అనుసంధానం అంతంతమాత్రమే!

ABN , First Publish Date - 2022-09-10T06:25:38+05:30 IST

ఓటుకు ఆధార్‌ నెంబరును అనుసంధానం చేసుకునేందుకు ఓటర్లు ఆసక్తి చూపడం లేదు.

అనుసంధానం అంతంతమాత్రమే!

ఉమ్మడి జిల్లాలో 9.26లక్షల మంది ఓటర్లే స్పందించారు

ఇంకా 17.20లక్షల మంది చేయించుకోవాలి

స్పెషల్‌ క్యాంపులు ఏర్పాటుచేసినా ముందుకురాని వైనం

ఒంగోలు (కలెక్టరేట్‌), సెప్టెంబరు 9 : ఓటుకు ఆధార్‌ నెంబరును అనుసంధానం చేసుకునేందుకు ఓటర్లు ఆసక్తి చూపడం లేదు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతి ఒక్క ఓటరు తమ ఆధార్‌ నెంబరుతో అనుసంధానం చేయించుకోవాలని ఆదేశాలిచ్చింది. జిల్లాలో గడిచిన పక్షంరోజుల నుంచి ఈ ప్రక్రియను చేపట్టినా పెద్దగా స్పందన కన్పించడం లేదు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 26,46,544 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటివరకు కేవలం 9,26,074 మంది మాత్రమే తమ ఓటుకు ఆధార్‌ను అనుసంధానం చేయించుకున్నారు. ఈనెల 4న ఉమ్మడి జిల్లాలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద బూత్‌ లెవల్‌ అధికారులు ఆధార్‌ను అనుసంధానం చేసేందుకు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించారు. ఓటర్లు తమ ఆధార్‌ను అనుసంధానం చేసుకునేందుకు ఫారం-8బీని ఇవ్వాల్సి ఉంది. అయితే స్పెషల్‌ డ్రైవ్‌ రోజున కొంతమేర ఆసక్తి చూపారు. ఆ తర్వాత స్పందించడం లేదు. అందిన సమాచారం మేరకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గురువారం సాయంత్రం వరకు 9,26,074 మంది ఓటర్లు ఆధార్‌ నెంబరును అనుసంధానం చేసుకున్నారు.  ఇంకా 17,20,470 మంది చేసుకోవాల్సి ఉంది. 


Read more