సాగర్‌ ఎడమ కాల్వకు గండి!

ABN , First Publish Date - 2022-09-08T09:37:57+05:30 IST

సాగర్‌ ఎడమ కాల్వకు గండి!

సాగర్‌ ఎడమ కాల్వకు గండి!

ముంపులో నిడమనూరు, నర్సింహులగూడెం 


నిడమనూరు, సెస్టెంబరు 7: నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్‌ ఎడమ కాల్వకు గండిపడింది. దీంతో నిడమనూరు, నర్సింహులగూడెం గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ గ్రామాల్లో దాదాపు ఏడు అడుగుల ఎత్తులో నీరు చేరడంతో ప్రజలు భయాందోళనలకు గురై నివాసాలను వదిలి వీధుల్లోకి పరుగులు తీశారు. ప్రవాహం అంతకంతకూ ఎక్కువవుతుండడంతో ఏ క్షణాన ఏం జరుగుతోందనని బిక్కుబిక్కుమంటూ గడిపారు. పట్టణంలోని రోడ్డు వెంటవున్న పెట్రోల్‌ బంక్‌, ఎస్‌బీఐ, మినీ గురుకులం, పలు దుకాణాలు, నివాసాల్లోకి భారీగా నీరు చేరింది. సుమారు 500 ఎకరాల్లో పంట నీట మునిగింది. నీటి ఉధృతికి వరినాట్లు కొట్టుకుపోయాయి. విద్యుత్‌ సరఫరా నిలిపివేయడంతో గ్రామాల్లో అంధకారం నెలకొంది. నిడమనూరు మండలం ముప్పారం- వేంపాడు గ్రామాల మధ్య బుదవారం సాయంత్రం 5:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. 32.109 కి.మీ యూటీ వద్ద గండి పడి, వరద ఉధృతికి కాల్వకట్ట పూర్తిగా తెగిపోయింది. విషయం తెలుసుకున్న ఎన్‌ఎస్పీ అధికారులు సాయంత్రం 6.15 గంటలకు ఎడమకాల్వకు నీటి విడుదల నిలిపివేయడంతో పాటు కాల్వపై హాలియా, పెద్దదేవులపల్లి వద్ద నున్న గేట్లను మూసి వేసి నీటి ఉధృతిని తగ్గించారు. దేవరకొండ- మిర్యాలగూడ ప్రధాన రహదారిపై ఏడు అడుగుల మేర వరద నీరు ప్రవహించడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ, హాలియా తదితర ప్రాంతాలకు వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. 


భయాందోళనలో స్థానికులు

ఫంక్షన్‌హాళ్లలో పునరావాసం 

నిడమనూరు, నర్సింహులగూడెం గ్రామాల్లో ఏడు అడుగుల ఎత్తులో నీరు ఉండటంతో అక్కడ ఉండే వారి కోసం స్థానిక అధికారులు పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేశారు. నిడమనూరులోని బాలాజీ ఫంక్షన్‌హాల్‌తో పాటు శాఖాపురం సాయి ఫంక్షన్‌హాల్‌లో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక మినీ గురుకులంలోని 88 మంది విద్యార్థులను బాలాజీ ఫంక్షన్‌హాల్‌కు, నర్సింహులుగూడెం ప్రజలను శాఖాపురం పునరావాస కేంద్రానికి తరలించారు. దీంతో పాటు అధికారులు, పోలీసులు లోతట్టు ప్రాంతాల వారిని అప్రమత్తం చేశారు. కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి, ఆర్డీవో రోహిత్‌సింగ్‌, డీఎస్పీ వెంకటేశ్వరరావు, తదితరులు గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు.  


యూటీ లీకేజీనే కారణం

గండికి గల కారణాలపై ఎన్‌ఎ్‌సపీ అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. యూటీ లీకేజీ కారణంగా కాల్వకు గండి పడిందని భావిస్తున్నారు. ఎడమకాల్వ డిజైన్‌ డిశ్చార్జ్‌ 11 వేల క్యూసెక్కులకు గాను 7 వేల క్యూసెక్కులే విడుదలవుతుండటంతో నీటి ఉధృతి కూడా సామర్థ్యానికి లోబడే ఉందని తెలిపారు. ప్రమాదం సాయంత్రం సమయంలో గండిపడటం వల్ల కాల్వ కట్టపై జనసంచారం అంతగా లేదు. దీంతో ఎటువంటి ప్రాణనష్టం జరుగలేదు. దీనికి తోడు అధికారులు నష్టనివారణ చర్యలు త్వరగా చేపట్టడంతో పెనుప్రమాదం తప్పింది. ఇదే గండి రాత్రి వేళ పడి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగేదని నిడమనూరు, నర్సింహులుగూడెం ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. 

Read more