టెండర్లకు ఎవరూ రాకే ఆరోసారి పిలుస్తున్నాం

ABN , First Publish Date - 2022-11-30T22:39:25+05:30 IST

కనిగిరి నగర పంచాయతీ పరిధిలో ఒక కోటి 13 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు ఇప్పటికీ ఐదుసార్లు టెండర్లు పిలిచినా ఏ ఒక్క కాంట్రాక్టర్‌ ముందుకురాలేదని, మళ్లీ ఆరోసారి టెండర్లు పిలుస్తున్నామని మునిసిపల్‌ చైర్మన్‌ గఫార్‌ చెప్పారు. నగరపంచాయతీ సమావేశంలో స్వపక్ష సభ్యులే ఎన్నికయ్యాక ఏ ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదని, అలాగే ప్రతి వార్డులో నెలకొన్న సమస్యలను సైతం పరిష్కరించలేకపోతున్నామని అధికార వైసీపీ కౌన్సిలర్లే గళమెత్తడంతో చైర్మన్‌ పైవిధంగా స్పందించారు.

టెండర్లకు ఎవరూ రాకే ఆరోసారి పిలుస్తున్నాం
సమస్యలపై మాట్లాడుతున్న వైస్‌ చైర్‌పర్సన్‌ పులి శాంతి

కనిగిరి నగర పంచాయతీ సమావేశంలో చైర్మన్‌ గఫార్‌

స్వపక్ష వైసీపీ సభ్యులే సమస్యల ఏకరువు

ఏ ఒక్క పనీ చేయలేకపోయామని అసహనం

కనిగిరి, నవంబరు 30 : కనిగిరి నగర పంచాయతీ పరిధిలో ఒక కోటి 13 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు ఇప్పటికీ ఐదుసార్లు టెండర్లు పిలిచినా ఏ ఒక్క కాంట్రాక్టర్‌ ముందుకురాలేదని, మళ్లీ ఆరోసారి టెండర్లు పిలుస్తున్నామని మునిసిపల్‌ చైర్మన్‌ గఫార్‌ చెప్పారు. నగరపంచాయతీ సమావేశంలో స్వపక్ష సభ్యులే ఎన్నికయ్యాక ఏ ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదని, అలాగే ప్రతి వార్డులో నెలకొన్న సమస్యలను సైతం పరిష్కరించలేకపోతున్నామని అధికార వైసీపీ కౌన్సిలర్లే గళమెత్తడంతో చైర్మన్‌ పైవిధంగా స్పందించారు. స్థానిక నగరపంచాయతీ కార్యాలయంలో బుధవారం అత్యవసర మున్సిపల్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అధికార పార్టీకి చెందిన కౌన్సిల్‌ సభ్యులు పలు సమస్యలపై మున్సిపల్‌ చైర్మన్‌ గఫార్‌ను నిలదీశారు. మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ పులి శాంతి మాట్లాడుతూ తమ వార్డులో మురుగు కాల్వల్లో తీసిన చెత్తను పారిశుధ్య సిబ్బంది రోడ్లపైనే పడవేసి వెళ్తున్నారన్నారు. ఆ కుప్పలు కుళ్లి దుర్వాసనతోపాటు దోమలు ప్రబలి ప్రజలపై దాడి చేస్తున్నాయని చెప్పారు. తీసిన తడి చెత్తను వెంటనే తొలగించే ఏర్పాట్లు చేయాలని కోరారు. మోడల్‌ వార్డుగా తీసుకున్నప్పటికీ అలాంటి అభివృద్ధి జరగటం లేదని అసహనం వ్యక్తం చేశారు. పట్టణంలో ఆవులు, కోతులు, పందులు, కుక్కల సంచారం ఎక్కువైందని, పామూరు బస్టాండు సెంటరులో ఆవులు వాహన రాకపోకలకు అంతరాయం కల్గిస్తున్నాయని సభ్యులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. సమావేశంలో 50 అంశాలతో కూడిన అజెండాను తీర్మానించారు. వాటిలో 49 అంశాలకు ఆమోదించారు. అయితే 15వ ఆర్థిక సంఘం నిధుల కింద మరో 2 కోట్ల 14లక్షల రూపాయలకు సిమెంటు రోడ్లు, సీసీ డ్రైనేజీలకు చెందిన పనులకు టెంటర్లు పిలవనున్నట్లు చైర్మన్‌ తెలిపారు. సమావేశంలో కమిషనర్‌ డీవీఎస్‌ నారాయణరావు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T22:39:25+05:30 IST

Read more