సవాంగ్‌ను కరివేపాకు మాదిరిగా తీసి పారేశారు

ABN , First Publish Date - 2022-02-16T07:15:50+05:30 IST

డీజీపీ గౌతం సవాంగ్‌ను వాడుకొన్నన్ని రోజులు వాడుకొని చివరకు కరేపాకు మాదిరిగా ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి తీసిపారేశారని టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల...

సవాంగ్‌ను కరివేపాకు మాదిరిగా తీసి పారేశారు

  మోకాళ్లపై కూర్చున్నా ప్రవీణ్‌ ప్రకాశ్‌కు పరాభవం తప్పలేదు

 ధికారంలో ఉన్నవారిని తృప్తిపరచాలనుకుంటే ఎవరికైనా అదేగతి: వర్ల


అమరావతి, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): డీజీపీ గౌతం సవాంగ్‌ను వాడుకొన్నన్ని రోజులు వాడుకొని చివరకు కరేపాకు మాదిరిగా ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి తీసిపారేశారని టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. చీఫ్‌ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యం మొదలుకొని తన పేషీ వరకూ అనేక మంది అధికారులకు సీఎం ఇదే గతి పట్టించారని, వాడుకొని వదిలేయడం ఆయనకు అలవాటుగా మారిందని విమర్శించారు. మంగళవారం ఆయన ఇక్కడ తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘జగన్‌ రెడ్డి ఎవరిపై కేసు పెట్టమంటే వారిపై పెట్టి పాదపూజలో పునీతమైనా సవాంగ్‌కు చివరకు పోస్టింగ్‌ కూడా ఇవ్వనంత అవమానకరంగా బయటకు పంపారు. బహిరంగంగా అందరి ముందూ మోకాళ్లపై కూర్చుని ముఖ్యమంత్రి వద్ద అతి వినయం ప్రదర్శించినా ప్రవీణ్‌ ప్రకాశ్‌కు పరాభవం తప్పలేదు. జగన్‌ రెడ్డి తరపున అంతా తానే అన్నట్లుగా వ్యవహరించిన అజయ్‌ కల్లం రెడ్డి తర్వాత సజ్జల దెబ్బకు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆర్థిక వ్యవహారాల్లో నిష్ణాతునిగా పేరు తెచ్చుకొని ముఖ్యమంత్రి పేషీలో పనిచేసిన పీవీ రమేశ్‌ ఇప్పుడు పోలీసుల దెబ్బకు భయపడి దాక్కొని తిరగాల్సి వస్తోంది. వీరందరి అనుభవాలు రాష్ట్రంలో అధికారులందరికీ కనువిప్పు కలిగించాలి. నిబంధనలను తుంగలో తొక్కి అధికారంలో ఉన్నవారి తృప్తి కోసమే పనిచేస్తే ఎవరికైనా చివరకు సవాంగ్‌కు పట్టిన గతే పడుతుంది’ అని వర్ల అన్నారు. పదవిలో ఉన్నా లేకపోయినా సవాంగ్‌ తన తప్పిదాలకు శిక్ష అనుభవించాల్సిందేనన్నారు. 

Read more