ఆర్‌టీసీ ఆదాయంలో.. ప్రభుత్వానికి వాటా!

ABN , First Publish Date - 2022-02-23T08:11:27+05:30 IST

ఆర్‌టీసీ ఆదాయంలో రాష్ట్రప్రభుత్వానికి వాటా ఇవ్వబోతున్నామని సంస్థ ఎండీ ద్వారకాతిరుమలరావు వెల్లడించారు. ప్రతిపాదన సిద్ధమైందని, ఎంతమేరకు ఇవ్వాలనే దానిపై త్వరలో పాలకమండలిలో చర్చించి

ఆర్‌టీసీ ఆదాయంలో.. ప్రభుత్వానికి వాటా!

ఎంతివ్వాలో త్వరలో నిర్ణయం: ఎండీ ద్వారకా తిరుమలరావు 


అమరావతి, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): ఆర్‌టీసీ ఆదాయంలో రాష్ట్రప్రభుత్వానికి వాటా ఇవ్వబోతున్నామని సంస్థ ఎండీ ద్వారకాతిరుమలరావు వెల్లడించారు. ప్రతిపాదన సిద్ధమైందని, ఎంతమేరకు ఇవ్వాలనే దానిపై త్వరలో పాలకమండలిలో చర్చించి నిర్ణయిస్తామని తెలిపారు. బస్సులకు బల్క్‌ ద్వారా కొనుగోలు చేస్తున్న డీజిల్‌ ధర ఎక్కువగా ఉన్నందున మార్చి 1 నుంచి రిటైల్‌ పద్ధతిలో బంకుల్లోనే తక్కువ ధరకు నింపనున్నట్లు చెప్పారు. డీజిల్‌ ధరల్లో వ్యత్యాసం ఉన్నా ప్రయాణికుల టికెట్ల ధరలు మాత్రం పెంచేది లేదన్నారు. మంగళవారం విజయవాడలోని ఆర్‌టీసీ హౌస్‌లో ఆయన మాట్లాడారు. ఆర్‌టీసీ ఆదాయం కొంత పెరుగుతోందని.. రోజుకు 18 వేల నుంచి 22 వేలకు చేరిన పార్శిళ్ల ద్వారా ఏటా రూ.97.44 కోట్ల వరకూ ఆర్జిస్తున్నామని చెప్పారు.


సంస్థ అప్పులు తీరుస్తున్నామని, పీఎ్‌ఫలో రూ.640 కోట్లు, సీసీఎ్‌సకు ఉన్న రూ.269 కోట్లు తీర్చేసినట్లు తెలిపారు. కారుణ్య నియామకాలపై ఎవ్వరూ కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు. 2015-19 మధ్య పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలకు సంబంధించి గ్రామ/వార్డు సచివాలయ కార్యదర్శి పోస్టుల్లో  భర్తీ చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. త్వరలోనే సుమారు 1,500 మందికి ఆర్‌టీసీలోని ఖాళీల్లో కారుణ్య నియామకం కింద ఉద్యోగాలిస్తామని చెప్పారు. సంస్థ ఉద్యోగులు సమ్మెకు వెళ్తే ఉపయోగం ఉండదన్నారు.


కాగిత రహిత టికెట్ల జారీలో అవార్డు

నగదు రహిత లావాదేవీలు, కాగిత రహిత టికెట్ల జారీలో ఆర్‌టీసీ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని తిరుమలరావు అన్నారు. జాతీయ స్థాయిలో పలు రాష్ట్రాల ప్రభుత్వ రంగ సంస్థలతో పోటీపడి ‘డిజిటల్‌ టెక్నాలజీ సభ’ అవార్డును ఆర్‌టీసీ సొంతం చేసుకుంది. వరుసగా నాలుగోసారి సంస్థ సాధించిన ‘ఎంటర్‌ప్రైజ్‌ అప్లికేషన్‌’ అవార్డును వర్చువల్‌గా ఆయన అందుకున్నారు.  

Read more