చెట్లు.. ఫట్‌...!

ABN , First Publish Date - 2022-09-11T05:30:00+05:30 IST

కనిగిరి ప్రాంతంలో శేషాచలం అడవులు ఉన్నాయి. వాటిలో విస్తారంగా ఎర్రచందనం వృక్షాలు ఉన్నాయి. ఇప్పటికే స్మగ్లర్లు చాలా వరకు నరికి ఇతర ప్రాంతాలకు తరలించారు.

చెట్లు.. ఫట్‌...!

ఇష్టారాజ్యంగా చెట్ల నరికివేత

కనిగిరి ప్రాంతంలో అటవీ సంపద దోపిడీ

జోరుగా అక్రమ రవాణా 

నిబంధనలకు తూట్లు 

బీట్‌లలో తనిఖీలు 

డొల్లమిన్నకుంటున్న అధికారులు

మూమూళ్లు ముట్టడమే కారణమని ఆరోపణలు 

కనిగిరి, సెప్టెంబరు 11 : కనిగిరి ప్రాంతంలో శేషాచలం అడవులు ఉన్నాయి. వాటిలో విస్తారంగా ఎర్రచందనం వృక్షాలు ఉన్నాయి. ఇప్పటికే స్మగ్లర్లు చాలా వరకు నరికి ఇతర ప్రాంతాలకు తరలించారు. వారికి స్థానికంగా కొందరు అక్రమార్కులు ఊతం ఇస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మరోవైపు గ్రేజింగ్‌, చెరువు, వాగు తదితర పోరంబోకు భూములు గ్రామ పంచాయితీల ఆధీనంలో ఉంటాయి. వీటిని సంరక్షిస్తూ వీటిలోని చెట్లను వేలంపాట ద్వారా విక్రయించి గ్రామ పంచాయితీకి జమ చేయాలి. అయితే ఎక్కడా ఇది అమలు కావడం లేదు. దీంతో యథేచ్ఛగా చట్ల నరికివేత, తరలింపు సాగుతోంది. దీంతో చిన్నా, పెద్దా గ్రామ పంచాయితీలు ఏటా రూ.10లక్షల నుంచి 20లక్షల వరకు ఆదాయాన్ని కోల్పోతున్నాయి. 


కనిపించని తనిఖీలు 

కనిగిరి ప్రాంతంలో అధికారికంగా ఆరు టింబర్‌ డిపోలు ఉన్నాయి. సామిల్‌లకు లెక్కే లేదు. మరో పక్క అనుమతులు లేకుండా తోపుడు మిషన్‌లు నడుపుతున్నారు. దీంతో చాలాచోట్ల పొలాల్లో, అటవీ ప్రాంతం నుంచి చిన్న,చిన్న చెట్లను సైతం నరికి అక్రమంగా రవాణా చేసి ఈ సామిల్‌లకు, తోపుడు మిషన్‌ల వద్దకు తరలిస్తున్నారు. కనిగిరిలోని మూడు టింబర్‌ డిపోల్లో విస్తారంగా పెద్దపెద్ద మొద్దులు అక్రమంగా తీసుకు వస్తున్నట్లు ఆరోపణలున్నాయి.


నిబంధనలకు నీళ్లు

గ్రామాల్లో వివిద రకాల చెట్లను నరకాలంటే సంబంధిత గ్రామ పంచాయతీల తీర్మానంతోపాటు అటవీశాఖ అనుమతి తప్పని సరి. అయినప్పటికీ అలాంటి నిబంధనలు తోసిరాజని కొందరు కలపను కొల్లగొడుతున్నారు. కనిగిరి చుట్టు పక్కల ఉన్న వివిధ అటవీ, రెవెన్యూ కొండల్లో ఉన్న భారీ చెట్లను నరికి టింబర్‌ డిపోలు, సామిల్లులకు తరలిస్తున్నారు. కనిగిరి కొండ నుంచి, గొల్లపల్లి, తుమ్మకుంట, హాజీపురం కొండల్లో ఉన్న చెట్లను నరికి అక్రమంగా కలపను తరలిస్తున్నారు. అదేవిధంగా యడవల్లి, పె దారికట్ల వద్ద ఉన్న కొండల నుంచి కూడా అక్రమ తరలింపు కొనసాగుతోంది.  కొందరు కలపను కాల్చి బొగ్గుగా మార్చి ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. హెచ్‌ఎం పాడు మండలంతోపాటు పీసీపల్లి, వెలిగండ్ల మండలంలో బొగ్గు అక్రమ వ్యాపారం జోరుగాసాగుతోంది.


            అధికారులకు మామూళ్లు 

అటవీశాఖ అధికారులకు నెలవారీ మామూళ్లు ముట్టచెప్తూ కలప అక్రమ వ్యాపారం కొనసాగిస్తున్నారన్న  ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ఆయా టింబర్‌డిపోలు, సామిల్లులో తనిఖీలు, పరిశీలనలు కరువయ్యాయన్న చర్చ సాగుతోంది. కనిగిరి ఫారెస్టు పరిధిలో 19 బీట్‌లు ఉండగా, కనిగిరి పట్టణ శివారుల్లో 5 ప్రాంతాల్లో బీట్‌లు ఉన్నాయి. వీటిలో ఏ ఒక్కచోట కట్టుదిట్టమైన తనిఖీలు లేవన్న విమర్శలు వస్తున్నాయి. 

 

మా దృష్టికి రాలేదు

రామిరెడ్డి, కనిగిరి అటవీశాఖాధికారి

కలప అక్రమా రవాణా జరుగుతున్నట్లు ఇంతవరకు మా దృష్టికి రాలేదు. అయినా వాటిపై ప్రత్యేక దృష్టి సారించి ఉన్నాం. ఎక్కడికక్కడ బీట్‌లు ఏర్పాటు చేశాం. ప్రతి బీట్‌లో సిబ్బందిని నియమించాం. ఎక్కడా రవాణా జరిగేందుకు వీలులేదు. ఇక టింబర్‌ డిపోలపై పర్యవేక్షణ, పరిశీలన తప్పకుండా చేస్తాం. అక్రమ కలప బయట పడితే కఠిన చర్యలు తీసుకుంటాం.

Updated Date - 2022-09-11T05:30:00+05:30 IST