ఎమ్మెల్సీ ఇక్బాల్‌కు నిరసన సెగ

ABN , First Publish Date - 2022-12-10T02:38:23+05:30 IST

వైసీపీ ఎమ్మెల్సీ మహమ్మద్‌ ఇక్బాల్‌కు సొంత పార్టీ నుంచి నిరసన సెగ తగిలింది.

ఎమ్మెల్సీ ఇక్బాల్‌కు నిరసన సెగ

పోలీస్‌ పహారా నడుమ కార్యక్రమం కొనసాగింపు

చిలమత్తూరు, డిశంబరు 9: వైసీపీ ఎమ్మెల్సీ మహమ్మద్‌ ఇక్బాల్‌కు సొంత పార్టీ నుంచి నిరసన సెగ తగిలింది. శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలో శుక్రవారం ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎమ్మెల్సీ వెళ్లారు. తమ మండలంలో గడప గడపకు రావద్దని ఆ పార్టీకి చెందిన ఎంపీటీసీలు, నాయకులు అడ్డుకున్నారు. ఆ క్రమంలో చిలమత్తూరు-3 ఎంపీటీసీ నాగమణి భర్త నాగరాజు ఒంటిపై పెట్రోల్‌ పోసుకున్నాడు. దీంతో ఉద్రిక్తతకు దారి తీసింది. చిలమత్తూరు మండలంలోని తుమ్మలకుంట, వడ్డిచెన్నంపల్లి, కాపుచెన్నంపల్లి గ్రామాల్లో శుక్రవారం గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు, అధికార పార్టీ నాయకులు సన్నహాలు చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్సీ ఇక్బాల్‌ను 544-ఈ జాతీయ రహదారిలో తుమ్మలకుంట క్రాస్‌ వద్ద అసమ్మతి నాయకులు అడ్డుకున్నారు. ఎంపీటీసీలు నాగమణి, కవిత, సనమ్‌ హుస్నా, నాగమణి భర్త నాగరాజు, సనమ్‌ హుస్నా భర్త షాకీర్‌, కవిత భర్త హరి తదితరులు రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు వారిని పక్కకు లాగిపడేసే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్సీ కలగజేసుకుని, ఇది ప్రభుత్వ కార్యక్రమమని, అందురూ వచ్చి పాల్గొనాలని కోరారు. అయితే, తమకు కనీస సమచారం ఇవ్వకుండా మండలంలో కార్యక్రమం ఎలా ఏర్పాటు చేస్తారని ఎంపీటీసీలు ఆయనను నిలదీశారు. ఇలా చేస్తే ప్రజలకు ఏం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. తాము లేకుండానే గడప గడపను నిర్వహించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పార్టీలో తమకు న్యాయం జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎంపీటీసీ నాగమణి భర్త నాగరాజు వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ని ఒంటిపై పోసుకున్నాడు. పోలీసులు అడ్డుకునే సమయంలో తోపులాట జరిగి పెట్రోలు నాగరాజు కళ్లల్లో పడటంతో కింద పడిపోయాడు. దీంతో అసమ్మతి నాయకులు ఇక్బాల్‌ డౌన్‌, డౌన్‌, గోబ్యాక్‌ ఇక్బాల్‌ అని నినాదాలు చేశారు. నాగరాజును చికిత్స కోసం చిలమత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఎమ్మెల్సీ ఇక్బాల్‌ తుమ్మలకుంటలో పోలీసు పహారా నడుమ గడప గడపకు కార్యక్రమాన్ని పూర్తి చేశారు.

Updated Date - 2022-12-10T02:38:24+05:30 IST