Somireddy: జగన్ సర్కార్ ప్రాథమిక హక్కులను హరిస్తోంది..

ABN , First Publish Date - 2022-09-23T20:39:34+05:30 IST

పోలీసులు, సీఐడీ ప్రజలను రక్షించేందుకు కాదు.. భక్షించేందుకు ఉన్నారని సోమిరెడ్డి విమర్శించారు.

Somireddy: జగన్ సర్కార్ ప్రాథమిక హక్కులను హరిస్తోంది..

అమరావతి (Amaravathi): ఏపీ (AP)లో ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని, పోలీసులు, సీఐడీ ప్రజలను రక్షించేందుకు కాదు.. భక్షించేందుకు ఉన్నారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి (Somireddy Chandramohan reddy) విమర్శించారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు (Ankababu)ను అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. దీనిని ఖండిస్తున్నానన్నారు. జగన్ సర్కార్ (Jagan Govt.) ప్రాథమిక హక్కులను హరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.


జగన్ పాలనలో పోలీసు దాడులు, అరాచకాలు అధికమయ్యాయని సోమిరెడ్డి విమర్శించారు. సుప్రీం తీర్పులను సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ చెత్తబుట్ట పాలు చేస్తున్నారని, ప్రశ్నించే పాత్రికేయులపై, ప్రతిపక్ష నేతలపై కేసులు పెడుతున్నారని అన్నారు. వార్తల్లో వచ్చిన విషయాలను సోషల్ మీడియాలో ఫార్వాడ్ చేస్తే అర్థరాత్రి అరెస్టులేంటని ప్రశ్నించారు. సీఎంవోలో పనిచేసే అధికారి భార్య దొంగ బంగారంతో పట్టుబడితే ఇంతవరకు చర్యలు లేవని, ముఖ్యమంత్రి మీడియా, సోషల్ మీడియా అంటే భయపడుతున్నారని విమర్శించారు. అంకబాబును తక్షణమే విడుదల చేయాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు.

Read more