విశాఖలో సైకో కిల్లర్‌!

ABN , First Publish Date - 2022-08-16T10:01:14+05:30 IST

సోమవారం వచ్చిందంటేనే విశాఖపట్నం జిల్లా పెందుర్తి పరిసర ప్రాంత వాసులు బెంబేలెత్తిపోతున్నారు.

విశాఖలో సైకో కిల్లర్‌!

  • సెల్లార్లలో వాచ్‌మన్‌ కుటుంబాలే టార్గెట్‌
  • శివారున నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్లలో ఘోరం
  • ఇప్పటికి మూడు హత్యలు.. మరో హత్యాయత్నం
  • పోలీసుల అదుపులో అనుమానితుడు

పెందుర్తి, ఆగస్టు 15: సోమవారం వచ్చిందంటేనే విశాఖపట్నం జిల్లా పెందుర్తి పరిసర ప్రాంత వాసులు బెంబేలెత్తిపోతున్నారు. శివారు ప్రాంతాల్లోని నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్ల సెల్లార్లలో నివసించే వాచ్‌మన్ల కుటుంబాలే లక్ష్యంగా ఇక్కడ వరుస హత్యలు జరుగుతున్నాయి. ఈ ఘటనలన్నీ సోమవారం నాడే జరుగుతున్నాయి. దీంతో ఇది సైకో కిల్లర్‌ పనేనని పోలీసులు కూడా భావిస్తున్నారు. గత సోమవారం చినముషిడివాడలో నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్‌లో వృద్ధ దంపతులు అప్పారావు, లక్ష్మి దారుణ హత్యకు గురయ్యారు. అదేరీతిలో సుజాతనగర్‌ నాగమల్లి లేఅవుట్‌లో ఈ సోమవారం(ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత) నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్‌లో వాచ్‌మన్‌ భార్య అప్పికొండ లక్ష్మి హత్యకు గురయ్యారు. హత్య జరిగిన ప్రాంతంలో అనుమానాస్పద వ్యక్తి పట్టుబడడం, అతని వద్ద ఇనుపరాడ్డు లభించడంతో అతనే సైకో కిల్లర్‌ అని స్థానికులు అనుమానిస్తున్నారు. 


శివారు ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్లను లక్ష్య్గంగా చేసుకుని అర్ధరాత్రి సమయంలో ఈ హత్యలకు పాల్పడుతున్నట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. సెల్లార్‌లో ఎటువంటి భద్రత లేని వాచ్‌మన్‌ కుటుంబాలను టార్గెట్‌ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. పట్టుబడ్డ అనుమానితుడిని నర్సీపట్నం సమీప బొడ్డేపల్లి శివారు వీరవాసరం గ్రామానికి చెందిన రాంబాబుగా గుర్తించారు. అతను కొంతకాలం కుటుంబంతో సహా హైదరాబాద్‌లో ఉండేవాడని, అతడి ప్రవర్తన నచ్చక భార్య విడిచిపెట్టి వెళ్లిపోయిందని తెలిసింది. దీంతో ఉన్మాదిగా మారి, పలు ప్రాంతాల్లో సంచరిస్తూ పెందుర్తి వచ్చాడని చెబుతున్నారు. ఇక్కడికి వచ్చిన తరువాత ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థలో పనిచేస్తూ పెందుర్తి ప్రశాంతినగర్‌లో నివసించేవాడని, కొద్దిరోజులుగా అక్కడ కనిపించడం లేదని అంటున్నారు. గత నెలలో పెందుర్తి అఖిలేశ్వరి ఆస్పత్రి వద్ద నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్‌ సెల్లార్‌లో వాచ్‌మన్‌ భార్య, కుమారుడు నిద్రస్తుండగా గుర్తుతెలియని వ్యక్తి ముఖంపై కొట్టి  తీవ్రంగా గాయపరిచాడని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇదే తరహాలో వారం క్రితం చినముషిడివాడలో నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్‌లో వృద్ధ దంపతులు హత్యకు గురయ్యారు. వారం రోజుల వ్యవధిలో సుజాతనగర్‌లో వాచ్‌మన్‌ భార్య హత్యకు గురయ్యారు. ఈ మూడు ఘటనలు ఒకే తీరుగా ఉండడం, అన్నీ సోమవారం రోజునే జరగడం చర్చనీయాంశమైంది. కాగా, ఆ హత్యలు తానే చేశానని పోలీసుల విచారణలో అనుమానితుడు అంగీకరించినట్టు తెలిసింది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని సీఐ అశోక్‌కుమార్‌ చెప్పారు. 

Read more