న్యాయమూర్తులపై దూషణ కేసులో ఏడుగురి అరెస్టు

ABN , First Publish Date - 2022-09-13T07:44:32+05:30 IST

సామాజిక మాధ్యమాల వేదికగా హైకోర్టు న్యాయమూర్తులను దూషించిన కేసులో ఓ మహిళ సహా ఏడుగురు నిందితులను సీబీఐ అరెస్టు చేసింది.

న్యాయమూర్తులపై దూషణ కేసులో ఏడుగురి అరెస్టు

  • జడ్జి ఎదుట హాజరుపరచిన సీబీఐ.. 
  • ఈ నెల 26 వరకు రిమాండ్‌
  • ఈ కేసులో ఇప్పటివరకు 18 మంది జైలుకు


విజయవాడ/అమరావతి, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): సామాజిక మాధ్యమాల వేదికగా హైకోర్టు న్యాయమూర్తులను దూషించిన కేసులో ఓ మహిళ సహా ఏడుగురు నిందితులను సీబీఐ అరెస్టు చేసింది. ‘నాకు అది హైకోర్టులా అనిపించడం లేదు.. టీడీపీ లీగల్‌ సెల్‌లా అనిపిస్తోంది.. ప్రభుత్వంపై హైకోర్టు ఇలా పగబట్టడం సరికాదు’ వంటి అనేక పోస్టులను సామాజిక మాధ్యమాల్లో పెట్టిన గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లికి చెందిన బతుళ్ల అశోక్‌రెడ్డి, పల్నాడు జిల్లా నరసరావుపేటవాసి ప్రదీ్‌పకుమార్‌రెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన రంగారావు, గుంటూరు జిల్లా నంబూరుకు చెందిన పి.సుమ, ప్రకాశం జిల్లాకు చెందిన మల్లికార్జునరావు, హైదరాబాద్‌కు చెందిన చొక్కా రవీంద్ర, ప్రకాశం జిల్లా పొదిలివాసి పి.రామాంజనేయరెడ్డి వీరిలో ఉన్నారు. సోమవారం రాత్రి విజయవాడ ఐదో చీఫ్‌ మెట్రోపాలిటన్‌ కోర్టు న్యాయమూర్తి జ్యోత్స్న ముందు వీరిని హాజరుపరిచారు. ఈనెల 26వ తేదీ వరకు వీరికి రిమాండ్‌ విధించారు. అనంతర ం విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు. దీంతో న్యాయమూర్తులను దూషిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టి అరెస్టయినవారి సంఖ్య 18కి చేరింది. గతంలో 11 మందిని సీబీఐ అరెస్టు చేసింది.


 వీరిలో వైసీపీ సోషల్‌ మీడియా విభాగంలో కీలక వ్యక్తి అవుతు శ్రీధర్‌రెడ్డితోపాటు జె.వెంకట సత్యనారాయణ, ఎస్‌.శ్రీనాథ్‌, జి. శ్రీధర్‌రెడ్డి, డి.కిశోర్‌ కుమార్‌, ఎస్‌.అజయ్‌ అమృత్‌ ఉన్నారు. పలు కేసుల్లో తీర్పులిచ్చిన నాటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు పలువురు జడ్జీలపై వైసీపీ కార్యకర్తలు, జగన్‌ అభిమానులు గతంలో అభ్యంతరకరమైన రీతిలో సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే. జగన్‌ ప్రభుత్వానికి మింగుడు పడని విధంగా వచ్చిన తీర్పులపై తీవ్రస్థాయి లో విమర్శలు గుప్పించారు. న్యాయమూర్తులను కించపరిచే లా సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని సీరియ్‌సగా పరిగణించి విచారణ జరపాల్సిందిగా రాష్ట్ర సీఐడీని అదేశించింది. అయితే ఆ సంస్థ ఒక్కరినీ కూడా అరెస్టుచేయకపోవడంతో కేసును సీబీఐకి బదిలీ చేస్తూ గత ఏడాది ఏప్రిల్లో ఆదేశాలిచ్చింది. రంగంలోకి దిగిన సీబీఐ.. బాధ్యుల ఆనవాళ్లు పసిగట్టింది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాం తాల్లో, ఇతర దేశాల్లో ఉన్న వారి పాత్రపై ఆధారాలు సేకరించింది. లభించిన ఆధారాల మేరకు 18 మందికి పైగా నోటీసులు జారీ చేసి.. విచారణకు పిలిచి అవసరమైనప్పుడు సంకెళ్లు వేస్తూ వస్తున్నారు.


 నిరుడు జూన్‌లో కడప జిల్లాకు చెందిన వైసీపీ కార్యకర్త లింగారెడ్డి గారి రాజశేఖర్‌రెడ్డిని అరెస్టు చేశా రు. జూలైలో ప్రకాశం జిల్లాకు చెందిన ధనిరెడ్డి కొండారెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అతడి పాత్రను ధ్రువీకరించుకున్నాక కోర్టులో హాజరుపరిచారు. ఆంగ్ల మాఽధ్యమానికి సంబంధించి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్పు వెలువరించిన న్యాయమూర్తిపై సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టిన గుంటూరు జిల్లాకు చెందిన పాముల సుధీర్‌ను సైతం అరెస్టు చేశారు. అయితే, ‘వైఎ్‌సఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా సైనికులకు విజ్ఞప్తి.. అరెస్టు విషయంలో ఎవ్వరూ భయపడాల్సిన పనిలేదు.. అరెస్టయిన వారికి న్యాయపరమైన సహాయ సహకారాలు అందించాం.. న్యాయవాదులు ఇప్పటికే కార్యాచరణలో భాగమయ్యారు.. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు’ అంటూ వైసీపీ నేత దేవేందర్‌రెడ్డి ఫేస్‌బుక్‌లో పోస్టు చేయడం గమనార్హం. వైసీపీ సీనియర్‌ నేత విజయసాయిరెడ్డి తదితరులు కూడా కార్యకర్తలు భయపడొద్దంటూ భరోసా ఇచ్చారు. కానీ సీబీఐ తన పని తాను చేసుకుపోతోంది. తాజాగా ఏడుగురిని జైలుకు తరలించింది.

Read more