స్పీకర్‌ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం: రామకృష్ణ

ABN , First Publish Date - 2022-09-13T08:51:09+05:30 IST

‘‘అమరావతి టు అరసవిల్లి పాదయాత్రపై అసెంబ్లీ స్పీకరు తమ్మినేని సీతారాం అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు.

స్పీకర్‌ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం: రామకృష్ణ

అమరావతి, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): ‘‘అమరావతి టు అరసవిల్లి పాదయాత్రపై అసెంబ్లీ స్పీకరు తమ్మినేని సీతారాం అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు. ప్రజాప్రతినిధులు అందరకీ ఆదర్శంగా ఉండాల్సిన ఆయన దిగజారి మాట్లాడటం తగదు’’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. ఆయన సోమవారం ఓ ప్రకటన చేశారు. ‘‘స్పీకరు స్థానంలోని వ్యక్తి అందరి సమస్యలు, అభిప్రాయాలు విని సభలో చర్చకు పెట్టాలి. అవసరమైతే ప్రభుత్వానికి సూచనలు చేయాలి. కానీ అమరావతి కోసం 1,000 రోజులుగా పోరాటం చేస్తున్న రైతుల ఉద్యమానికి వ్యతిరేకంగా తమ్మినేని చేసిన దురుసు వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం. స్పీకరు స్థానంలో ఉన్న తమ్మినేని ప్రజలను రెచ్చ గొట్టేలా వ్యాఖ్యలు చేయడం తగదు. ప్రజతంత్రవాదులు, ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉన్నవారెవరూ తమ్మినేని వైఖరిని హర్షించరు. ఆయనకు రాజకీయాలు చేయాలని ఉంటే స్పీకరు పదవికి రాజీనామా చేసి మంత్రి పదవిని తీసుకోవచ్చు లేదా ఎమ్మెల్యేగా పనిచేయవచ్చు. అంతేగాని ఉన్నతమైన స్పీకరు స్థానంలో ఉండి ఇలా దిగజారి మాట్లాడటం క్షంతవ్యం కాదు’’ అని రామకృష్ణ అన్నారు.


అన్నదాతలు చనిపోయినా కరగని సీఎం: ఆనందబాబు

సీఎం జగన్‌ మూడు ముక్కలాటలో వందల మంది అన్నదాతల గుండెలు ఆగిపోయాయి. వీరి వైపు ముఖ్యమంత్రి కనీసం చూడనైనా చూడలేదు. చనిపోయినవారిలో ఎంతో మంది దళిత బహుజనులు ఉన్నారు. దళితుల పక్షపాతిననే సీఎంకు వారి చావులు కనిపించలేదా? తన తండ్రి కోసం చనిపోయినవారి ప్రాణాలు, రైతుల ప్రాణాలు ఒకటి కాదా? ఓదార్పు యాత్ర ఎందుకు చేయలేదు? 

Updated Date - 2022-09-13T08:51:09+05:30 IST