కంపు..కంపు

ABN , First Publish Date - 2022-07-18T05:34:25+05:30 IST

నగరవాసులను మురుగు సమస్య వేధిస్తోంది. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. పెరిగిన నగర పరిధి, జనాభాకు అనుగుణంగా కాలువల నిర్మాణం, అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో ప్రజలకు మురుగు సమస్య నిత్యకృత్యమైంది. వర్షాకాలం ప్రారంభంకావంతో అది మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నప్పటికీ అధికారుల నుంచి ముందస్తు చర్యలు మృగ్యమయ్యాయి.

కంపు..కంపు
ఒంగోలు బాలజీనగర్‌లో నిలిచిన మురుగునీరు (ఇన్‌సెట్లో) జయప్రకాష్‌ కాలనీలో నిలిచి రంగు మారిన నీరు

ఒంగోలు నగరం మురికికూపం

దశాబ్దాలనాటి కాలువలు.. 

అభివృద్ధి ఊసే కరువు

ఎక్కడికక్కడ మురుగు నిలిచి దుర్గంధం

కొద్దిపాటి వర్షానికే వీధులన్నీ జలమయం 

ప్రజల అవస్థలు వర్ణణాతీతం 

నత్తనడకన పోతురాజు కాలువ 

ఆధునికీకరణ పనులు

పారిశుధ్య చర్యలు మొక్కుబడి 

 

ఒంగోలు (కార్పొరేషన్‌ ), జూలై 17 : 


ఒంగోలులో మురుగునీటి పారుదల వ్యవస్థ అధ్వానంగా మారింది. కార్పొరేషన్‌ హోదా లభించి 11 ఏళ్లు గడుస్తున్నప్పటికీ పూర్తిస్థాయిలో డ్రైనేజీల అభివృద్ధి చేపట్టకపోవడంతో వీధులు కంపుకొడుతున్నాయి. అనేకచోట్ల నెలల తరబడి కాలువల్లో పూడిక తీయకపోవడంతో మురుగు ముందుకు కదలని పరిస్థితి నెలకొంది. చిన్నపాటి వర్షం కురిసినా రోడ్లపై దర్శనమిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో కాలువలు లేకపోడం, మరికొన్ని చోట్లా ప్రణాళిక లేకుండా నిర్మించడంతో రోజుల తరబడి మురుగు నిల్వ ఉండి దుర్గంధం వెదజల్లుతోంది. ఏటా ఓపెన్‌ డ్రెయిన్‌ల నిర్మాణ కోసం రూ.40 నుంచి 50 లక్షల వరకూ ఖర్చు చేస్తున్నట్లు చెప్తున్న పాలకులు సమస్య శాశ్వత పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలు మృగ్యమయ్యాయి. అండర్‌ డ్రైనేజీల నిర్మాణం ప్రతిపాదనలకే పరిమితమైంది. నగరంలో మురుగునీటి పారుదలకు ప్రధానమైన పోతురాజు కాలువ ఆధునికీరణ పనులు నత్తతో పోటీపడుతున్నాయి. దీంతో నగరం మురికికూపంగా మారి ప్రజలకు నరకం కనిపిస్తోంది. 


నగరవాసులను మురుగు సమస్య వేధిస్తోంది. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. పెరిగిన నగర పరిధి, జనాభాకు అనుగుణంగా  కాలువల నిర్మాణం, అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో ప్రజలకు మురుగు సమస్య నిత్యకృత్యమైంది. వర్షాకాలం ప్రారంభంకావంతో అది మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నప్పటికీ అధికారుల నుంచి ముందస్తు చర్యలు మృగ్యమయ్యాయి. ఫిర్యాదులు వచ్చిన ప్రాంతాల్లోని కాలువల్లో పూడిక తీత పనులతో కాలం గడిపేస్తున్నారు. మురుగునీటి పారుదల కోసం ఏటా లక్షలు ఖర్చుచేస్తున్నట్లు చెప్తున్న అధికారులు అక్కడక్కడా చిన్నచిన్న కాలువల నిర్మాణాలు చేపట్టడానికే పరిమితమవుతున్నాయి. పురపాలక సంఘం ఏర్పడిన నాటి కాలంలో నిర్మించిన కాలువల ఆధునికీకరణవైపు దృష్టి సారించడం లేదు. దీంతో మురుగు సమస్యతో నగర వాసులు పడుతున్న అవస్థలు వర్ణణాతీతమయ్యాయి. నగరంలో కల్వర్టులు నిర్మించినా కొద్దిపాటి వర్షానికే మురుగు నీరు రోడ్లపై నిలుస్తోంది. ప్రధానంగా బండ్లమిట్ట సెంటర్‌, ఆ సమీపంలోని బొందిలివారి వీధి, ధారావారితోట, ఏకలవ్యనగర్‌తోపాటు నిత్యం రద్దీగా ఉండే కర్నూలురోడ్డు, భాగ్యనగర్‌లో ఇలాంటి దుస్థితి అధికంగా కనిపిస్తోంది.  


