పొగాకు బోర్డు సభ్యులుగా మరో ఇద్దరు

ABN , First Publish Date - 2022-10-04T06:37:07+05:30 IST

పొగాకు బోర్డు పాలక మండలిలో జిల్లాకు చెందిన మరో ఇద్దరికి ప్రాతినిఽథ్యం లభించింది.

పొగాకు బోర్డు  సభ్యులుగా  మరో ఇద్దరు
వాసుబాబు, బ్రహ్మయ్య

వ్యాపారుల కోటాలో గుత్తా, రైతు ప్రతినిధిగా బ్రహ్మయ్య

ఒంగోలు, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి) : పొగాకు బోర్డు పాలక మండలిలో జిల్లాకు చెందిన మరో ఇద్దరికి ప్రాతినిఽథ్యం లభించింది. బోర్డు డైరెక్టర్లుగా వ్యాపారుల కోటాలో జిల్లాకు చెందిన పొగాకు వ్యాపారి గుత్తా వాసుబాబు, రైతు ప్రతినిధిగా బొడ్డపాటి బ్రహ్మయ్య నియమితులయ్యారు. ఇప్పటికే జిల్లా నుంచి రైతు ప్రతినిధులుగా మారెడ్డి సుబ్బారెడ్డి, వరప్రసాదరావు  ఉన్నారు. తాజాగా మరో ఇద్దరికి అవకాశం లభించింది. పొగాకు బోర్డు పాలక మండలిలో నలుగురు రైతు, మరో నలుగురు వ్యాపారుల ప్రతినిధులు ఉండగా అందులో సగం మంది ఆంధ్రప్రదేశ్‌ నుంచి, మిగిలిన సగం మంది కర్ణాటక నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాజాగా మరో ఇద్దరు రైతు, ఇద్దరు వ్యాపార ప్రతినిధులను పెంచారు. రాష్ట్రానికి ఒక వ్యాపార, రైతు ప్రతినిధికి అవకాశం లభించగా అవి రెండూ జిల్లాకే దక్కాయి. వ్యాపార ప్రతినిధిగా నియమితులైన గుత్తా వాసుబాబు కుటుంబం సుదీర్ఘకాలంగా పొగాకు వ్యాపారంలో ఉంది. ఆయన తండ్రి జడ్పీ మాజీ చైర్మన్‌ గుత్తా వెంకట సుబ్బయ్య పొగాకు వ్యాపారంలో ప్రముఖునిగా ఉండేవారు. ప్రస్తుతం నిత్యం టుబాకోస్‌ పేరుతో వాసుబాబు వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఇక రైతు కోటాలో కొండపి మండలం చోడవరం గ్రామానికి చెందిన బొడ్డపాటి బ్రహ్మయ్య నియమితులయ్యారు. బీజేపీలో సుదీర్ఘకాలంగా ఉన్న బ్రహ్మయ్య ఆ పార్టీ అనుబంధ రైతు విభాగమైన కిసాన్‌ మోర్చా రాష్ట్రకార్యవర్గ సభ్యుడిగా పనిచేస్తున్నారు. కొండపి వేలం కేంద్రంలో పొగాకు రైతు నాయకుడిగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఇద్దరికీ బోర్డు డైరెక్టర్లుగా అవకాశం రాగా పొగాకు బోర్డు పాలక మండలిలో జిల్లా వాసులసంఖ్య నలుగురికి చేరింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఇలా అధిక మంది జిల్లా వాసులు బోర్డుపాలక మండలిలోకి వచ్చారు. 


Updated Date - 2022-10-04T06:37:07+05:30 IST