‘నేల’ విడిచి సాము..!

ABN , First Publish Date - 2022-07-17T08:46:39+05:30 IST

రాష్ట్రంలో భూముల సమగ్ర సర్వేను ప్రారంభించినప్పుడు కార్స్‌ (కంటిన్యుయస్‌ ఆపరేటింగ్‌ రిఫరెన్స్‌ స్టేషన్‌)నెట్‌వర్క్‌ను తెచ్చారు. వందలకోట్లు ఖర్చుపెట్టి బేస్‌స్టేషన్లు ఏర్పాటు చేశారు.

‘నేల’ విడిచి సాము..!

భూముల రీ సర్వేలో కొత్త మలుపు 

భూమ్మీద కొలతలు.. అంతరిక్షం నుంచి ఫొటోలు

విమానాలతో ఏరియల్‌ ఫొటోగ్రఫీ

శాటిలైట్‌, విమాన ఫొటోగ్రఫీ సెంటర్లు

టెండర్లు ఆహ్వానించిన సర్కారు


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో భూముల సమగ్ర సర్వేను ప్రారంభించినప్పుడు కార్స్‌ (కంటిన్యుయస్‌ ఆపరేటింగ్‌ రిఫరెన్స్‌ స్టేషన్‌)నెట్‌వర్క్‌ను తెచ్చారు. వందలకోట్లు ఖర్చుపెట్టి బేస్‌స్టేషన్లు ఏర్పాటు చేశారు. దీంతోనే భూముల రీ సర్వేచేస్తామని భారీగా రోవర్లు కొనుగోలు చేశారు. ఆ తర్వాత డ్రోన్లను తెరపైకి తీసుకొచ్చారు. డ్రోన్లతో భూముల ఫొటోలు తీసి వాటిని భూ చిత్రపటాలతో సరిపోల్చి గ్రౌండ్‌ ట్రూతింగ్‌ చేస్తామన్నారు. తొలుత ప్రైవేటు డ్రోన్ల సేవలకు టెండర్లు పిలిచారు. అందులో ఏం సమస్యలు వచ్చాయో సర్కారే సొంతంగా డ్రోన్లు కొనుగోలు చేసింది. ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఎదుట ఆ డ్రోన్లను ప్రదర్శించారు. వాటిని ఫీల్డ్‌లోకి తీసుకెళ్లిన తర్వాతే వాటి సామర్ధ్యం బయటపడింది. రెండు జిల్లాల్లో డ్రోన్లు నేలకూలినట్లు ఫొటోలు బయటకొచ్చాయి. దీంతో రీ సర్వేలో డ్రోన్ల పాత్ర ఎంత? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.


ఇంతలో వర్షాకాలం వచ్చేసింది. సాధారణ పరిస్థితుల్లోనే ఆ డ్రోన్లు గాల్లోకి ఎగిరి క్షేమంగా ల్యాండ్‌ అయిన సందర్భాలు చాలా తక్కువ అని అధికారవర్గాలే చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆ డ్రోన్లను గాల్లోకి పంపించగలరా? తిరిగి అవి క్షేమంగా నేలపై దిగుతాయా? అన్న అనుమానాలున్నాయి. దీంతో అధికారులు మరో ప్లాన్‌ వేశారు. అదే ఏరియల్‌ ఫొటోగ్రఫీ. డ్రోన్లకు బదులు భారీ విమానాలను ఆకాశంలోకి పంపించి భూమి ఫొటోలు తీసి వాటితో గ్రౌండ్‌ ట్రూతింగ్‌ చేయడం. అంటే, ఆ ఫొటోల ఆధారంగా  భూముల సర్వే చేస్తారు. ఇందులో గత ఏడాదిలోనే టెండర్లు పిలిచారు. కానీ వర్కవుట్‌కాలేదు. ఇప్పుడు మరోసారి టెండర్లు పిలిచారు. 30వేల చదరపు కిలోమీటర్ల మేర విమానంతో ఏరియల్‌ ఫొటోగ్రఫీ తీయడానికి బిడ్లు ఆహ్వానించారు. టెండర్లు పూర్తయి ప్రాజెక్టు అప్పగించిన తర్వాత 4 నెలల్లో వర్క్‌ పూర్తిచేయాలన్న నిబంధన విధించారు. రోజుకు 200 చదరపు కి.మీ. చొప్పున నెలకు 8వేల చదరపు కిమీ ఏరియల్‌ ఫొటోగ్రఫీ తీయాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలు, వ్యవసాయ భూములు, ఆబాదీ ఏరియా, హ్యాబిటేషన్లు, పట్టణ ప్రాంతాలను ఏరియల్‌ ఫొటోగ్రఫీ సర్వేలో చేర్చారు. టెండర్లు పూర్తయిన తర్వాత సర్వేచేయాల్ని ప్రాంతాన్ని ప్రకటిస్తారని తెలిసింది. 


