ఇంటర్‌ సర్టిఫికెట్ల కోసం ఎదురుచూపులు

ABN , First Publish Date - 2022-11-08T00:56:14+05:30 IST

ఈ ఏడాది ఇంటర్మీడియెట్‌ పాసైన విద్యార్థులు ఒరిజనల్‌ సర్టిఫికెట్ల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వీటి కోసం విద్యార్థులు కళాశాలల చుట్టూ తిరుగుతున్నారు.

ఇంటర్‌ సర్టిఫికెట్ల కోసం ఎదురుచూపులు

కళాశాలల చుట్టూ విద్యార్థుల ప్రదక్షిణలు

పదో తరగతిదీ అదే పరిస్థితి

ఒంగోలు(విద్య), నవంబరు 7 : ఈ ఏడాది ఇంటర్మీడియెట్‌ పాసైన విద్యార్థులు ఒరిజనల్‌ సర్టిఫికెట్ల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వీటి కోసం విద్యార్థులు కళాశాలల చుట్టూ తిరుగుతున్నారు. జూన్‌లో ఫలితాలు విడుదలైనప్పుడు ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకున్న పొట్టి మార్కుల జాబితాలతో ఇంజనీరింగ్‌ కళాశాలల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్థులపై ఒరిజనల్‌ మార్కుల మెమోల కోసం కళాశాలల యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయి. దీంతో విద్యార్థులు టెన్షన్‌కు గురవుతున్నారు. జిల్లాలో జూన్‌లో జరిగిన ఇంటర్‌ పరీక్షకు 27,567 మంది హాజరు కాగా 16,136 మంది ఉత్తీర్ణులయ్యారు. ఆగస్టులో జరిగిన అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు 11,082మంది హాజరు కాగా 4,099 మంది పాసయ్యారు. అయితే వీరి ఒరిజనల్‌ మార్కుల జాబితాలకు ఇప్పటివరకు అతీగతీ లేదు. దీంతో విద్యార్థులు కళాశాలల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే కళాశాలల వారు సర్టిఫికెట్లు వచ్చిన వెంటనే అందరికీ ఫోన్‌ చేసి చెబుతామంటూన్నారే గానీ ఎప్పుడు వస్తాయో వారికీ తెలియని పరిస్థితి. కాగా పదో తరగతి విద్యార్థులకు సంబంధించిన సర్టిఫికెట్ల జారీ కూడా ఆలస్యమైంది. అయితే ఈనెల మొదట్లో విజయవాడ నుంచి పోస్టు చేసినట్లు సమాచారం. అవి స్కూళ్ల కు చేరుతున్నాయి. అయితే ఇంటర్‌ కంటే ఆలస్యంగా టెన్త్‌ ఫలితాలు విడుదలయ్యాయి. కానీ పదో తరగతి మార్కుల జాబితాలు వచ్చినా ఇంటర్‌వి మాత్రం ఇంతవరకు రాలేదు.

ప్రింటింగ్‌లో మార్కుల జాబితాలు

ఇంటర్‌ మార్కుల జాబితాలు ప్రస్తుతం ప్రింటింగ్‌లో ఉన్నాయని ఆర్‌ఐఓ ఎ.సైమన్‌ విక్టర్‌ తెలిపారు. ఏటా రెగ్యులర్‌, అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారి మార్కుల జాబితాలను ఒకేసారి ప్రింటింగ్‌కు ఇస్తారు. రెగ్యులర్‌గా పాసైన విద్యార్థులు కొందరు ఇంప్రూవ్‌మెంట్‌ కోసం అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరవుతారు. ఈనేపథ్యంలో ఈ రెండు పరీక్షల ఫలితాలు విడుదలయ్యాకే మార్కుల జాబితాలను ఒకేసారి ప్రింటింగ్‌కు ఇస్తారు. ఆన్‌లైన్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న పొట్టి మార్కుల జాబితాలు ఆరు నెలలు చెల్లుతాయని ఆయన తెలిపారు. ఈ నెలాఖరులోగా అన్ని కళాశా లలకు ఇంటర్‌ ఒరిజనల్‌ మార్కులు జాబితాలు బోర్డు నుంచి జారీ అవుతాయని ఆయన తెలి పారు.

Updated Date - 2022-11-08T00:56:17+05:30 IST