వైసీపీ పాలనలో రైతులకు అన్యాయం

ABN , First Publish Date - 2022-12-13T22:51:58+05:30 IST

: వైసీపీ పాలనలో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, వ్యవసాయశాఖ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. మాండస్‌ తుఫాన్‌ కారణంగా దెబ్బతిన్న పంటలను ఆయన కొండపి ఎమ్మెల్యే డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి దామచర్ల సత్యన్నారాయణతో కలిసి మంగళవారం పరిశీలించారు.

వైసీపీ పాలనలో రైతులకు అన్యాయం
దెబ్బతిన్న పొగ మొక్కలను పరిశీలిస్తున్న సోమిరెడ్డి, ఎమ్మెల్యే స్వామి, సత్య

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి విమర్శ

దెబ్బతిన్న పొగాకు, శనగ పైర్ల పరిశీలన

నష్టపోయిన వారిని ఆదుకోవాలని డిమాండ్‌

కొండపి, డిసెంబరు 13 : వైసీపీ పాలనలో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, వ్యవసాయశాఖ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. మాండస్‌ తుఫాన్‌ కారణంగా దెబ్బతిన్న పంటలను ఆయన కొండపి ఎమ్మెల్యే డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి దామచర్ల సత్యన్నారాయణతో కలిసి మంగళవారం పరిశీలించారు. జరుగుమల్లి మండలం చిర్రికూరపాడులో రైతులతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి, రైతులను ఇబ్బందుల పాల్జేసిందని ధ్వజమెత్తారు. వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు, సబ్సిడీపై సూక్ష్మపోషకాలు, మైక్రో ఇరిగేషన్‌, భూసార పరీక్షలన్నింటినీ అటకెక్కించిందని దుయ్యబట్టారు. వ్యవసాయానికి అర్థం తెలియని మంత్రి ఇప్పుడు ఆశాఖకు ఉన్నారని ఎద్దేవా చేశారు. తొలుత పాలేటిపాడు, సాధువారిపాలెం, కె.ఉప్పలపాడు గ్రామాల్లో పొగాకు పంటను సోమిరెడ్డి పరిశీలించారు. కె.ఉప్పలపాడులో రైతులు గుండపనేని శంకర్‌, బండి కోటేశ్వరరావులను అడిగి పంట నష్టం వివరాలను తెలుసుకున్నారు. అనంతరం చిర్రికూరపాడులో దెబ్బతిన్న శనగ పంటను పరిశీలించారు. కార్యక్రమంలో టీడీపీ ఒంగోలు పార్లమెంటు అధ్యక్షుడు నూకసాని బాలాజీ, ఉపాధ్యక్షుడు గొర్రెపాటి రామయ్య చౌదరి, నాయకులు బొడ్డపాటి యల్లమందనాయుడు, యర్రమోతు శ్రీనివాసులు, పోకూరి రవీంద్రబాబు, పోటు శ్రీనివాసమురళి, పేముల విజయనిర్మల, ఏలూరి రాంబాబు, రావిపాటి మధుసూదనరావు, గుండపనేని రామ్మూర్తినాయుడు, దామా మురళి పాల్గొన్నారు.

మంత్రులకు పంట పొలాలను పరిశీలించే తీరికలేదు

సింగరాయకొండ : తుఫాన్‌ ప్రభావంతో కురిసిన వర్షాలతో పంటలు దెబ్బతిని రైతులు పుట్టెడు దుఃఖంలో ఉంటే కనీసం పొలాలను పరిశీలించే తీరక కూడా మంత్రులకు లేకుండాపోయిందని సోమిరెడ్డి విమర్శించారు. జిల్లా మంత్రి, ఇన్‌చార్జి మంత్రి, పొరుగు జిల్లాలోనే ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి కానీ పొలాలను సందర్శించకపోవడాన్ని బట్టి వారికి రైతులపై ఏపాటి ప్రేమ ఉందో అర్థమవుతుందన్నారు. తక్షణమే పంట నష్టాన్ని అంచనావేసి రైతులకు పరిహారాన్ని అందజేయాలని డిమాండ్‌ చేశారు. మండలంలోని చినకనుమళ్లలో తుఫాన్‌ వలన దెబ్బతిన్న పొలాలను మంగళవారం ఎమ్మెల్యే స్వామి, టీడీపీ ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, దామచర్ల సత్యలతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలో మినుము, మిర్చి పం టలు సాగు చేసిన రైతులు భారీగా నష్టపోయారన్నారు. మిర్చి దాదాపు 200 ఎకరాల వరకూ దెబ్బతింటే ఇంతవరకూ వ్యవసాయాధికారులు పంట నష్టాన్ని అంచనా వేయకపోవడం దుర్మార్గమన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అఽధ్యక్షుడు వేల్పుల సింగయ్య, కూనపరెడ్డి సుబ్బారావు, బైరపనేని మోహన్‌రావు, చిగురుపాటి గిరి, సుదర్శి చంటి, గుదే వెంకటేశ్వర్లు, బసవయ్య, కళ్లగుంట నరసింహ, ఓలేటి రవిశంకర్‌రెడ్డి ఉన్నారు.

నిష్పక్షపాతంగా పంట నష్టం అంచనా వేయాలి

వైసీపీ నేతల జోక్యాన్ని నివారించాలి

రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలి

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి డిమాండ్‌

టంగుటూరు, డిసెంబరు 13 : పంట నష్టం అంచనాలను నిష్పక్షపాతంగా తయారు చేయాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కోరారు. ఈవిషయంలో వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకుల జోక్యం లేకుండా చూడాలన్నారు. తుఫాన్‌ వలన పంట నష్టపోయిన ప్రతి రైతుకూ వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. మాండస్‌ తుఫాన్‌తో కురిసిన భారీ వర్షాలకు కొండపి నియోజకవర్గంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు ఆయన మంగళవారం టంగుటూరు వచ్చారు. జాతీయ రహదారిలో ఐవోసీ ఎదురు ఉన్న దామచర్ల వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రకాశం, నెల్లూరు ఉమ్మడి జిల్లాల్లోనే పొగాకు రైతులు 1.35లక్షల ఎకరాల్లో పంట నష్టపోయారని తెలిపారు. పెట్టుబడి, రాబడి రూపంలో రూ.1,500 కోట్లపైన నష్టపోయారని తెలిపారు. వారిని అన్ని విధాలా ఆదుకోవాల్సి ఉందన్నారు. పొగాకు బోర్డు వద్ద రూ.600 కోట్లకు పైగా ఉన్న రైతుల సొమ్మును వారి కోసం వినియోగించాలని కోరారు. బ్యారన్‌కు రూ.50వేలు వడ్డీ లేని రుణం ఇవ్వాలని, ఇప్పటికే బ్యాంకు వారు బ్యారన్‌కు ఇచ్చిన రూ.5లక్షల రుణాన్ని రీషెడ్యూల్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. రైతులకు ఎకరాకు రాష్ట్ర ప్రభుత్వం రూ.20వేలు, బోర్డు రూ.20వేలు మొత్తం రూ.40వేలు పరిహారం చెల్లించాలని కోరారు. శనగకు ఎకరాకు రూ.20వేలు, మినుముకు రూ.30వేలు, మిర్చికి రూ.40వేలు, వరికి ఎకరాకు రూ.15వేలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. విలేకరుల సమావేశంలో కొండపి ఎమ్మెల్యే డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య, పార్టీ ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, కందుకూరు టీడీపీ ఇన్‌చార్జి ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T22:52:01+05:30 IST