జోరు వాన

ABN , First Publish Date - 2022-10-07T08:11:24+05:30 IST

జోరు వాన

జోరు వాన

రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు

పలు గ్రామాలు, కాలనీలు జలమయం

పొంగి ప్రవహిస్తున్న వాగులు, గెడ్డలు, చెరువులు

పిడుగుపాటుకు ముగ్గురి మృతి, మరో ఇద్దరికి గాయాలు

వరహాలగెడ్డలో కొట్టుకుపోయి ఒకరు మృతి, మరొకరు గల్లంతు

మరో మూడు రోజులూ వర్షాలే.. వాతావరణ శాఖ అంచనా


(ఆంధ్రజ్యోతి, న్యూస్‌నెట్‌వర్క్‌)

అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. అనేకచోట్ల గెడ్డలు, వాగులు, చెరువులు, చిన్ననదులు పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రకాశం జిల్లా కనిగిరిలో 142, కొనకనమిట్లలో 105, కంభంలో 102, బేస్తవారపేటలో 98, మర్రిపూడిలో 90, ఏలూరు జిల్లా కలిదిండిలో 78,  శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లిలో 72మి.మీ. వర్షపాతం నమోదైంది. అనంతపురం మండలంలోని పలు గ్రామాలు, రుద్రంపేటలోని పలుకాలనీలు జలమయమయ్యాయి. ఆలమూరు, యాలేరు, కక్కలపల్లి చెరువులు మరవ పారాయి. రుద్రంపేట నుంచి కట్టకిందపల్లి, ఆలమూరు వెళ్లే ప్రధాన రహదారిపై నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జి వద్ద రాకపోకలు నిలిపోయాయి. స్థానికులు వంతెన దాటేందుకు ఇబ్బందులు పడ్డారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లి, ప్రసన్నాయపల్లిలో 1.20 హెక్టార్లల్లో రూ.30 లక్షల విలువైన ద్రాక్ష పంట దెబ్బతింది. కళ్యాణదుర్గం మండలంలో 8 హెక్టార్లల్లో రూ.8 లక్షల విలువైన టమోటా పంట దెబ్బతిందని ఉద్యాన శాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ప్రకాశం జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో గిద్దలూరు, కనిగిరి, పొదిలి, చీమకుర్తి, ఒంగోలు పరిసర ప్రాంతాల్లోని మార్గాల్లో రవాణాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. గుండ్లకమ్మ రెండు గేట్లు ఎత్తి 3,000 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఒంగోలు, కనిగిరి, పొదిలి తదితర పట్టణాల్లో లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరి జనం ఇక్కట్లు పడ్డారు. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగి జనం అవస్థలు పడ్డారు. మిర్చి, పత్తి పొలాల్లో నీరు చేరింది. దర్శి ప్రాంతంలో కోతలు కోసిన సజ్జ పంట తడిచి దెబ్బతింది. ఏలూరుజిల్లాలో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొంగువారిగూడెం ఎర్రకాలువ ప్రాజెక్టులోకి 3,723 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా 2,716 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ముసునూరు మండలం సింహాద్రిపురం ప్రధానరహదారిపై రాములేరు వాగు ఉధృతంగా ప్రవహించటంతో నూజివీడు ప్రాంతానికి రాకపోకలు నిలిచిపోయాయి. శ్రీకాకుళం జిల్లాలో మూడురోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. నాగావళి, వంశధార, బహుదా నదుల్లో నీటి ఉధృతి పెరిగింది. వాగులు, వంకలూ పొంగి ప్రవహిస్తున్నాయి. పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఆవరణలో నీరు నిలిచి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. కాలువల్లోని మురుగు నీరు రోడ్లపై ప్రవహించింది. పొందూరు, వజ్రపుకొత్తూరు మండలాల్లో ఇళ్లలోకి వరదనీరు చేరింది. 


నలుగురు మృతి..

పల్నాడు జిల్లా మాచవరం మండలం, పిన్నెల్లిలో గురువారం పిడుగుపాటుకు.. మిరపనాట్లు వేస్తున్న వ్యవసాయకూలీ మహంకాళి చంద్రశేఖర్‌(42) మరణించగా, మరోవ్యక్తి గాయాలపాలయ్యారు. ప్రకాశంజిల్లా కురిచేడు మండలం బయ్యవరంలో పొలంలో పనికి వెళ్లిన వి.ఆంజనేయులు(60), దర్శి మండలం పెద్ద ఉయ్యలవాడలో గేదెలు కాస్తున్న నాదెండ్ల రాణెమ్మ(35) కూడా బుధవారం పిడుగుపాటుకు మరణించారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కేదారిపురం వద్ద రోడ్డుపై ఉధృతంగా ప్రవహిస్తున్న వరహాలుగెడ్డలో పడి బుధవారం పాడి శంకరరావు(27) మరణిం చారు.   


పత్తి, అపరాల పంటలకు నష్టం

భారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా పత్తి, అపరాల పంటలకు నష్టం కలుగుతోంది. దక్షిణకోస్తా, రాయలసీమలో ఐదారు రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లోని పత్తి చేలల్లో నీరు నిలిచి, పైరు ఉరకెత్తుతుండగా, కోతకొచ్చిన అపరాల పంటలు గింజ పాడయ్యే పరిస్థితి వచ్చిందని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం పత్తి పూత, కాయ దశలో ఉంది. ఇప్పుడిప్పుడే పత్తితీతలు మొదలవుతున్నాయి. మరోవైపు మినుము, పెసర కోతలు సాగుతున్నాయి. వర్షం మరీ ఎక్కువైతే పత్తి గూడరాలిపోయి నష్టం కలుగుతుందని పత్తి రైతులు, మినుము,పెసర పంటలు తడిసి నష్టం జరుగుతుందని అపరాల రైతులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 16.32లక్షల ఎకరాల్లో పత్తి, 6.22లక్షల ఎకరాల్లో అపరాల పంటలు సాగులో ఉన్నాయి. మరో రెండు రోజులు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని, రైతులు వ్యవసాయ పంటల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ అంబేడ్కర్‌ సూచించారు. 


9 వరకు వానలే

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని అల్పపీడనం బుధవారం బలహీనపడింది. దానిపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం దక్షిణ కోస్తా పరిసరాల్లో కొనసాగుతోంది. అలాగే, బంగాళాఖాతం నుంచి దక్షిణ కోస్తా, తెలంగాణ, విదర్భ, మధ్యప్రదేశ్‌ మీదుగా ఉత్తరప్రదేశ్‌ వరకు ద్రోణి విస్తరించింది. వీటి ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అనేక ప్రాంతాల్లో విస్తారంగా, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల తొమ్మిదో తేదీ వరకు వర్షాలు కొనసాగుతాయంది. ఉపరితల ఆవర్తనం బలపడి తుఫాన్‌గా మారే అవకాశం లేదని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. అయితే, ఇది కోస్తా తీరం దిశగా వచ్చే క్రమంలో వర్షాలు కురుస్తాయన్నారు. Read more