శాటిలైట్‌ సర్వేకు టెండర్లు

సర్కారు శాటిలైట్‌ సర్వేకు వెళ్లబోతోందని 2 నెలల క్రితమే ‘ఆంధ్రజ్యోతి’ చెప్పింది. ఇప్పుడు అదే నిజమవుతోంది. అవసరం ఉన్న చోట అనే ప్రాతిపదికన శాటిలైట్‌ ఇమేజ్‌ ద్వారా సర్వేచేయాలని నిర్ణయించింది. ఈ మేరకు శాటిలైట్‌ చిత్రాలను ప్రాసె్‌సచేసి, ఆర్ధోరెక్టిఫైడ్‌ ఇమేజ్‌ (ఓఆర్‌ఐ)లు ఇచ్చేందుకు టెండర్లు పిలిచారు. రెండు ప్యాకేజీల కింద టెండర్లు ఆహ్వానిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. 2500 చదరపు కిమీ మేర శాటిలైట్‌ చిత్రాలను తీసి గ్రౌండ్‌ ట్రూతింగ్‌ చేసేలా ఓఆర్‌ఐలను ముద్రించనున్నారు. బిడ్‌ దక్కించుకున్న సంస్థ వర్క్‌ ప్రారంభించిన తర్వాత రెండు నెలల్లోగా పనులు పూర్తిచేయాలన్న నిబంధన విధించారు. 


కొత్తమలుపులో రీ సర్వే

భూముల సర్వేలో నేలమీద నిలబడి కొలిచే పని తప్ప మిగతా అన్ని మార్గాలనూ ఆచరించారు. ఇప్పుడు కొత్తగా విమానాలతో ఫొటోలు తీయించడం, అంతరిక్షంలోని శాటిలైట్‌ ద్వారా భూమి చిత్రాలను వాడుకోవడం వంటి పద్ధతులను ఆన్వేషిస్తున్నారు. అయితే, వీటికన్నా నేలమీద నిలబడి భూమిని కొలిచే మార్గమే ఉత్తమ ఫలితాలు ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ పనిచేయడానికి సర్కారుకు తగినంత సిబ్బంది, మానవ వనరులు, సాంకేతిక అందుబాటులో ఉందని, అయినా టెక్నాలజీ పేరిట పరుగులు తీయడం వల్ల ఏం ప్రయోజనం అని సర్వే నిపుణులు ప్రశ్నిస్తున్నారు. నేలవిడిచి సాముచేయడం అంటే ఇదేనని, ఇప్పటికైనా సర్కారు తనకున్న సిబ్బందితో క్షేత్రస్థాయిలో భూముల సర్వేచేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ’’


సమగ్ర భూముల సర్వే విషయంలో జగన్‌ సర్కారు నేల విడిచి సాము చేస్తోందా? అంటే.. నిపుణులు అవుననే అంటున్నారు! ఎందుకంటే.. అది భూమ్మీద నిలబడి కొలిచే పని... భూముల గట్లు ఎలా ఉన్నాయి?.. మార్పులేమైనా జరిగాయా?.. సవరణలు చేయాలా.. అని ఆరాతీసి కొలతలేయాల్సిన పని. దీనికోసం ముందు డీజీపీఎస్‌ మెషీన్లు వాడేవారు. అది పాతదన్నారు. కార్స్‌ టెక్నాలజీ అన్నారు. ప్రపంచంలోనే సూపర్‌ టెక్నాలజీ అని పరుగులు తీశారు. ఆ తర్వాత.. ప్రపంచంలోనే ఇంత వరకు ఏ దేశం డ్రోన్లతో భూముల సర్వేచేయలేదని, ఒక్క ఏపీనే ఆ రికార్డు సొంతం చేసుకుందని డబ్బాకొట్టుకున్నారు. డ్రోన్లు అద్దెకు తెచ్చారు. ఆ తర్వాత సొంతంగా కొన్నారు. అందులో కొన్ని నేలకూలాయి. ఇప్పుడు విమానాలను తేబోతున్నారు. అంతేనా.. అంతరిక్షంలోని శాటిలైట్‌ ఇమేజ్‌ను వాడుకోబోతున్నారు. ఇందుకోసం టెండర్లు పిలిచారు. ఇదీ ఓ రికార్డే. భూమ్మీద చేసే పనికి అంతరిక్షం వరకు మార్గాలేయడం చిన్నవిషయం కాదని నిపుణులే చెబుతున్నారు. ఇదెంతవరకు సత్ఫలితాలిస్తుందో చూడాలి!.

Read more