జల‘కల’!

ABN , First Publish Date - 2022-11-30T00:47:40+05:30 IST

రైతు సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా పడకేస్తున్నాయి. వారికి ఉపకరించే మరొక కీలక పథకమైన వైఎస్సార్‌ జలకళ విషయంలోనూ రాష్ట్రప్రభుత్వం చేతులెత్తేసింది. ఉమ్మడి జిల్లాలో 25,648 మంది రైతులు దరఖాస్తు చేసుకొంటే అందులో 2,863 బోర్లు మాత్రమే రెండేళ్లలో తవ్వారు. వాటిలో 10 శాతం కూడా వినియోగంలోకి రాలేదు.

జల‘కల’!

దరఖాస్తులు 24,648.. తవ్విన బోర్లు 2,863

10శాతం కూడా వినియోగంలోకి రాని దుస్థితి

విద్యుత్‌ సౌకర్యం కల్పనలో చేతులెత్తేసిన ప్రభుత్వం

ఖర్చును రైతులే భరించాలంటూ మెలిక

ఆందోళనలో అన్నదాతలు

పొలాల్లో దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్న బోర్లు

జలకళ పథకంలో భాగంగా గిద్దలూరు నియోజకవర్గంలోని బేస్తవారపేట మండలం కోనపల్లెలో 25మందికి బోర్లు వేయగా నలుగురికి మాత్రమే స్తంభాలు ఏర్పాటు చేశారు. ట్రాన్స్‌ఫార్మర్లు బిగించలేదు. అలాగే అర్ధవీడు మండలంలో ముగ్గురి భూములకు లైన్లు వేశారు. ట్రాన్స్‌ఫార్మర్ల ఊసే మరిచారు. దీంతో రెండేళ్ల నుంచి బోర్లు మూతతోనే దర్శనమిస్తున్నాయి.

త్రిపురాంతకం మండలంలో జలకళ కింద 446 బోర్లు వేయించారు. కేవలం 22 బోర్లకు మాత్రమే విద్యుత్‌ కనెక్షన్‌ ఇచ్చారు. దూరం పెరిగి ఖర్చు ఎక్కువయ్యే రైతుల బోర్లకు కనెక్షన్‌ ఇవ్వలేదు. దీంతో వారికి ఎదురుచూపులే మిగిలాయి. పంటలను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు.

ఇదీ జిల్లాలో వైఎస్సార్‌ జలకళ పథకం దుస్థితి. బోర్ల తవ్వకానికి నియోజకవర్గానికో రిగ్గు లారీ అంటూ వైసీపీ రంగులు వేసి మరీ ఆర్భాటంగా విజయవాడలో సీఎం ప్రారంభించారు. అయితే రెండేళ్లు పూర్తయినా ఆ పఽథకం లబ్ధి జిల్లాలోని రైతులకు అందలేదు. సాగునీటి సదుపాయం లేని సన్న, చిన్నకారు రైతులకు ఉచితంగా బోరు తవ్వకం, మోటారు ఏర్పాటు, విద్యుత్‌ సౌకర్యం కల్పిస్తామని చేపట్టిన పఽథకం సర్కారు నిర్లక్ష్యంతో నిర్వీర్యమైంది. కీలకమైన విద్యుత్‌ సౌకర్యం కల్పనపై ప్రభుత్వం చేతులెత్తేయడంతో చతికిలపడిపోయింది.

ఒంగోలు, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): రైతు సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా పడకేస్తున్నాయి. వారికి ఉపకరించే మరొక కీలక పథకమైన వైఎస్సార్‌ జలకళ విషయంలోనూ రాష్ట్రప్రభుత్వం చేతులెత్తేసింది. ఉమ్మడి జిల్లాలో 25,648 మంది రైతులు దరఖాస్తు చేసుకొంటే అందులో 2,863 బోర్లు మాత్రమే రెండేళ్లలో తవ్వారు. వాటిలో 10 శాతం కూడా వినియోగంలోకి రాలేదు. విద్యుత్‌ కనెక్షన్ల విషయంలో జాప్యమే ఇందుకు కారణం. ఈ పథకం కొత్తగా వైసీపీ ప్రభుత్వం చేపట్టిందేమీ కాదు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో బాగా అమలై రైతులకు ఉపకరించిన పఽథకమే. ఆ మాటకు వస్తే అంతకుముందు సీఎంగా కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్న రోజుల్లో 2012లో ఇందిర జలప్రభ పేరుతో ప్రారంభించారు.

