రాజధాని మార్పు సరికాదు!

ABN , First Publish Date - 2022-09-26T08:23:29+05:30 IST

ఆంధ్ర రాజధాని అమరావతిని మార్చాల్సిన అవసరం లేదని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌ అన్నారు. ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్‌ పేరు తీసేసి వైఎ్‌సఆర్‌ పేరు పెట్టడం వల్ల వచ్చే ప్రయోజనమేదీ ఉండదని చెప్పారు. తాను తటస్థ వాదిని కానని..

రాజధాని మార్పు సరికాదు!

వర్సిటీల పేర్లు మార్చితే ఏమీ రాదు..

రాజకీయ ప్రయోజనమూ ఉండదు

ఉచితాలు సాధికారత చేకూర్చాలి..

వ్యసనపరులను చేయకూడదు

‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’లో ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌


ఆంధ్ర రాజధాని అమరావతిని మార్చాల్సిన అవసరం లేదని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌ అన్నారు. ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్‌ పేరు తీసేసి వైఎ్‌సఆర్‌ పేరు పెట్టడం వల్ల వచ్చే ప్రయోజనమేదీ ఉండదని చెప్పారు. తాను తటస్థ వాదిని కానని.. స్వతంత్ర వాదినని చెప్పారు. చంద్రబాబు అయినా, కేసీఆర్‌ ఆయినా, జగన్‌ అయినా.. తాను ఏది నిజమని నమ్మితే అదే చెబుతానని స్పష్టం చేశారు. ప్రొఫెసర్‌గా, విశ్లేషకుడిగా, జర్నలి్‌స్టగా, ఆర్థికవేత్తగా, హక్కుల నేతగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితమైన ఆయన.. ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వేమూరి రాధాకృష్ణ నిర్వహించే ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’లో పలు అంశాలపై మాట్లాడారు. ‘అమరావతి విషయంలో చంద్రబాబు గ్రాఫిక్స్‌ చూపించాడని అన్నాను. అమరావతిని మార్చి మూడు రాజధానులు చేయడం సరైనది కాదనీ అన్నాను. టీడీపీ అభిమానులకు జగన్‌ను తిడితేనే రుచిస్తుంది. వైసీపీ అభిమానులకు చంద్రబాబును తిడితేనే నచ్చుతుంది.


అలా చేస్తేనే వారి దృష్టిలో నేను తటస్థంగా ఉన్నట్లు. చూసేవాళ్లు తటస్థంగా ఉంటే నేను తటస్థుడినో కాదో తెలుస్తుంది. ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్చి వైఎస్సార్‌ పేరు పెట్టడాన్ని తప్పని చెప్పాను. వర్సిటీ పేరు మార్చడం వల్ల రాజకీయంగా ప్రయోజనం వస్తుందనీ అనుకోను. కావాలనుకుంటే ప్రతి బస్తీలో వైఎ్‌సఆర్‌ క్లినిక్‌ పెట్టండి. ప్రతి వాడలో వైఎ్‌సఆర్‌ డయాగ్నస్టిక్‌ కేంద్రం పెట్టండి. వచ్చిన ప్రతి ఒక్కరూ ఆయన్ను తలచుకుంటారు. రాజశేఖర్‌రెడ్డి రెండుసార్లు అధికారంలోకి వచ్చారు. ఏ పథకానికైనా ఆయన పేరుందా..? అన్నింటికీ రాజీవ్‌, ఇందిర పేర్లే పెట్టాడు. అయినా గెలిచాడు కదా! రాజశేఖర్‌రెడ్డి ప్రభావం వల్ల జగన్‌ కూడా గెలిచాడు కదా! ప్రజలు పేర్లతో గుర్తుంచుకోరు.. హృదయాల్లో గుర్తు పెట్టుకుంటారు’ అని తెలిపారు. ఇంకా ఏమన్నారంటే..


ప్రతి ఉచితమూ మంచిది కాదు..

పరిపాలనను మెరుగుపరిచి ఓట్లు అడగడం కన్నా.. జనాన్ని ఆకర్షించి ఓట్లు అడగడం పాలకులకు ఇప్పుడు సులువైంది. ప్రతి ఉచిత పథకం మంచిదని చెప్పలేం. ఉచితాలు వ్యక్తిని సాధికారత వైపు మళ్లించాలి.. వ్యసనపరుడిని చేయకూడదు. అప్పట్లో ఎన్టీఆర్‌ రూ.2కిలో బియ్యం ఇచ్చారు. అప్పుడు మార్కెట్‌ ధరలో అది సగం. అయినా విమర్శలొచ్చాయి. ఇప్పుడు రేషన్‌ కార్డుల సంఖ్య జనాభా కంటే ఎక్కువగా ఉంటుందేమో! మార్కెట్‌లో సన్న బియ్యం కిలో రూ.40 ఉంది. దానిని రూ.10 కిలో చొప్పున రేషన్‌ షాపుల్లో ఇవ్వమనండి.. రూ.1కి కిలో బియ్యాన్ని రూ.10 చేసిన ప్రభుత్వం అని ప్రతిపక్షాలు, మీడియా గగ్గోలు పెడతాయి. ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది.. నాకెందుకని రాజకీయ నాయకుడు అనుకుంటున్నాడు. ప్రజల్లో చైతన్యం రావడమే దీనికి పరిష్కారం.


ఏ పార్టీ సభ్యత్వమూ లేదు..: నేను నమ్మే సిద్ధాంతం ఏంటంటే.. దేన్నయినా విమర్శనాత్మకంగా చూడడం. చదవడం. ఇలాంటి విధానం వల్ల మనం నిత్యం నేర్చుకుంటాం. ఇప్పుడు వామపక్షాలు దేశంలో ఎందుకు బలహీనపడుతున్నాయి..? వారు నేర్చుకోవడం లేదు. సమాజాన్ని చూడడం లేదు. సమస్యలపై మాట్లాడడం లేదు. పురాణాలను పుక్కిడి పురాణాలని కొట్టిపారేయడం ఎంత వరకు కరెక్టు. అది కోట్లాది ప్రజల విశ్వాసం. నాకు ఏ వామపక్ష పార్టీలోనూ సభ్యత్వం లేదు. జనం సమస్య ఆధారంగా కమ్యూనిస్టుల రాజకీయ ఎత్తుగడ ఉండాలని 2009లో చెప్పాను. 14 ఏళ్లయినా కమ్యూనిస్టులకు ప్రజాదరణ లేదు. అంటే జనం వారిని అర్థం చేసుకోలేదు. మార్పునకు తగినట్లు నిలబడితే తప్పకుండా కమ్యూనిస్టులకు భవిష్యత్‌ ఉంటుంది. కేరళలో వైఖరి మార్చుకుని రెండోసారి అధికారంలోకి వచ్చారు కదా!

Read more