గ్రామ స్వరాజ్యానికి పాలకుల తూట్లు

ABN , First Publish Date - 2022-10-03T09:36:07+05:30 IST

గ్రామ స్వరాజ్యానికి తూట్లు పొడుస్తున్న నేటి పాలకుల తీరును వ్యతిరేకిస్తూ ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నాయకులు, సర్పంచ్‌లు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా పార్టీ పిలుపు మేరకు

గ్రామ స్వరాజ్యానికి పాలకుల తూట్లు

టీడీపీ నేతలు, సర్పంచ్‌ల నిరసనలు 

గాంధీజీ విగ్రహాలకు వినతి పత్రాల అందజేత


అమరావతి, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి), పెనుకొండ, ముండ్లమూరు, తాళ్లూరు: గ్రామ స్వరాజ్యానికి తూట్లు పొడుస్తున్న నేటి పాలకుల తీరును వ్యతిరేకిస్తూ  ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నాయకులు, సర్పంచ్‌లు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా పార్టీ పిలుపు మేరకు నియోజకవర్గ కేంద్రాల్లోని గాంధీజీ విగ్రహాలకు, చిత్రపటాలకు పాలాభిషేకాలు నిర్వహించి, పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు. 11డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను  గాంధీజీ విగ్రహాలకు సమర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ గ్రామ స్వరాజ్యానికి ఆయువుపట్టులాంటి స్థానిక సంస్థల నిధులను వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించడంతో పల్లెల్లో అభివృద్ధి అటకెక్కిందని పేర్కొన్నారు. ఈ దుర్మార్గ ప్రభుత్వంపై పార్టీలకు అతీతంగా సర్పంచ్‌లు తమ హక్కులు, నిధుల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వం మళ్లించిన ఆర్థిక సంఘ నిధులు రూ.7,660కోట్లను వెంటనే గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే, గ్రామ సచివాలయాలను, వలంటీర్లను పంచాయతీల్లో విలీనం చేసి, సర్పంచ్‌ ఆధ్వర్యంలో పనులు జరిగేలా చూడాలని, మూడేళ్లుగా ఆపిన ఆర్ధిక సంఘ నిధుల్ని వెంటనే విడుదల చేయాలని, ఉపాధి హామీ పథకం నిధులు, పనులను పంచాయతీల అధీనంలోకి తీసుకురావాలని, పంచాయతీలకు ఉచిత విద్యుత్‌ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్‌ చేశారు.


సంతలో సర్పంచ్‌ల భిక్షాటన

పంచాయతీ నిధుల మళ్లింపునకు నిరసనగా శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని వారపు సంతలో పెనుకొండ మండలం రాంపురం సర్పంచ్‌ శ్రీనివాసులు ఆధ్వర్యంలో జోలెపట్టి భిక్షాటన చేశారు. జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందించి, పంచాయతీ నిధులు విడుదల చేసేలా జగన్‌కు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరారు. ప్రకాశం జిల్లా శంకరాపురంలోనూ సర్పంచ్‌ కూరపాటి మహేశ్వరి ఆధ్వర్యంలో వినూత్నరీతిలో నిరసన తెలిపారు. గ్రామ సచివాలయ ఆవరణలో గాంధీ గాంధీ విగ్రహానికి ఉపసర్పంచ్‌ రమాదేవితో కలిసి వినతిపత్రం సమర్పించారు. మహాత్మా.. జగన్‌కు మంచి బుద్ధిని ప్రసాదించి గ్రామాలు అభివృద్ధి చెందేలా చూడాలని కోరారు.  


వైసీపీ సర్పంచ్‌ ఆధ్వర్యంలో నిరసన

గ్రామ పంచాయతీకి చెందిన 15వ ఆర్థిక సంఘం నిధులను దారిమళ్లింపునకు నిరసనగా ప్రకాశం జిల్లా సర్పంచ్‌ల సంఘం ఉపాధ్యక్షుడు, వైసీపీకి చెందిన విఠలాపురం సర్పంచ్‌ మారం ఇంద్రసేనారెడ్డి, ఆ పార్టీ కార్యకర్తలు గాంధీజీ చిత్రపటానికి వినతిపత్రం అందజేశారు. ఆదివారం విఠలాపురంలో గాంధీజయంతి కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. నిధులను ప్రభుత్వం వాడుకోవడంతో పంచాయతీల్లో అభివృద్ధి కుంటుపడుతోందని, ప్రభుత్వం స్పందించి నిధులు విడుదుల చేయాలని కోరారు.

Read more