చిక్కీల్లో పురుగులు!

ABN , First Publish Date - 2022-09-25T06:17:24+05:30 IST

మండలంలోని దారంవారిపాలెం ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పంపిణీ చేసిన చిక్కీల్లో చెక్క పురుగులు బయటపడ్డాయి.

చిక్కీల్లో పురుగులు!
చెక్క పురుగులతో ఉన్న చిక్కీలు

కాలం చెల్లినవి పంపిణీ  

ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు

తిని అనారోగ్యంపాలైతే బాధ్యులెవరని ఆగ్రహం

తాళ్లూరు, సెప్టెంబరు 24 : మండలంలోని దారంవారిపాలెం ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పంపిణీ చేసిన చిక్కీల్లో చెక్క పురుగులు బయటపడ్డాయి. పాఠశాలలకు దసరా సెలవులు ఇస్తుండటంతో ఒక్కో విద్యార్థికి 14 చిక్కీల వంతున ప్యాకెట్లను శనివారం పంపిణీ చేశారు.  ఇంటికితీసుకెళ్లిన పిల్లలు వాటి కవర్‌ తొలగించి చూడగా చిక్కీలు కంపుకొడుతుండటంతో పాటు, వాటిలో చెక్క పురుగులు కన్పించాయి. ప్యాకెట్లపై తయారీ తేదీలను పరిశీలించగా 22-7-2022గా ముద్రించి ఉంది. చిక్కీలను తయారు చేసిన 15 రోజులులోగా వాటిని వినియోగించుకునేలా విద్యార్థులకు అందజేయాల్సి ఉంది. సెలవులు రావడంతో పాఠశాలలో ఉండిపోయిన కాలం చెల్లిన చిక్కీ ప్యాకెట్లను పిల్లలకు పంపిణీ చేసి ఉపాధ్యాయులు చేతులు దులుపుకున్నారు. చెక్క పురుగులతో కంపుకొడుతున్న చిక్కీలను తిని పిల్లలు అనారోగ్యం పాలైతే బాధ్యులు ఎవరని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. పిల్లల ఆరోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న చిక్కీలు నాసిరకంగా ఉంటున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


Updated Date - 2022-09-25T06:17:24+05:30 IST