పశ్చిమ ప్రకాశం గొంతెండుతోంది..!

ABN , First Publish Date - 2022-08-17T06:13:22+05:30 IST

మార్కాపురం డివిజన్‌లో కరువు తాండవిస్తోంది. భూగర్భజలాలు అడుగంటాయి. భూమిలోకి సుమారు 700 అడుగుల మేర బోరు కోసం తవ్వకాలు చేసినా చుక్కనీరు కూడా పడని పరిస్థితి నెలకొంది.

పశ్చిమ ప్రకాశం గొంతెండుతోంది..!
ట్యాంకర్ల వద్ద నీళ్లు పట్టుకుంటున్న ప్రజలు

మార్కాపురం, ఆగస్టు 16:  మార్కాపురం డివిజన్‌లో కరువు తాండవిస్తోంది.  భూగర్భజలాలు అడుగంటాయి. భూమిలోకి సుమారు 700 అడుగుల మేర బోరు కోసం తవ్వకాలు చేసినా చుక్కనీరు కూడా పడని పరిస్థితి నెలకొంది. వర్షాకాలం ఆరంభమైనప్పటికీ తాగునీటి కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి నెలకొంది.

నిర్వాసిత గ్రామాల ప్రజల ఇక్కట్లు

పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్‌ పరిధిలోని నిర్వాసిత గ్రామాల ప్రజల ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. నిర్వాసిత గ్రామాల్లో అభివృద్ధి పనులను ప్రభుత్వం నిలిపివేసింది. నూతన బోర్ల ఏర్పాటుకు నిబంధనలకు విరుద్ధం. దీంతో ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అటవీ శివారు ప్రాంతాల్లోని బోర్ల నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసి ప్రజలకు అంద జేస్తున్నారు. 

నీరున్నా నిరుపయోగమే...

జిల్లాలోని సాగర్‌ కాల్వలకు నీరు వదిలిన ప్రతిసారీ ఎస్‌ఎస్‌ ట్యాంక్‌లను నింపడం మినహా ప్రజలకు ఒరుగుతున్న ప్రయోజనమేమీ లేదు. ఐదారేళ్లుగా సరైన వర్షపాతం లేక భూగర్భజలాలు అడుగంటాయి.  ఎస్‌.ఎస్‌ ట్యాంక్‌ల నుంచి పైప్‌లైన్లు ఉన్న గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కోట్లాది రూపాయలు ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి ఖర్చుకాగా, నేడు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు ఖర్చవు తోంది. ఈ పరిస్థితి అధికారపార్టీ నాయకులు, అధికారుల జేబులు నింపుకోవడానికి ఉపయోగపడుతుంది. తాగు నీటి సరఫరా పథకాలకు శాశ్వత ప్రాతిపదికన మరమ్మ తులు చేస్తే ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు ఉండవు. అయితే నాయకులకు ట్యాంకర్ల ద్వారా నీటిసరఫరా చేసేందుకు అవకాశం ఉండదు. దీంతో ఈ ప్రక్రియ ముందుకు పోవడం లేదు. 

దూపాడు-1 తాగునీటి పథకం

మార్కాపురం డివిజన్‌లో ఎస్‌.ఎస్‌ ట్యాంక్‌లలో సాగర్‌ నీటిని నింపడానికి 2004లో దూపాడు-1 తాగునీటి పథకం ఏర్పాటుచేశారు.  రూ.20 కోట్లతో శ్రీకారం చుట్టిన పథకానికి త్రిపురాంతకం మండలం దూపాడు వద్ద ఎస్‌.ఎస్‌ ట్యాంక్‌ నిర్మించారు. ఈ పథకంలో భాగంగా త్రిపురాంతకం, ఎర్రగొండపాలెం, పెద్దారవీడు, దోర్నాల మండలాలలో 55 గ్రామాలకు హ్యబిటేషన్లకు సరఫరా చేయాలి. కానీ ఈ పథకం కింద కేవలం 16 గ్రామాలకే తాగునీటి సరఫరా జరుగుతుంది.

నీటి సరఫరా ఇలా...

