విసవిసలు పడక... పావలా ఇస్తేనే పట్టీది లేదు....అర్థరూపాయి ఇస్తే అంటేది లేదు... ముప్పావలా ఇస్తే ముట్టేది లేదు... ఐదు రూపాయలు ఇస్తే పుచ్చుకుంటాము... ఆపై మాకు పావలా పప్పుబెల్లాలు’ అంటూ విద్యార్థులు పాటలతో.. దసరా బాణాలతో.. తంగిడిపూలతో సందడి చేసేవారు. ఈ సంస్కృతి 1980 వరకు కొనసాగింది. గత నాలుగు దశాబ్దాలుగా దసరా సందడి తగ్గుతూ వస్తోంది.
 
సందడికి దూరం
మా చిన్నతనంలో దసరా పండుగ వస్తుందంటూ ఊరంతా సందడిగా ఉండేది. కుటుంబ సభ్యులమంతా ఒకేచోట చేరేవాళ్లం. కుమార్తెలను, ఇంటి అల్లుళ్లను పిలిచి సరదాగా గడిపేవాళ్లం. అమ్మవారికి పూజించేవాళ్లం. ప్రస్తుతం ఆ సందడి దూరమైంది. చాలామంది ఉపాధి నిమిత్తం వలస పోతుండడంతో గ్రామాల్లో పండగ బోసిపోతోంది.
- కంచరాన మల్లేషు, చిన్నలక్ష్మీపురం, నందిగాం మండలం.  
 
అప్పట్లో దసరా అంటే..
నాటి దసరా సందడి కరువైంది. గతంలో దసరా అంటే గ్రామాల్లో మూడు, నాలుగు రోజుల పాటు సందడిగా ఉండేది. ఈ ఆధునిక కాలంలో వాటన్నింటికీ కుటుంబ సభ్యులే దూరమవుతున్నారు.  
-డి.సత్యనారాయణ, లింగాలవలస, టెక్కలి.

 

Read more