ఊసేలేని అండర్‌ డ్రైనేజీ వ్యవస్థ 

జిల్లా కేంద్రమైన ఒంగోలుకు కార్పొరేషన్‌ హోదా లభించి దశాబ్దం గడిచినా ఆ కళ మాత్రం కనిపించడం లేదు. మురుగునీటి సమస్య పరిష్కారానికి అండర్‌ డ్రైనేజీలు నిర్మించాల్సి ఉన్నా అది కార్యరూపం దాల్చలేదు. 2009లో దాదాపు రూ.70 కోట్ల వ్యయంతో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణం కోసం అధికారులు ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపారు. కానీ ప్రభుత్వ అనుమతి లేకపోవడంతో అది కాగితాలకే పరిమితమైంది. ఆ తర్వాత రూ.120 కోట్లతో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ ఏర్పాటుకు జేఎన్‌ఎంయూఆర్‌ఎం (జవహర్‌లాల్‌ నెహ్రూ నేషనల్‌ అర్బన్‌ రెన్యువల్‌ మిషన్‌) పథకం కింద రెండో దశ ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం కోరింది. నేటికీ అధికారులు ఆదిశగా చర్యలు చేపట్టలేదు. 

అంతటా ఇరుకైన కాలువలే...

నగరంలో మురుగునీటి పారుదల కోసం దాదాపు 225 కి.మీ పొడవున కాలువలు ఉన్నాయి. వీటిలో అత్యధికం ఒంగోలు మున్సిపాలిటీగా ఉన్న సమయంలో అప్పటి జనాభాకు అనుగుణంగా నిర్మించినవే. అవన్నీ 9 అంగుళాల నుంచి దాదాపు 2.5 మీటర్ల వరకు వెడల్పు కలిగి ఉన్నాయి. అవిపేరుకు మాత్రమే ప్రధాన కాలువలుగా పిలువబడుతున్నాయి.  కొన్ని ప్రాంతాల్లో ప్రణాళికలు లేకుండా నిర్మించడంతో మురుగునీరు ముందుకు కదలడం లేదు. వీటిని అభివృద్ధి చేయాల్సిన పాలకులు ఆవైపు దృష్టి సారించడం లేదు. మరోవైపు కొన్ని కాలనీల్లో కాలువల నిర్మాణం ఊసేకరువైంది. దీంతో మురుగు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయి ఆయా ప్రాంతాలు దుర్గంధభరితంగా మారాయి. 


వానొస్తే.. మురుగొస్తది

నగరంలో కొద్దిపాటి వర్షం కురిసినా రహదారుల పరిస్థితి అధ్వానంగా తయారవుతోంది. కాలువులు పొంగి మురుగు నీరు రోడ్లపై ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఏటా ఇదే పరిస్థితి నెలకొంటున్నప్పటికీ  సమస్య శాశ్వత పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలు మృగ్యమయ్యాయి. దీనికితోడు వ్యాపార సముదాయల ముందు వాహనాల పార్కింగ్‌ కోసం, ఫుట్‌పాత్‌ వ్యాపారాల కోసం పలువురు కాలువలను ఆక్రమిస్తున్నారు. శ్లాబ్‌, బండలు వేస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో పూడిక తీసే పరిస్థితి లేకుండాపోయింది. మురుగునీటి ప్రవాహానికి అవరోధంగా ఏర్పడుతోంది. 


నత్తనడకన పోతురాజు కాలువ ఆధునికీకరణ 

నగరంలోని మురుగునీరు ప్రవహించే ప్రధానమైన పోతురాజు కాలువ ఆధునికీకరణ పనులు నత్తను తలపిస్తున్నాయి.  మొదటి దశలో దాదాపు రూ.12.5 కోట్లతో పనులు చేశారు. కానీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. అనంతరం రెండో దశలో కాలువ ఉన్న 9 కి.మీ పూర్తిస్థాయిలో అధునికీకరణకు రూ.62.34 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది.  టెండర్లు పిలిచి 2020 జనవరి 20 పనులు ప్రారంభించారు. ఒప్పందం ప్రకారం 24 నెలల్లో పూర్తి చేయాలి. కానీ ఇప్పటి వరకూ కేవలం రూ.2 కి.మీ మాత్రమే చేశారు. అందుకు రూ.15.34కోట్లు ఖర్చు చేశారు. మున్సిపల్‌, రెవెన్యూ అధికారుల మధ్య సమన్వయ లోపంతో పనుల్లో జాప్యం జరుగుతోంది. కాలువపై ఆక్రమణల తొలగింపుఇటీవల కొంతమేర జరిగినప్పటికీ రెవెన్యూ, కార్పొరేషన్‌ అధికారులు కలిసిరాకపోవడంతో అది అర్ధంతరంగా ఆగిపోయింది. అదేసమయంలో ఈ వ్యవహారం ప్రజాప్రతినిధుల పంచాయితీకి కూడా చేరింది. దీంతో ఆక్రమణ తొలగింపులో అలసత్వం చోటుచేసుకోవడంతో అప్పటి వరకూ  చేసిన పనులు అంతగా ప్రయోజనం చేకూర్చలేదు. యథా ప్రకారం కాలువల్లో వ్యర్థాలు చేరి, మురుగుతో మూసుకుపోయింది. కాలువ కట్టపై చెట్లు పెరిగి అడవిని తలపిస్తున్నాయి. వాటితోపాటు గతంలో ఉన్న గృహాలకన్నా ఇటీవల కాలంలో మరికొన్ని గుడిసెలు నిర్మించడంతో కాలువ ఏకరూపత కోల్పోయింది. 



Updated Date - 2022-07-18T05:34:25+05:30 IST