నేటి నుంచి బడులు

ABN , First Publish Date - 2022-07-05T07:44:05+05:30 IST

రాష్ట్రంలో పాఠశాలలు మంగళవారం తెరుచుకోనున్నాయి. ఇప్పటికే గత నెల 28 నుంచి ఉపాధ్యాయులు పాఠశాలలకు వస్తుండగా.. మంగళవారం నుంచి

నేటి నుంచి బడులు

47 లక్షల మందికి విద్యా కానుక కిట్లు

పూర్తిస్థాయిలో చేరని పాఠ్య పుస్తకాలు,

గందరగోళం నడుమ పునఃప్రారంభం

‘విలీనం’ విద్యార్థులపై తాజా ఉత్తర్వులు


అమరావతి, జూలై 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పాఠశాలలు మంగళవారం తెరుచుకోనున్నాయి. ఇప్పటికే గత నెల 28 నుంచి ఉపాధ్యాయులు పాఠశాలలకు వస్తుండగా.. మంగళవారం నుంచి పూర్తిస్థాయిలో తరగతులు ప్రారంభం అవుతున్నాయి. ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో 47.4 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని పాఠశాల విద్యాశాఖ అంచనా వేసింది. వీరికి నేటి నుంచి విద్యా కానుక కిట్లు పంపిణీ ప్రారంభిస్తున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఆదోనిలో ఈ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. దీని కోసం రూ.931 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అంటే ఒక్కో విద్యార్థికి ఇచ్చే కిట్‌ విలువ రూ.1,963 పడుతోంది.


ఈ కిట్‌లో ఒక్కో విద్యార్థికి 3 జతల యూనిఫాం క్లాత్‌, జత బూట్లు, 2 జతల సాక్సులు, బెల్టు, స్కూల్‌ బ్యాగ్‌, పాఠ్య పుస్తకాలు, నోట్‌ బుక్స్‌, వర్క్‌ బుక్స్‌, 1, 6 తరగతుల విద్యార్థులకు ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ అందజేస్తారు. పాఠ్య పుస్తకాలు, విద్యా కానుక కిట్లు పూర్తిస్థాయిలో పాఠశాలలకు చేరకపోవడంతో.. ఈ నెల 5 నుంచి నెలాఖరు వరకూ పంపిణీ చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. రోజుకు పాఠశాలలో 30 నుంచి 40 మందికి మాత్రమే విద్యా కానుక కిట్లు అందుతాయి. 


ఆ విద్యార్థులను అప్పగించండి: విద్యాశాఖ

3, 4, 5 తరగతుల విద్యార్థులను మ్యాపింగ్‌ చేసిన పాఠశాలలకు పంపాలని, వారి రికార్డులను అప్పగించాలని పాఠశాల విద్యాశాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. మంగళవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ మేరకు చర్యలు చేపట్టింది. ఈ విద్యా సంవత్సరం నుంచి పాఠశాలలను ఆరు రకాలుగా వర్గీకరించారు. ఒక కిలోమీటరు పరిధిలో ఉన్న ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను సమీపంలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తున్నారు. అందుకు అనుగుణంగా ఏ ప్రాథమిక పాఠశాల ఏ ఉన్నత పాఠశాలలో విలీనమవుతుందో మ్యాపింగ్‌ చేశారు. అలా మ్యాపింగ్‌ చేసిన పాఠశాలలకు ఈ సర్దుబాట్లు చేయాలని తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. ఫౌండేషన్‌, ఫౌండేషన్‌ ప్లస్‌ పాఠశాలల్లో ఉన్న 3, 4, 5 తరగతుల విద్యార్థులను మ్యాపింగ్‌ చేసి.. ప్రీహైస్కూల్‌ లేదా ఉన్నత పాఠశాలకు పంపాలని సూచించింది. అందుకు అనుగుణంగా ఫౌండేషన్‌ ప్లస్‌, ప్రీహైస్కూల్స్‌లో ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని ఆదేశించింది.


అలాగే ప్రీహైస్కూల్స్‌లో 6, 7, 8 తరగతులు చదువుతున్న విద్యార్థులను 3 కిలోమీటర్ల ప్రాతిపదికన మ్యాపింగ్‌ చేసిన ఉన్నత పాఠశాలకు పంపాలని స్పష్టంచేసింది. మ్యాపింగ్‌ చేసిన పాఠశాలలకు పంపే విద్యార్థుల టీసీలు, రికార్డు షీట్లను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అప్పగించాలని ఆదేశించింది. సర్దుబాటులో మిగిలిపోయిన ఉపాధ్యాయులను పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ముగిసేవరకూ స్కూల్‌ కాంప్లెక్స్‌కు గానీ లేదా మండలంలో ఎక్కడైనా సర్దుబాటు చేయాలని ఆదేశించింది.

Updated Date - 2022-07-05T07:44:05+05:30 IST