ఎర్రగొండపాలెం మండలంలో 16 గ్రామాలకు ఈ పథకం ద్వారా తాగునీరు సరఫరా జరగాల్సి ఉంది. అయితే 5 గ్రామాలకు మాత్రమే తాగునీరు సరఫరా జరుగుతోంది.  త్రిపురాంతకం మండలంలో 5 గ్రామాలకు తాగునీటిసరఫరా జరుగుతోంది. పెద్దారవీడు మండలంలో 18 గ్రామాలకు నీటి సరఫరా చేయాల్సి ఉంది. కానీ 13 గ్రామాలకు మూడు, నాలుగు రోజులకోమారు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. 5 గ్రామాలకు తాగునీటి సరఫరా జరగడం లేదు. దోర్నాల మండలంలో ఏడు గ్రామాలకు తాగునీరు సరఫరా చేయాల్సి ఉండగా ప్రజలు సాగర్‌ జలాలు ఇప్పటికీ చుక్క నీరు కూడా చూడలేదు. 

ముటుకుల తాగునీటి పథకం

జిల్లాలో మారుమూల మండలమైన పుల్లలచెరువులో ఫ్లోరైడ్‌ సమస్యను పరిష్కరించేందుకు ముటుకుల తాగునీటి పథకం రూపొందించారు. ఈ పథకాన్ని 2009లో రూ.16 కోట్ల వ్యయంతో ప్రారంభించారు. నిర్మాణం పూర్తి చేయడానికి రూ.16 కోట్లు అయినప్పటికీ నీటి సరఫరాలో అంతరాయం తలెత్తుతుందన్న సాకుతో   ఇప్పటికి మరో రూ.15 కోట్ల మేర ఖర్చయింది. ఈ పథకాన్ని పుల్లలచెరువు, ఎర్రగొండపాలెం, త్రిపురాంతకం మండలాలలో 44 గ్రామాలకు తాగునీటి సరఫరా చేసే లక్ష్యంతో ఏర్పాటు చేశారు. వాటిలో పుల్లలచెరువు మండలంలో 36, వై.పాలెంలో 1, త్రిపురాంతకంలో 3. కానీ నేటికీ ఏ ఒక్క గ్రామానికి కూడా తాగునీటి సరఫరా జరగలేదు. 

గొళ్లపల్లి తాగునీటి పథకం

గొళ్లపల్లి తాగునీటి పథకాన్ని త్రిపురాంతకం మండలం గొళ్లపల్లి వద్ద ఏర్పాటు చేశారు. ఈ పథకాన్ని 2010లో రూ.12 కోట్లతో ప్రారంభించారు. గొళ్లపల్లి వద్ద ఏర్పాటు చేసిన ఎస్‌.ఎస్‌ ట్యాంక్‌ ద్వారా త్రిపురాంతకం మండలంలోని 35 గ్రామాలకు తాగునీటి సరఫరా జరగాల్సి ఉంది. ఇప్పటి వరకు కేవలం 29 గ్రామాలకు పైపులైన్‌ పూర్తికాగా,  22 గ్రామాలలో మాత్రమే నీటి సరఫరా జరుగుతోంది.

ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా

పశ్చిమ ప్రకాశంలో తాగునీటి ఎద్దడిని పరిష్కరించేం దుకు నిర్మించిన ప్రాజెక్ట్‌లన్నీ అపర భగీరధుడుగా ప్రచారం జరుగుతున్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సమయంలోనే పురుడు పోసుకున్నాయి. కానీ నేటికీ ఆ ప్రాజెక్ట్‌ల ఫలాలు ప్రజలకు అందడం లేదు. వాటి వైఫల్యాలను మాత్రం ఆయన తనయుడు పార్టీకి చెందిన వైసీపీ నాయకులు ఆదాయంగా మార్చుకుంటున్నారు. ఈ ప్రాజెక్టుల పరిధిలో ప్రతి రోజూ 900 వందల ట్రిప్పులు ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నారు. ఒక్కొక ట్యాంకర్లకు నీటిని తీసుకువచ్చే దూరం ఆధారంగా బిల్లులు చెల్లిస్తున్నారు. 5 కిలోమీటర్ల లోపు దూరం ఉన్న ట్యాంకర్లకు రూ.400ల చొప్పున, 5 కి.మీటర్ల కంటే ఎక్కువ ఉన్న ట్యాంకర్లకు రూ.540 వంతున చెల్లిస్తున్నారు.

Updated Date - 2022-08-17T06:13:22+05:30 IST