టీడీపీ హయాంలో వేలల్లో లబ్ధిదారులు

2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్‌ జలసిరి పేరుతో మరింతగా రైతులకు ఉపకరించేలా చేశారు. లబ్ధిదారులు పరిమితంగా వాటా ధనం సమకూర్చితే మిగిలిన ఖర్చును డ్వామా, విద్యుత్‌ శాఖలు సమకూర్చి బోర్ల తవ్వకం, మోటార్ల ఏర్పాటు, విద్యుత్‌ సౌకర్యం కల్పించారు. కొన్నిరోజుల తరువాత సాధారణ విద్యుత్‌కు బదులుగా సోలార్‌ విద్యుత్‌ సౌకర్యం కల్పించారు. వందలాది గ్రామాల్లో వేలాది బోర్లు ఈపథకం కింద వేశారు. సుమారు ఆరున్నర వేల బోర్లు అప్పట్లో ఇలా ఎన్టీఆర్‌ జలసిరి పఽథకం కింద ఏర్పాటు చేయగా, పలు గ్రామాల్లోని మెట్ట భూమి ఉన్న చిన్న,సన్నకారు రైతులకు ఎంతో ఉపకరించింది. అప్పట్లో ఉమ్మడి జిల్లాలోని మార్టూరు మండలం ఇసుకదర్శి గ్రామంలోనే 200కుపైగా బోర్లు వేయగా మిర్చి, వరి, ఇతర పంటలను విస్తారంగా సాగుచేశారు. త్రిపురాంతకం, ముండ్లమూరు, బల్లికురవ, దర్శి, చీమకుర్తి ఇలా సాగర్‌ ఆయకట్టు ఉండే పలు ప్రాంతాల్లో భారీగా బోర్లు వేయడంతో రైతులకు ఉపయోగపడింది. ఒక్కో బోరుకు మొత్తం మీద రూ.3లక్షల నుంచి రూ.3.50 లక్షల వరకు అప్పట్లో ప్రభుత్వం ఖర్చుచేసింది.

ఆర్భాటం తప్ప ఆచరణ లేదు

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల నుంచి వాటా ధనం కూడా అవసరం లేదని హడావుడి చేశారు. పూర్తి ఉచితమని ప్రకటించారు. బోర్ల తవ్వకానికి ఒక్కో నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఒక రిగ్గు అందుబాటులో పెడుతున్నామని ఆ లారీలకు అప్పట్లో వైసీపీ రంగులు వేసి మరీ 2020 అక్టోబరు 28న విజయవాడలో పఽథకాన్ని ప్రారంభించారు. అనంతరం రిగ్గులను జిల్లాలకు పంపించారు. జిల్లాస్థాయిలో డ్వామా పర్యవేక్షణలో ఈ పథకం అమలు చేయాల్సి ఉండగా వేలాదిమంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 25,648 మంది రైతులు దరఖాస్తు చేసుకోగా వాటిని వీఆర్వోలు పరిశీలించి ఆ భూమి వారికి చెందినదేనంటూ 20,762 దరఖాస్తులకు క్లియరెన్సు ఇచ్చారు.

బిల్లులు రాక నత్తనడక

అంచనాలు రూపొందించి రూ.47.02కోట్ల వ్యయంతో 6,022 బోర్ల తవ్వకానికి పరిపాలనా ఉత్తర్వులు ఇచ్చారు. వాటిలో 2,863 బోర్లను మాత్రమే ఏజెన్సీలు తవ్వి 2,180కి సంబంధించిన రూ.11.17కోట్ల బిల్లులను అప్‌లోడ్‌ చేసినట్లు తెలుస్తోంది. అందులో సగం డబ్బులు కూడా ఏజెన్సీలకు ఇంతవరకు రాలేదని సమాచారం. అత్యధికంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో 516 బోర్లు తవ్వగా, అద్దంకిలో 496, పర్చూరులో 325, కందుకూరులో 304, ఎస్‌ఎన్‌పాడులో 152, మార్కాపురంలో 317, కొండపిలో 164, కనిగిరిలో 147, గిద్దలూరులో 172, దర్శిలో 186 బోర్లు తవ్వారు. అయితే బోర్ల తవ్వకమే అంతంతమాత్రంగా ఉండగా మోటారు ఏర్పాటు, విద్యుత్‌ సౌకర్యం ఇచ్చి ఆ బోరు ద్వారా నీటిని తీసి పంటలు పండించే పరిస్థితి పట్టుమని పదిశాతం ప్రాంతాల్లో కూడా జరగలేదు.

చేతులెత్తేసిన సర్కారు

జలకళకు భారీ ఎత్తున వ్యయమవుతున్న విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన ప్రభుత్వం పథకం విషయంలో చేతులెత్తేసింది. తొలుత కరెంటు సౌకర్యాన్ని పూర్తి ఉచితంగా కల్పిస్తామని చెప్పిన పాలకులు తరువాత కొంతకాలానికి రూ.2 లక్షలు మాత్రమే ఇస్తామని, మిగతాది రైతులు భరించాలని మెలిక పెట్టారు. ఇటీవల దానిని కూడా మార్చి మొత్తం ఖర్చు రైతు భరించాల్సిందేనని బండవేశారు. బోర్లు తవ్విన పొలాలు ప్రస్తుతం విద్యుత్‌ సౌకర్యం ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండటంతో స్తంభాలు, వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు వంటివి తడిసిమోపెడవుతున్న పరిస్థితి. జిల్లాలో తవ్వకం జరిగిన 2,863 బోర్లలో అధికారులు 1,546 బోర్లకు విద్యుత్‌ సౌకర్యం కల్పనకు అంచనా వేస్తేనే దాదాపు రూ.31 కోట్లు అవసరమవుతుందని గుర్తించారు. ఇలా భారీగా ఖర్చుచేయాల్సి రావడంతో చివరకు విద్యుత్‌ భారం రైతులపైనే నెట్టేస్తున్నారు. అయితే అంతా ఉచితమని ప్రభుత్వం చెబితే ఆశతో దరఖాస్తు చేసుకొన్న రైతులు విద్యుత్‌ కోసం లక్షలు ఎక్కడ తేగలమంటుండంతో తవ్విన బోర్లలో 10శాతం కూడా వినియోగంలోకి రాక జిల్లాలో వైఎస్సార్‌ జలకళ పఽథకం వెలవెలపోతోంది.

Updated Date - 2022-11-30T00:47:40+05:30 IST

Read more