కులం కన్నా గుణం మిన్న

ABN , First Publish Date - 2022-10-04T07:15:47+05:30 IST

‘కులం కన్నా గుణం మిన్న. నీతి, నిజాయతీ కలిగిన ప్రజాప్రతినిధులను ప్రోత్సహించాలి. రాజకీయాల్లో కులం, నేరాలను ఎంత త్వరగా వదులుకుంటే ప్రజాస్వామ్యం అంత బలపడుతుంది. అవినీతి,

కులం కన్నా గుణం మిన్న

నీతి నిజాయతీ కలిగిన వారిని ప్రోత్సహించాలి

రాజకీయల్లో జోక్యం చేసుకోను.. కానీ మాట్లాడుతా

బాధ్యతల నుంచి తప్పుకున్నా.. అలసిపోలేదు

నెల్లూరు పర్యటనలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు


నెల్లూరు(ఆంధ్రజ్యోతి)/వెంకటాచలం, అక్టోబరు 3: ‘కులం కన్నా గుణం మిన్న. నీతి, నిజాయతీ కలిగిన ప్రజాప్రతినిధులను ప్రోత్సహించాలి. రాజకీయాల్లో కులం, నేరాలను ఎంత త్వరగా వదులుకుంటే ప్రజాస్వామ్యం అంత బలపడుతుంది. అవినీతి, అరాచకాలపై శాంతియుతంగా పోరాడాలి. అందుకు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. నేను బాధ్యతల నుంచి తప్పుకున్నాను తప్ప అలసిపోలేదు. రాజకీయాల్లో జోక్యం చేసుకోను, కానీ రాజకీయాల గురించి మాట్లాడతాను. సిద్ధాంతాలను వదిలిపెట్టను. ఏ రాజకీయ పార్టీ తరఫునా ప్రచారం గానీ పోటీ గానీ చేయను’ అని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. ఉప రాష్ట్రపతి పదవీకాలం ముగిశాక మొదటిసారి నెల్లూరుకు వచ్చిన సందర్భంగా సోమవారం ఆయనకు ఘన స్వాగతం లభించింది. రాజకీయ నేతలు, మిత్రులు కలిసి వెంకయ్యకు ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా పాల్గొన్నారు. ముందుగా వెంకయ్యనాయుడును ఘనంగా సన్మానించారు. అనంతరం మాజీ ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. నెల్లూరు వీధుల్లో తిరిగిన తాను అధికారంలో ఉన్న బీజేపీకి జాతీయ అధ్యక్షుడిని అవుతానని అనుకోలేదని చెప్పారు.


ఆర్‌ఎ్‌సఎస్‌ నేర్పిన సంస్కారం, ఏబీవీపీ మార్గదర్శకం, బీజేపీ అందించిన ప్రోత్సాహంతో తాను అంచెలంచెలుగా ఎదిగానన్నారు. కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు ఓం బిర్లా ఒక జిల్లాకు బీజేవైఎం అధ్యక్షుడిగా ఉన్నారని, ఆయన ప్రతిభను గుర్తించి ఎమ్మెల్యే సీటు ఇప్పించి గెలిపించడంలో కృషి చేసినట్లు వెంకయ్య గుర్తు చేసుకున్నారు. తనకు ఏ బాధ్యత అప్పగించినా న్యాయం చేశానని, సంతృప్తిగా నెల్లూరుకు తిరిగి వచ్చానన్నారు. ఎన్నికల్లో రూపాయి ఖర్చు చేయకుండా గెలిచానని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తిని ప్రత్యర్థిగానే చూడాలి తప్ప శత్రువుగా కాదని సూచించారు. తాను అలా భావించాను కాబట్టే నేడు తాను ప్రశాంతంగా జీవిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ విధానాలను విమర్శించాలి తప్ప వ్యక్తిగతంగా కాదని హితవుపలికారు. ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉండాలంటే అన్ని రాజకీయ పార్టీలు ప్రవర్తనా నియమావళిని రూపొందించుకోవాలని వెంకయ్య సూచించారు. రాజకీయాల్లో ఓపిక, నేర్పు ఉండాలని, ఒకసారి ఓడిపోతే మరోసారి గెలుస్తారని అన్నారు. గెలిచినా, ఓడినా నిరంతరం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలపై ఉందని చెప్పారు. ప్రతి రాజకీయ నాయకుడు ఆ రోజు తాను చేసిన పనులను రాత్రి ఒకసారి మననం చేసుకొని చేసిన తప్పులను మరుసటి రోజు సరిచేసుకున్నప్పుడే రాణించగలుగుతారని వెంకయ్యనాయుడు సూచించారు.
వెంకయ్య రోల్‌ మోడల్‌: ఓంబిర్లా 

వెంకయ్యనాయుడు దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ కార్యకర్తలకు ఓ రోల్‌ మోడల్‌ అని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా కొనియాడారు. వెంకటాచలంలోని స్వర్ణభారత్‌ ట్రస్ట్‌లో సోమవారం జరిగిన దసరా వేడుక-ప్రతిభకు పురస్కారం కార్యక్రమంలో వెంకయ్యనాయుడుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓంబిర్లా మాట్లాడుతూ.. దశాబ్దాలుగా వేలాది మంది పార్టీ కార్యకర్తల జీవితాలను ప్రభావితం చేసి, వారిని రాజకీయాల్లో ఉన్నత విలువలు కలిగి ఉండే నిజమైన వ్యక్తులుగా తీర్చిదిద్దిన ప్రముఖ నాయకుల్లో వెంకయ్య ఒకరని అన్నారు. తాను పార్టీ యువ మోర్చాలో ఉన్నప్పుడు సీనియర్‌ నాయకుడిగా తనతోపాటు తనలాంటి అనేక మందికి మార్గదర్శనం చేసి, సలహాలు, సూచనలు అందించారని గుర్తు చేసుకున్నారు. ఉపరాష్ట్రపతిగా ఆయన పదవీ విరమణ చేసినా, తమదైన విలక్షణ మార్గంలో ప్రజలకు దగ్గరగానే ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకయ్యనాయుడు సతీమణి ఉషమ్మ, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ కామినేని శ్రీనివాస్‌, స్వర్ణభారత్‌ ట్రస్టీ దీపా వెంకట్‌, ముప్పవరపు ఫౌండేషన్‌ చైర్మన్‌ హర్షవర్ధన్‌ నాయుడు పాల్గొన్నారు.

Read more