-
-
Home » Andhra Pradesh » Protest under the auspices of Sadhana Samiti-NGTS-AndhraPradesh
-
ఏపీకి మోదీ అన్యాయం: నేతల మండిపాటు
ABN , First Publish Date - 2022-07-05T07:58:52+05:30 IST
ఏపీకి అడుగడుగునా అన్యాయం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ ఏ ముఖం పెట్టుకుని మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు వచ్చారని

ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో నిరసన
విజయవాడ(గవర్నర్‌పేట), జూలై 4: ఏపీకి అడుగడుగునా అన్యాయం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ ఏ ముఖం పెట్టుకుని మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు వచ్చారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే.రామకృష్ణ నిలదీశారు. అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణ సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌కు మోదీ మరోసారి ద్రోహం చేశారని..., బీజేపీ, కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో సోమవారం విజయవాడ లెనిన్ సెంటర్‌లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టగా పోలీసులు భగ్నం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న రామకృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన చట్ట హామీలు అమలయ్యేవరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధి, పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణం, కేంద్రీయ విద్యాసంస్థల ఏర్పాటు, కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు తదితర హామీలకు కేంద్ర ప్రభుత్వం తగు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, సీపీఎం నాయకుడు ిసీహెచ్ బాబూరావు మాట్లాడుతూ ఏపీలో బీజేపీ లేదు కనుక ఏపీకి ప్రాధాన్యం ఇవ్వడం లేదని విమర్శించారు. నరేంద్ర మోదీ కనీసం ఏపీ వైపు కూడా చూడరని, ఇక్కడి బిజెపీ నాయకులను ఖాతరు చేయరని అన్నారు. రాష్ట్ర ప్రజలకు కేంద్రం చాలా విషయాల్లో బకాయి పడి ఉందని, ఇప్పటికైనా ఏపీకి దక్కాల్సిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. రవీంద్రనాథ్, నేతలు సీహెచ్ కోటేశ్వరరావు, బి. రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. ఆందోళన చేస్తున్న నేతలను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి భవానీపురం స్టేషన్‌కు తరలించారు. పోలీసు స్టేషన్లలో కూడా నేతలు, కార్యకర్తలు నిరసన కొనసాగించారు.