దొంగలు దొరికారు!

ABN , First Publish Date - 2022-09-28T06:14:15+05:30 IST

ఇంటి దొంగతనాలు చేయడంలో సిద్ధహస్తులైన పశ్చిమబెంగాల్‌ ముఠాను ఒంగోలు తాలుకా పోలీసులు అరెస్టు చేశారు.

దొంగలు దొరికారు!
పట్టుబడిన బంగారు ఆభరణాలు, నగదును పరిశీలిస్తున్న ఎస్పీ మలికగర్గ్‌

పశ్చిమబెంగాల్‌ ముఠా అరెస్టు

రూ.11.72 లక్షల  సొత్తు స్వాధీనం 

వివరాలు వెల్లడించిన ఎస్పీ మలికగర్గ్‌

ఒంగోలు (క్రైం), సెప్టెంబరు 27 : ఇంటి దొంగతనాలు చేయడంలో సిద్ధహస్తులైన పశ్చిమబెంగాల్‌ ముఠాను ఒంగోలు తాలుకా పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద రూ.11.72 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. వివరాలను ఎస్పీ మలికగర్గ్‌ మంగళవారం వెల్లడించారు. ఆమె కథనం ప్రకారం.. ఇటీవల నగరంలోని శ్రీనగర్‌కాలనీలో నివాసం ఉంటున్న డాక్టర్‌ దొరైరా జు ఇంట్లో చోరీ జరిగింది. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని  పోలీసులు విచారణ ప్రారంభించారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన ముఠా ఈ చోరీ చేసినట్లు తేల్చారు. ఆ ముఠాలోని ముగ్గురు సభ్యులనూ అరెస్టు చేశారు. వారిని విచారించగా అనేక విషయాలు బయటపడ్డాయి.  తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో వీరిపై 10 కేసులు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. ఒంగోలు తాలుకా పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఓ ఇంటిలో భారీ చోరీకి పాల్పడ్డారని తెలిపారు. అదేవిధంగా మద్దిపాడులో కూడా ఈ ముఠా దొంగతనానికి పాల్పడిందని చెప్పారు.


నిందితుల వివరాలు ఇవీ.. 

ముఠాలో సుబిద్‌ అలీఖాన్‌, జుమ్రతి మొల్ల, దిలువర్‌ లష్కర్లు ఉన్నారు. వీరంతా పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లాకు చెందిన వారు. ముగ్గురూ ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడ్డారు. పోలీసులకు దొరికి జైలుకు పోవడం, మళ్లీ బయటకు వచ్చిన తర్వాత చోరీలు చేసి ఆ డబ్బుతో సరదాలు చేయడం వీరు అలవాటుగా మార్చుకున్నారు. మంగళవారం ఉదయం స్థానిక కిమ్స్‌ ఆసుపత్రికి సమీపంలోని ఫ్లైఓవర్‌ బ్రిడ్జి వద్ద  అనుమానాస్పదంగా  సంచరిస్తున్న వీరిని ఒంగోలు డీఎస్పీ యు.నాగరాజు ఆధ్వర్యంలో తాలుకా సీఐ శ్రీనివాసరెడ్డి అరెస్టు చేశారని చెప్పారు. విచారించగా జిల్లాలో రెండు దొంగతనాలు చేసినట్లు అంగీకరించారన్నారు. వారి వద్ద 21 సవర్ల బంగారు ఆభరణాలు, రూ.4లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ చెప్పారు. 


తాలూకా పోలీసులకు అభినందనలు

ప్రతిష్టాత్మకమైన కేసును ఛేదించినందుకు తాలూకా పోలీసులను ఎస్పీ అభినందించారు. డీఎస్పీ యు.నాగరాజు, తాలుకా సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్సైలు దేవకుమార్‌, పి.శరత్‌బాబు, ఏఎస్సై కె.సురేష్‌, హెడ్‌కానిస్టేబుళ్లు కె.రామకృష్ణ, ఆర్‌.రాంబాబు, కానిస్టేబుళ్లు కె.రవికుమార్‌, సీహెచ్‌.అంజిబాబు, మాలిక్‌, సురేష్‌రెడ్డిలకు ప్రశంసాపత్రాలను అందజేశారు.


Read more